English | Telugu
తెలుగు సినిమాలో తొలి ఘట్టాలు!
Updated : Jul 5, 2021
తెలుగు సినిమా 1931లో పౌరాణిక గాథతో హెచ్.ఎం. రెడ్డి రూపొందించిన 'భక్త ప్రహ్లాద' చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1950-60 కాలంలో స్వర్ణయుగాన్ని చవిచూసింది. టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతూ, కథల విషయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రయాణిస్తూ వచ్చింది తెలుగు సినిమా. ఎందరో మహానటుల్నీ, దర్శకుల్నీ, నిర్మాతల్నీ, సంగీత దర్శకుల్నీ, గాయకుల్నీ, గొప్పగొప్ప ఇతర టెక్నీషియన్లనీ అందించింది. దేశంలో జాతీయ భాష అయిన హిందీలో వచ్చిన చిత్రాలతో పోటీపడుతూ సంఖ్యాపరంగా కొన్నిసార్లు వారికంటే ఎక్కువ సినిమాలను ప్రొడ్యూస్ చేసింది. అలాంటి ఘన చరిత్ర కలిగిన తెలుగు సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర తొలి ఘట్టాలేవంటే...
* తొలి థియేటర్ యజమాని - రఘుపతి వెంకయ్య (1921). మద్రాస్‌లోని గెయిటీ, క్రైన్, రాక్సీ థియేటర్లు.
* ఆంధ్రప్రదేశ్‌లో తొలి థియేటర్ - మారుతీ సినిమా, విజయవాడ (1921). స్థాపకులు: పోతిన శ్రీనివాసరావు
* తొలి తెలుగు టాకీ చిత్రం - 'భక్త ప్రహ్లాద' (1931) (దర్శకత్వం - హెచ్.ఎం. రెడ్డి)
* ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్టూడియో - దుర్గా సినీటోన్, రాజమండ్రి (1936). స్థాపకులు: నిడమర్తి సూరయ్య
* తెలుగులో తొలి దర్శకురాలు - భానుమతి ('చండీరాణి' - 1953)
* తొలి తెలుగు రంగుల చిత్రం - 'లవకుశ' (1963) (దర్శకత్వం - సి. పుల్లయ్య)
* ఉత్తమ నటునిగా అంతర్జాతీయ బహుమతి పొందిన తొలి తెలుగు నటుడు - ఎస్వీ రంగారావు (1964 - జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్, జకార్తా) ('నర్తనశాల'లో చేసిన కీచకుని పాత్రకు)
* సినిమా స్కోప్‌లో నిర్మాణమైన తొలి తెలుగు చిత్రం - 'అల్లూరి సీతారామరాజు' (1974) (దర్శకత్వం: వి. రామచంద్రరావు)
* దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందిన తొలి తెలుగు సినిమా వ్యక్తి - బి.ఎన్. రెడ్డి (1974)
* వినోదపు పన్ను మినహాయింపు పొందిన తొలి తెలుగు చిత్రం - 'తీర్పు' (1975) (దర్శకత్వం: యు. విశ్వేశ్వరరావు)
* ఉత్తమనటిగా తెలుగు సినిమాకు జాతీయ అవార్డు అందించిన నటి - శారద ('నిమజ్జనం' - 1978) (దర్శకత్వం: బి.ఎస్. నారాయణ)
* పాటల రికార్డుల అమ్మకంలో రికార్డులు బ్రేక్‌చేసి గోల్డ్ డిస్క్‌ను పొందిన తొలి తెలుగు చిత్రం - 'శంకరాభరణం' (1981) (దర్శకత్వం: కె. విశ్వనాథ్)
* 3-డిలో నిర్మాణమైన తొలి తెలుగు చిత్రం - 'సాగర్' (1985) (దర్శకత్వం: క్రాంతికుమార్)
* 70 ఎంఎంలో నిర్మాణమైన తొలి తెలుగు చిత్రం - 'సింహాసనం' (1986) (దర్శకత్వం: కృష్ణ)