English | Telugu
క్రైమ్ స్టోరీతో విజయనిర్మలను డైరెక్టర్ చేయాలనుకున్న కృష్ణ.. వద్దని వారించిన ఆరుద్ర
Updated : Jun 27, 2021
నేడు విజయనిర్మల రెండవ వర్ధంతి. ఈ సందర్భంగా ఆమె 'మీనా'తో తెలుగులో ఎలా డైరెక్టర్‌గా మారారో చెప్పుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం. విజయనిర్మల నటించిన మూడో చిత్రం 'సాక్షి'. దానికి దర్శకులు బాపు. డైరెక్షన్‌లో ఆయన తీసుకుంటున్న శ్రద్ధ, ఆయన స్టోరీ బోర్డ్ విధానం అవీ చూసినప్పుడు ఓ చిత్రానికి ఎలాగైనా దర్శకత్వం చెయ్యాలనే కోరిక కలిగింది విజయనిర్మలకు. అయితే తొందరపడకుండా మెళకువలన్నింటినీ పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ విధంగా పదేళ్లు సినిమాల్లో నటిస్తూనే, దూరంగా ఉండి దర్శకత్వం గురించి స్టడీ చేశారు. నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే డైరెక్షన్ చేయాలనే కోరికను కృష్ణకు చెప్పారు. ఆయన రెండు పడవల మీద ప్రయాణం వద్దనీ, కొంతకాలం ఆగమనీ సూచించారు.
అలా కొంతకాలం ఆగి, తొలిసారిగా ఓ సినిమాతో దర్శకురాలిగా మారారు. అదీ.. 'కవిత' అనే మలయాళ చిత్రంతో. పైగా అది యాంటీ సెంటిమెంట్ స్టోరీ. ఆ సినిమా విజయం సాధించడమే కాకుండా, దర్శకురాలిగా, నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత తెలుగులో తొలిసారిగా యద్దనపూడి సులోచనారాణి నవల 'మీనా'ను అదే పేరుతో రూపొందించడమే కాకుండా టైటిల్ రోల్‌ను తనే పోషించారు. అది ఘన విజయం సాధించి ఆమెను గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించే సంఖ్యలో సినిమాలు డైరెక్ట్ చేయడానికి దోహదం చేసింది.
నిజానికి 'మీనా'తో కాకుండా ఓ క్రైమ్ స్టోరీతో విజయనిర్మలను తెలుగులో డైరెక్టర్‌గా పరిచయం చేయాలనుకున్నారు కృష్ణ. ఆయన అడగడంతో ఒక సీక్రెట్ ఏజెంట్ స్టోరీని రాశారు ఆరుద్ర. ఆ స్టోరీని కృష్ణ, ఆయన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావుకు వినిపించారు. అందరికీ కథ నచ్చింది. దాంతో డైలాగ్స్ కూడా రాయమనీ, ఆ కథతో విజయనిర్మల డైరెక్టర్ అవుతుందనీ అన్నారు కృష్ణ. అయితే ఆ అభిప్రాయంతో విభేదించారు ఆరుద్ర. క్రైమ్ స్టోరీతో డైరెక్టర్‌గా పరిచయమై, హిట్టయితే అలాంటి స్టోరీలనే ఆమె బాగా తీస్తుందనే ముద్ర పడుతుందనీ, అలా కాకుండా ఒక ఫ్యామిలీ స్టోరీతో డైరెక్టర్ అయితే ఆమె కెరీర్ రాణిస్తుందనీ ఆయన సూచించారు. ఇది సూచన మాత్రమేననీ, మీ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి అని కూడా ఆరుద్ర చెప్పారు.
ఆయన సూచన బాగుందనుకున్న కృష్ణ ఒక ఫ్యామిలీ స్టోరీతోటే విజయనిర్మలను డైరెక్టర్ చేయాలనుకున్నారు. ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్‌గా వస్తున్న యద్దనపూడి సులోచనారాణి 'మీనా' బాగా పాపులర్ అయింది. ఆ కథ విజయనిర్మలనూ ఆకట్టుకుంది. అయితే ఆప్పటికే ఆ నవలను సినిమాగా తీసే ఉద్దేశంతో హక్కులు కొన్నారు అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత డి. మధుసూదనరావు. ఆయన దగ్గర ఆ హక్కులు తీసుకున్నారు విజయనిర్మల. అలా మలయాళంలో తీసిన 'కవిత' తర్వాత తెలుగులో 'మీనా'తో దర్శకురాలిగా పరిచయం అయ్యారామె. 1973 డిసెంబర్ 28న విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులను బాగా మెప్పించి, శతదినోత్సవ చిత్రంగా విజయం సాధించింది.
"నా నవలను పేరున్న దర్శకులే సినిమాగా తీయాలనే అభిప్రాయం నాకుండేది. అందుకే విజయనిర్మల ఈ నవలని సినిమాగా తీస్తున్నారని విని భయపడ్డాను. కానీ చిత్రంచూసి ఎంత ఆనందించానో చెప్పడానికి మాటలు చాలవు అన్నారు." యద్దనపూడి సులోచనారాణి.