English | Telugu

సినిమా హాల్లో పోకిరిరాయుడి చెంప ఛెళ్లుమ‌నిపించిన డిస్కో శాంతి!

 

మ‌న‌దేశంలోని అమ్మాయిల‌కు పోకిరీ రాయుళ్ల బెడ‌ద ఈనాటి స‌మ‌స్య కాదు. అనాది నుంచీ ఉంది. న‌టి డిస్కో శాంతి కూడా ఈ స‌మ‌స్య‌ను ఓసారి ఎదుర్కొన్నారు. అప్ప‌టికి ఆమెకు శ్రీ‌హ‌రితో పెళ్లి కాలేదు. ఇంకా చెప్పాలంటే.. సినిమాల్లోకి రాలేదు. ఓసారి శాంతి, ఆమె చెల్లెలు సినిమా చూడ్డానికి వెళ్లారు. వాళ్ల వెనుక వ‌ర‌స‌లో ముగ్గురు ఆక‌తాయిలు కూర్చొని ఒక‌టే అల్ల‌రి చేస్తున్నారు. వారిలో ఒక‌డు సినిమా మొద‌ల‌య్యాక శాంతి భుజంమీద చెయ్యివేశాడు. వెన‌క్కి తిరిగి గుడ్లురిమి చూశారు శాంతి. చీక‌ట్లో ఆమె ఎంత కోపంగా చూసినా ఏం లాభం?

ఇంకొంత సేప‌య్యాక ఆమె కాలిని ఎవ‌రో తొక్కిన‌ట్ల‌యింది. ఇక శాంతికి కోపం ఆగ‌లేదు. స‌రిగ్గా త‌న సీటు వెనుక‌వున్న వాడిని చెంప‌చెళ్లుమ‌నేలా కొట్టేశారు. దాంతో వాడు కెవ్వుమ‌ని కేక‌వేశాడు. అంతే.. అంతా క‌ల‌క‌లం. ప్రొజెక్ష‌న్ ఆపేసి థియేట‌ర్లో లైట్లు వేశారు. హాలువాళ్లు "ఏమైంది?" అని వ‌చ్చేస‌రికి జ‌రిగింది చెప్పారు శాంతి. ఆ ముగ్గురినీ అప్పుడంద‌రూ తిట్ట‌డం మొద‌లుపెట్టారు. శాంతి చేతుల్లో దెబ్బ‌తిన్న‌వాడి మీద పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని శాంతి ప‌ట్టుప‌ట్టారు.

"నువ్వు పోలీస్ స్టేష‌న్‌కు వ‌స్తావా అమ్మా?" అన్నారు థియేట‌ర్ వాళ్లు. శాంతి ఆ క్ష‌ణంలోనే బ‌య‌లురేరారు. థియేట‌ర్‌వాళ్లు ఆ ఆక‌తాయిల‌ను వెంట తీసుకురాగా ద‌గ్గ‌ర్లో ఉన్న పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి కంప్లైంట్ రాసిచ్చారు శాంతి. ఆ త‌ర్వాతే ఇంటికి వెళ్లారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ ఆక‌తాయి కుర్రాడు ఏడుపు ముఖంతో శాంతి వాళ్ల ఇంటికి వ‌చ్చాడు. "నువ్వు నా చెల్లెలి లాంటి దానివి. ఇంకెప్పుడూ ఏ ఆడ‌పిల్ల‌నూ అల్ల‌రి పెట్ట‌ను. ద‌య‌చేసి పోలీస్ట్ స్టేష‌న్‌లో పెట్టిన కంప్లైంట్ వెన‌క్కి తీసుకో." అని ప్రాధేయ‌ప‌డ్డాడు. అత‌డి మాటల్లో నిజాయితీ, ముఖంలో దీన‌త్వం చూసి శాంతి స‌రేన‌ని, కంప్లైంట్ వెన‌క్కి తీసుకున్నారు.