English | Telugu
ద్రవిడోద్యమ ప్రభావం వల్లే రావణుడిని నాయకునిగా చూపించిన ఎన్టీఆర్!
Updated : Jul 5, 2021
తెలుగులో శ్రీరాముడి పాత్ర పోషణ కంటే ముందే పురాణ వాఙ్మయంలోనే అతి భయంకరమైన ప్రతినాయకుడిగా ప్రసిద్ధిపొందిన రావణాసురుని పాత్రను 'భూకైలాస్' చిత్రంలో పోషించి అద్భుతం అనిపించారు నటసార్వభౌమ నందమూరి తారకరామారావు. అప్పటివరకూ పరమ దుర్మార్గునిగా, రాక్షసునిగా చిత్రితమైన రావణ పాత్రకు ఎన్టీఆర్ ధరించడం వల్ల హీరోయిజం వచ్చింది. తొలిసారిగా తెరపై అందమైన రావణుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ రావణుడు స్త్రీలోలుడు కాడు. వేద వేదాంగాలు ఔపోసన పట్టిన విద్యాధికుడు. ఈ పాత్రను మంచిగా చూపించడం ఒక కొత్త ప్రయోగం. అలా చూపించడానికి కారణం ఎన్టీఆర్‌తో పాటు దర్శకునిలో ఉన్న ప్రగాఢమైన మానవతా దృష్టి. ఒక రకంగా అది సమాజానికి ఎదురీదడం.
'భూకైలాస్' తర్వాత 'సీతారామ కల్యాణం'లో మరోసారి రావణ పాత్రను ధరించారు ఎన్టీఆర్. అందులోనూ రావణుడే కథానాయకుడు. రావణ పాత్రను పోషించడానికి ఆయనపై ప్రధానంగా ద్రవిడోద్యమ ప్రభావం ఉందని సుప్రసిద్ధ కవి దివంగత సి. నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో ద్రవిడోద్యమం ప్రారంభమయ్యాక, రావణాసురుడు దాక్షిణాత్యుడని, ఆర్యులకు వ్యతిరేకంగా ఉన్న ఆయనను దుష్టపాత్రగా చిత్రీకరించారని ద్రవిడులు గట్టిగా వాదించారు. లంకేశ్వరుడైన రావణుని వారు కథానాయకుడిగా రూపకల్పన చేశారు. రావణుడు దుష్టుడు కాడనీ, ఆత్మాభిమానం ఉన్నవాడనీ, సొంత వ్యక్తిత్వం ఉన్నవాడనీ వారు సిద్ధాంతీకరించారు.
మద్రాసులో ఉన్న ఎన్టీఆర్‌కు ద్రవిడ ఉద్యమకర్తలతో ఏర్పడిన పరిచయం ఓవైపు, పురాణ పాత్రలు చదివి ఆకళించుకున్న విజ్ఞానం ఇంకోవైపు, సముద్రాల-పింగళి గార్లతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మరోవైపు.. కలిసి 'భూకైలాస్', 'సీతారామ కల్యాణం' చిత్రాల్లో రావణుని పాత్ర కల్పనకు దోహదం చేశాయి. 'భూకైలాస్' సినిమాలో తల్లిమాటను శిరసావహించే పరమమూర్ఖ శివభక్తునిగా ఆత్మలింగాన్ని సాధించడానికి అతడు పడ్డ అగచాట్లతో ఒక కొత్త రావణుడు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. గొప్ప శివభక్తునిగా ప్రేక్షకుల సానుభూతిని సంపాదించాడు.
'సీతారామ కల్యాణం' పూర్తిగా ఎన్టీఆర్ అభిరుచి మేరకు తీసిన చిత్రం. తన తల్లి కోరిక మేరకు "శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ" అనే జానపద పాటను ఈ చిత్రం ద్వారా తెలుగునాట మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. 1961లో ఈ చిత్రం విడుదలైతే, ఇప్పటికీ ప్రతి శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం సమయంలో ఈ పాట వేయడం ఆనవాయితీగా వస్తోంది.