English | Telugu
చిరంజీవి మెగాస్టార్ కావడానికి దోహదం చేసిన లక్షణాలివే!
Updated : Jul 27, 2021
మంచి నటుడు గొప్ప విజయం సాధించడం వెనుక ఎన్నో మంచి లక్షణాలు కనిపిస్తాయి. కళాకారుడిగా ఆ వ్యక్తిపడే తపన సన్నిహితులకే బాగా అర్థమవుతుంది. చిరంజీవి మెగాస్టార్‌గా, రెండు దశాబ్దాల పాటు తిరుగులేని నంబర్‌వన్ స్టార్‌గా టాలీవుడ్‌లో రాణించడానికి ఆయనలోని కొన్ని లక్షణాలు దోహదం చేశాయని ఆయన ఒకప్పటి రూమ్మేట్, ఫ్రెండ్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సహవిద్యార్థి నారాయణరావు అభిప్రాయపడ్డారు.
"చిరంజీవికి సంగీతం ఆరోప్రాణం. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న రోజుల్లోనే మ్యూజిక్‌పై విశేషమైన ఆసక్తి, డాన్స్ మీద ఎక్కువ ఏకాగ్రత చూపేవారు. అందువల్లే ఎప్పటికప్పుడు కొత్తరకం డాన్స్ వస్తే వెంటనే నేర్చుకొని సినిమాల్లో వాటిని చేస్తూ అభిమానగణాన్ని పెంచుకుంటూ పోయారు. డిస్కో డాన్స్ వచ్చిన రోజుల్లో అందరికంటే ముందు ఆ డాన్స్‌ను అభ్యసించి, సౌత్ ఇండస్ట్రీలో డిస్కో డాన్సర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత బ్రేక్ డాన్స్ వచ్చినప్పుడూ.. అంతే.. చిరంజీవి బ్రేక్ డాన్స్‌కు దాసోహమైన వాళ్లెందరో!" అని చెప్పారు నారాయణరావు.
"చిరంజీవిలో ఉండే మరో విశిష్ట లక్షణం భావుకత. కథ చెప్పిన దగ్గర్నుంచీ ఆ కథ గురించి ఆలోచిస్తూ, తన పాత్రను అవగాహన చేసుకోడానికి ప్రయత్నిస్తూ, ఆ సినిమా డైరెక్టర్, స్ర్కిప్ట్ రైటర్‌తో పాటు తనూ కూర్చొని వాళ్లకు మంచి మంచి సలహాలు ఇస్తూ సమగ్రమైన కథ తయారుకావడానికి ఎంతగానో దోహదం చేస్తారు. చిరంజీవి కేవలం కమర్షియల్ సబ్జెక్టులతో తీసిన చిత్రాలకే పరిమితం కాకుండా, కళాత్మక విలువలు ఉన్నతంగా ప్రతిబింబించే చిత్రాల్లోనూ నటించారు. శిక్షణ పొందిన నటుడు కదా! ఆయన ఎలాంటి పాత్రలకైనా సరిపోతారు. ఎంత బలమైన ఇమేజ్ ఉన్న హీరో అయినా కథ, ఆ కథా కథనానికి అనుగుణంగా పాత్రను మలచగలిగే సమర్థుడన దర్శకుడి దర్శకత్వంలో ఆ హీరో నటించినప్పుడు, అంతకుముందున్న ఇమేజ్ ప్రమేయం లేకుండా ఆ పాత్ర రక్తి కడుతుందనడానికి 'స్వయంకృషి' హిట్టవడమే ఒక మంచి ఉదాహరణ." అంటారు నారాయణరావు. ఆ తర్వాత చిరంజీవి ఆరాధన, రుద్రవీణ, ఆపద్బాంధవుతుడు లాంటి చిత్రాల్లో ఆ తరహా పాత్రలు పోషించి, తన నటనలోని విలక్షణత్వాన్ని ప్రదర్శించారు.
చిరంజీవిలో ఎంత పరిశీలించినా నెగటివ్ ధోరణి అనేది కనిపించదనేది నారాయణరావు చెప్పే మాట. సెకండ్ ఇన్నింగ్స్‌ను చిరంజీవి ప్రారంభించిన తీరు కూడా ఆ విషయం స్పష్టం చేస్తుంది. మొదట 'ఖైదీ నంబర్ 15'0 అనే అంతర్లీనంగా మంచి మెసేజ్ మేళవించిన కమర్షియల్ మూవీ చేసి, ఆ తర్వాత తొలినాటి స్వాతంత్ర్య సమరవీరుల్లో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా చేసి, తనేమిటో చూపించారు. త్వరలో 'ఆచార్య'గా మనముందుకు రాబోతున్నారు.