English | Telugu

'అన్న‌మ‌య్య‌'లో ఆ పాట రాయ‌డానికి 20 నిమిషాలు, తియ్య‌డానికి 2 గంట‌లు ప‌ట్టాయంతే!

 

అక్కినేని నాగార్జున‌కు న‌టునిగా అఖండ‌మైన కీర్తి ప్ర‌తిష్ఠ‌లు తెచ్చిన సినిమా 'అన్న‌మ‌య్య‌'. అంత‌దాకా రొమాంటిక్ హీరోగానో, యాక్ష‌న్ స్టార్‌గానో సినిమాల్లో క‌నిపిస్తూ వ‌చ్చి అటు యూత్‌లో, ఇటు అమ్మాయిల్లో ఎంతో ఇమేజ్ తెచ్చుకున్న నాగ్‌ను వాటికి పూర్తి భిన్న‌మైన భ‌క్తి పాత్ర‌లో చూపించ‌డం అతి పెద్ద సాహ‌సం. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, నాగార్జున క‌లిసి ఆ సాహ‌సం చేసి స‌క్సెస‌య్యారు. అదివ‌ర‌కు 'శివ' సినిమాతో ఒక ట్రెండ్ సృష్టించిన నాగార్జున‌.. 'అన్న‌మ‌య్య' సినిమాతో తెలుగు ప్రాంతాన్ని భ‌క్తి పార‌వశ్యంలో ముంచేశారు.

ఈ సినిమాలో అన్న‌మ‌య్య ప్రేమించిన ఇద్ద‌రు భామ‌లు తిమ్మ‌క్క‌, అక్క‌ల‌మ్మ పాత్ర‌ల్లో ర‌మ్య‌కృష్ణ‌, క‌స్తూరి న‌టించారు. త‌న ఇద్ద‌రు ర‌సాధిదేవ‌త‌ల‌కు అన్న‌మ‌య్య శృంగారార్చ‌న చేస్తే ఎలా ఉంటుంది? ఈ సంద‌ర్భానికి ఓ పాట ఉంటే బాగుంటుంద‌నుకున్నారు రాఘ‌వేంద్ర‌రావు. ఆ పాట‌ను వేటూరితో రాయించాల‌నుకున్నారు. కానీ ఆ టైమ్‌లో వేటూరి బాగా బిజీగా ఉండ‌టం వ‌ల్ల రాయ‌లేక‌పోయారు. అప్పుడు 'అన్న‌మ‌య్య' చిత్ర క‌థార‌చ‌యిత జె.కె. భార‌విని పిలిచి, ఈ పాట రాసే బాధ్య‌త‌ను అప్ప‌గించారు. క‌థ‌కుడు త‌నే కాబ‌ట్టి ఆ పాట సంద‌ర్భం భార‌వికి తెలుసు. అందువ‌ల్ల‌ రాస్తాన‌న్నారు.

పాట రూపం ఎలా ఉండాలో ఒక్క‌సారి ఆలోచించుకున్న భార‌వి కేవ‌లం 20 నిమిషాల్లో ఆ పాట‌ను రాసి రాఘ‌వేంద్ర‌రావుకు చూపించారు. ఆయ‌న‌కు న‌చ్చేసింది. వెంట‌నే మ‌ద్రాసులో ఉన్న సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణికి ఫోన్ చేసి పాట వినిపించారు భార‌వి. ఆ వెంట‌నే దాన్ని మ‌నో చేత పాడించి, రికార్డ్ చేయించేశారు కీర‌వాణి. ఆ మ‌రుస‌టి రోజే రెండే రెండు గంట‌ల్లో ఈ పాట‌ను చిత్రీక‌రించేశారు రాఘ‌వేంద్ర‌రావు. త‌న కెరీర్‌లోనే ఆయ‌న అత్యంత వేగంగా చిత్రీక‌రించిన పాట ఇదే!

"ప‌ద‌హారు క‌ళ‌ల‌కు ప్రాణాలైన నా ప్ర‌ణ‌వ ప్ర‌ణ‌య దేవ‌త‌ల‌కు ఆవాహ‌నం.." అంటూ సాగే ఈ పాట‌ను నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌, క‌స్తూరిపై చిత్రీక‌రించారు. తెర‌పై ఈ పాట‌ను చూస్తుంటే భక్తీ, ర‌క్తీ స‌మ‌పాళ్ల‌లో కుదిరాయి అనిపిస్తుంది. అందుకే శ్రోత‌ల హృద‌యాల్లో ఈ పాట ఇప్ప‌టికీ నిలిచివుంది.