English | Telugu
'జగమే తంత్రం' మూవీ రివ్యూ
Updated : Jun 18, 2021
సినిమా పేరు: జగమే తంత్రం (ఒరిజినల్ 'జగమే తందిరమ్')
తారాగణం: ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జేమ్స్ కాస్మో, జోజు జార్జ్, కాలైయరసన్, శరత్ రవి, సౌందరరాజా, దీపక్ పరమేశ్, వడివుక్కరసి, బాబా భాస్కర్, మాస్టర్ అశ్వంత్ అశోక్‌కుమార్
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: వివేక్ హర్షన్
నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
రచన-దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
బ్యానర్: వై నాట్ స్టూడియోస్
విడుదల తేదీ: 2021 జూన్ 18
ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (ఓటీటీ)
ధనుష్ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజవుతోందంటే ఆయన అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు. అభిమానులేమిటి, స్వయంగా ఆయనే తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేశాడు. కానీ థియేటర్లన్నీ 100 శాతం ఆక్యుపెన్సీతో ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీని అయోమయ స్థితి కాబట్టి తప్పనిసరి అన్నట్లు నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైనే నేరుగా 'జగమే తందిరమ్' (జగమే తంత్రం)ను రిలీజ్ చేయాలని నిర్ణయించడంతో ఆయన సరేననక తప్పలేదు. స్వల్పకాలంలోనే ప్రతిభావంతుడైన దర్శకుడిగా మన్ననలు పొందిన కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే...
కథ
మధురైలో ఓ గ్యాంగ్‌ను వెంటపెట్టుకొని గూండాగా చలామణీ అయ్యే సురుళి (ధనుష్)కి ఓ పరోటా హోటల్ కూడా ఉంటుంది. ప్రత్యర్థి గ్యాంగ్‌తో గొడవలో హత్యలు చేసి, కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లాల్సిన స్థితిలో లండన్‌లో ఒక గ్యాంగ్‌స్టర్ తరపున కొద్ది రోజులు పనిచేసే చాన్స్ వస్తుంది. బాగా డబ్బులు ముడతాయనే ఆశతో లండన్ వెళ్తాడు సురుళి. అక్కడ పీటర్ (జేమ్స్ కాస్మో) అనే ఇంగ్లీష్ గ్యాంగ్‌స్టర్‌తో చేతులు కలిపి, అక్కడ శరణార్థుల పాలిట ఆపద్బాంధవుడిలా ఉండే మరో గ్యాంగ్‌స్టర్ శివదాస్ (జోజు జార్జ్) చావుకు కారకుడవుతాడు. అది కూడా శివదాస్ వైపు చేరినట్లు నటించి, శాంతి చర్చలకని పిలిపించి, పీటర్ చేతిలో చనిపోయేట్లు చేస్తాడు. అదివరకే అక్కడ ఓ ఏడేళ్ల పిల్లాడికి తల్లి అయిన అట్టిలా (ఐశ్వర్య లక్ష్మి) అనే తమిళమ్మాయితో ప్రేమలో పడతాడు. శివదాస్‌ను ద్రోహంతో చంపించావంటూ, ఇక శరణార్ధులకు దిక్కెవరంటూ అట్టిలా నిలదీయడంతో తన తప్పు తెలుసుకుంటాడు సురుళి. తల్లి (వడివుక్కరసి) కూడా నీ ద్రోహాన్ని సరిచేసుకుని వచ్చిననాడే మళ్లీ నీ ముఖం చూస్తానంటూ తమ ఊరికి వెళ్లిపోతుంది. సురుళి ఎలా పీటర్‌కు బుద్ధి చెప్పి, తన తప్పును సరిదిద్దుకున్నాడనేది మిగతా కథ.
విశ్లేషణ
ఈ కథ చదివితేనే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎలాంటి సబ్జెక్టును ధనుష్‌తో చేయించాడో అర్థమైపోతుంది. గ్యాంగ్‌స్టర్ల సినిమాలు మనకు కొత్త కాదు. కాకపోతే ఈసారి నేపథ్యాన్ని లండన్‌కు తీసుకువెళ్లాడు సుబ్బరాజ్. దానికో శరణార్ధి సమస్యను జోడించాడు. ఇండియాలో శ్రీలంక శరణార్ధులను గుర్తించడం లేదని, బ్రిటన్ తదితర దేశాలకు తలదాచుకోడానికి వారు వెళ్తాన్నారంటూ దర్శకుడు ఈ సినిమాలో ఓ సమస్యను ఎత్తిచూపాడు. ఆ సమస్య మీద సినిమా తీసినా బాగుండేది. దానికి గ్యాంగ్‌స్టర్ నేపథ్యాన్ని జోడించడం, డబ్బు కోసం ఎంతటి కిరాతకైనా తెగబడే మనిషిగా ధనుష్‌ను చూపించడం అంతగా ఆకట్టుకోలేదు.
