English | Telugu
సూపర్‌స్టార్ కృష్ణ గురించి మీకు తెలీని నిజాలు!
Updated : Jul 6, 2021
మొదట్లో రెండు మూడు సినిమాల్లో చిన్న పాత్రలు చేసి, ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన 'తేనె మనసులు' చిత్రంతో హీరోగా పరిచయమై, తర్వాత కాలంలో సూపర్‌స్టార్‌గా కృష్ణ ఎదిగిన వైనం అపూర్వం. ఐదున్నర దశాబ్దాల పైగా కెరీర్‌లో 346 సినిమాల్లో నటించిన కృష్ణకు ఒకప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం. తెలుగులో తొలి సినిమా స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు)నీ, తొలి 70 ఎం.ఎం. సినిమా (సిహాసనం)నీ నిర్మించిన ఘనత కృష్ణదే. "ఏ పని చేపట్టినా సాహసంతో ముందుకు సాగుతాడు.. సాధించే దాకా విశ్రమించడు." అనే పేరు పొందిన ఆయన గురించి ఆయన అభిమానుల్లో చాలామందికి సైతం తెలీని విషయాలు చెప్పుకుందాం...
కృష్ణ 1943లో ఇప్పటి గుంటూరు జిల్లాల్లోని బుర్రిపాలెంలో జన్మించారు. 'తేనె మనసులు' చిత్రంలో హీరోగా నటించే ముందు కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారని చెప్పుకున్నాం కదా. వాటిలో జగ్గయ్య హీరోగా నటించిన 'పదండి ముందుకు' (1962) ఒకటి.
కృష్ణ హీరోగా నటించిన 'తేనె మనసులు' చిత్రం 1965 మార్చి 31న విడుదలైంది. ఇక కృష్ణ విలన్‌గా ఒకే ఒక చిత్రంలో నటించారు. అది.. కె. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన 'ప్రైవేటు మాస్టారు' (1967). విశేషమేమంటే 'తేనె మనసులు' సినిమాతో కృష్ణతో పాటు హీరోగా పరిచయమైన రామ్మోహన్ ఈ సినిమాలో హీరోగా టైటిల్ రోల్ పోషించారు.
కృష్ణ 'అల్లూరి సీతారామరాజు' (1974) సినిమా తియ్యడానికి ముందే ఆ పాత్రను 'అసాధ్యుడు' (1968) సినిమాలో పోషించారు. అందులో కథలో భాగంగా వచ్చే అంతర్నాటకంలో ఆయన సీతారామరాజుగా నటించారు. అదే.. తర్వాత కాలంలో ఆయన 'అల్లూరి సీతారామరాజు' సినిమాని తియ్యడానికి ప్రేరేపించింది.
కృష్ణ 1968లో 'అమాయకుడు' అనే సినిమాలో టైటిల్ రోల్ చేశారు. దానికి అప్పటి హాస్యనటుల్లో ఒకరైన అడ్డాల నారాయణరావు దర్శకత్వం వహించారు. ఇది రాజ్ కపూర్ టైటిల్ రోల్ చేసిన 'అనారీ' (1959) సినిమాకు రీమేక్ అనే విషయం చాలా మందికి తెలీదు.
1970లో కృష్ణ తన తమ్ముళ్లు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులతో కలిసి పద్మాలయ సంస్థను స్థాపించారు. తొలి యత్నంగా కె. వరప్రసాదరావు దర్శకత్వంలో 'అగ్ని పరీక్ష' చిత్రాన్ని నిర్మించారు. అందులో కృష్ణ, చంద్రమోహన్ హీరోలుగా నటించారు.
1972లో దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందరో ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. అనేకమంది కరువు బాధతో అల్లాడుతున్నారు. అలా బాధల్లో ఉన్నవారికి ఉడుతాభక్తి సహాయం చెయ్యడం మన ధర్మం అనుకున్నారు కృష్ణ. అనుకున్నదే తడవు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు నాటి యాక్టర్లు, టెక్నీషియన్లు దాదాపు 150 మంది సహకారంతో విజయవాడ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, హైదరాబాద్‌లలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించి, ఏడు లక్షల రూపాయలకు పైగా సేకరించి, ఆ వసూళ్లను యథాతధంగా కరువు బాధితుల నిధికి అందజేశారు. విజయవాడలో ఎన్టీఆర్, హైదరాబాద్‌లో అక్కినేని నాగేశ్వరరావు, తెనాలిలో శోభన్‌బాబు ప్రారంభోత్సవం చేసిన ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో ఒక భాగంగా 40 నిమిషాల పాటు సాగే 'వింత మనుషులు' అనే నాటికలో కృష్ణ హీరోగా నటించారు.
1972లోనే 'జై ఆంధ్ర' ఉద్యమం సందర్భంగా మద్రాసు పానగల్ పార్కు దగ్గర జరిగిన రిలే నిరాహార దీక్షలో కృష్ణ పాల్గొన్నారు.
కృష్ణ నటించిన నూరవ చిత్రం 'అల్లూరి సీతారామరాజు' నిర్మాణానికి ముందే సంచలనం సృష్టించింది. విడుదలైన తర్వాత స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ఆ స్వర్ణోత్సవ సభకు శోభన్‌బాబుతో పాటు హిందీలో డ్రీమ్ గాళ్‌గా పేరుపొందిన హేమమాలిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆసియా, ఆఫ్రికా దేశాల తృతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 1974 జూన్‌లో తాష్కెంట్‌లో జరగగా, అక్కడ పర్యటించిన భారత బృందంలో కృష్ణ, విజయనిర్మల సభ్యులు.
1977లో 'కురుక్షేత్రం' షూటింగ్ జరుగుతుండగా, కృష్ణ గౌరవార్థం న్యూఢిల్లీలోని తెలుగువారు ఒక సభ జరిపి, సత్కరించి ఆయనకు 'నటశేఖర' బిరుదును ప్రదానం చేశారు.
రమేశ్‌బాబు, మహేశ్‌బాబు కంటే ముందే కృష్ణ రెండో కుమార్తె మంజుల బాలనటిగా 'శభాష్ గోపి' (1978)లో ఒక కీలక పాత్ర పోషించారు.