అయితే "నేను హీరోను కాను. నాకు విలన్‌గా ఉండటమే ఇష్టం" అని ధనుష్ చేత చెప్పించడం ఆ క్యారెక్టర్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. శివదాస్ పక్కన చేరినట్లు నటించి, అతడిని ధనుష్ చంపించడం కథ ప్రకారం కరెక్టే అయినా.. అది చేసింది ధనుష్ కావడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేని విషయం. అభిమానులైతే అస్సలు భరించలేరు. సురుళి చేసిన ద్రోహానికి బదులు తీర్చుకోవాలని శివదాస్ మనిషి అయిన అట్టిలా అతనికి హాని తలపెట్టడం సమంజసమేననిపిస్తుంది. దీంతో హీరో క్యారెక్టర్ పాతాళానికి పడిపోయిందన్న మాట. సురుళి తన తప్పు తెలుసుకున్నా కూడా మనం ఆ క్యారెక్టర్‌తో సహానుభూతి చెందకుండా దానికి దూరంగా జరిగిపోతాం. సినిమాని బాగా దెబ్బతీసిన అంశం ఇదే. స్టోరీ ట్రీట్‌మెంట్‌లో ఈ నెగటివ్ పాయింట్‌ను డైరెక్టర్ గుర్తించలేకపోయాడా? అట్టిలా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను మాత్రం హృదయాన్ని పిండేసేలా చిత్రీకరించాడు సుబ్బరాజ్.
మధ్య మధ్యలో కామెడీ చమక్కులు ఉన్నా అవి పెద్దగా సినిమాకి ప్రయోజనం చేకూర్చే స్థాయిలో లేవు. సంభాషణలు సన్నివేశానుసారం నడిచాయి. ఎప్పట్లా సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్‌లో ఉంది. శ్రేయాస్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. కొన్ని కెమెరా యాంగిల్స్ సూపర్బ్ అనిపిస్తాయి. సినిమా ఫేట్‌ను డిసైడ్ చేసిన పీటర్, శివదాస్ మీటింగ్ సీన్‌లో అయితే కెమెరా మరింతగా రాణించింది. కానీ ఏం ప్రయోజనం? ఎడిటింగ్ ఓకే. గ్యాంగ్‌స్టర్ మూవీ కాబట్టి రక్తపాతానికీ, గన్ ఫైట్స్‌కూ కొదవలేదు. అవి యాక్షన్ ప్రియులను అలరిస్తాయి.
నటీనటుల అభినయం
ధనుష్ సినిమాలో అతడిని తప్ప మనం ఇంకొకరి మీద మన దృష్టి పోదు. అంతలా తన ఎనర్జీతో, తన నటనా విన్యాసాలతో ఆకట్టుకుంటాడు ధనుష్. ఈ సినిమాలోనూ తన సూపర్బ్ ఎనర్జీని చూపించాడు. సురుళి క్యారెక్టరైజేషన్ పడిపోకుండా ఉన్నట్లయితే ధనుష్ ఇంకా ఆకట్టుకొనేవాడు ఇది ధనుష్ చెయ్యాల్సిన పాత్ర కాదనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్ శివదాస్‌గా జోజు జార్జ్ బాగా ఆకట్టుకున్నాడు. ఆయన లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఆ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడమే కాకుండా, ఆ క్యారెక్టర్‌ను ప్రేమించేట్లు చేస్తాయి.
అట్టిలా పాత్రలో ఐశ్వర్య లక్ష్మి సునాయాసంగా ఇమిడిపోయింది. ధనుష్‌కు ధీటైన నటన ప్రదర్శించింది. విలన్ పీటర్ రోల్‌లో హాలీవుడ్ పాపులర్ యాక్టర్ జేమ్స్ కాస్మో రాణించారు. యస్ ఆర్ నో అంటూ ఆయనకు పెట్టిన మేనరిజం వర్కవుట్ అయ్యింది. శివదాస్ అనుచరులుగా కాలైయరసన్, దీపక్ పరమేశ్, సురుళిని లండన్ తీసుకువెళ్లి, అతడికి ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించే విక్కీగా శరత్ రవి పాత్రోచితంగా నటించారు. వడివుక్కరసి, బాబా భాస్కర్, సౌందరరాజన్‌కు నటించేందుకు ఎక్కువ స్కోప్ లభించలేదు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
'అసురన్', 'కర్ణన్' పాత్రల్లో ధనుష్‌ను చూసిన కళ్లు సురుళి పాత్రలో ధనుష్‌ను చూడ్డానికి ఇబ్బందిపడ్డాయి. 'జగమే తంత్రం' ను రక్షించగలిగేది ఒక్క ధనుష్ మాత్రమే. ఓవరాల్‌గా డిజప్పాయింట్‌మెంట్ కలిగించిన సినిమా.
రేటింగ్: 2.5/5
- బుద్ధి యజ్ఞమూర్తి