English | Telugu

'ముత్యాల ముగ్గు' హీరో శ్రీ‌ధ‌ర్ గురించి మీకు తెలీని నిజాలు!

 

బాపు తీర్చిదిద్దిన‌ 'ముత్యాల ముగ్గు' హీరోగా శ్రీ‌ధ‌ర్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. త‌ర్వాత కాలంలో ఆ పాపులారిటీకి త‌గ్గ హీరో పాత్ర‌లు ల‌భించ‌క‌పోవ‌డంతో, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న దిగులు ప‌డ‌లేదు. న‌ట‌న‌ను ఒక వృత్తిగా భావించి, సాధ్య‌మైనంత వ‌ర‌కు దేన్నీ కాద‌న‌కుండా వ‌చ్చిన అవ‌కాశాల‌ను చేసుకుంటూ వెళ్లారు. అలా 200కు పైగా సినిమాల్లో న‌టించారు. తాగుడు, జూదం లాంటి వ్య‌స‌నాల‌కు దూరంగా ఉండే కొద్దిమంది ఆర్టిస్టుల కోవ‌కు చెందే శ్రీ‌ధ‌ర్ డ‌బ్బు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌ప‌రుడు. సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బును విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చుపెట్ట‌కుండా దూర‌దృష్టితో ఆలోచించి, ఆ డ‌బ్బును భూముల‌పై పెట్టుబ‌డిగా పెట్టారు. 

శోభ‌న్‌బాబు త‌ర‌హాలోనే శ్రీ‌ధ‌ర్ కూడా త‌న పారితోషికం విష‌యంలో చాలా నిక్క‌చ్చిగా ఉంటార‌నే పేరు తెచ్చుకున్నారు. నిజానికి శోభ‌న్‌బాబు కంటే ముందు రియ‌ల్ ఎస్టేట్‌పై పెట్టుబ‌డులు పెట్టింది శ్రీ‌ధ‌ర్‌. అలాగే ఫైనాన్స్ వ్యాపారం కూడా చేసేవారు. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించేవారు. ఆడంబ‌రాల‌కు చోటివ్వ‌కుండా చ‌నిపోయేంత‌వ‌ర‌కు నిరాడంబ‌రంగా జీవించారు.

ఆయ‌న‌ పూర్తిపేరు సూర‌ప‌నేని శ్రీ‌ధ‌ర్‌. రంగ‌స్థ‌ల నుంచి సినిమాల్లోకి వ‌చ్చారు. కాలేజీ రోజుల నుంచే ప‌లు నాట‌కాలు ఆడుతూ వ‌చ్చారు. ఆర‌డుగుల పైగా పొడ‌గ‌రి కావ‌డం, స్ఫుర‌ద్రూపి అవ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింది. 'మంచుతెర' నాట‌కం ఆయ‌న‌కు బాగా పేరు తెచ్చింది. అందులో ఆయ‌నే హీరోగా న‌టించేవారు. 'అమెరికా అమ్మాయి' సినిమాలో హీరోగా వెలుగులోకి వ‌చ్చారు. 'ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా' పాట అప్ప‌ట్లో మంచి పాపుల‌ర్‌. జి. ఆనంద్ పాడిన ఆ పాట‌కు అభిన‌యించింది శ్రీ‌ధ‌ర్‌. ఇక బాపు సినిమా 'ముత్యాల ముగ్గు'తో ఆయ‌న‌కు వ‌చ్చిన పేరు ఎలాంటిదో మ‌న‌కు తెలుసు.

శ్రీ‌ధ‌ర్ 2005 వ‌ర‌కు సినిమాల్లో న‌టించారు. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చే క్ర‌మంలో అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో స్థ‌లాల‌ను ఇచ్చింది. అలా శ్రీ‌ధ‌ర్‌కు సైతం స్థ‌లం ల‌భించింది. దాదాపు ఫిల్మ్‌న‌గ‌ర్ సెంట‌ర్‌లో ఫిల్మ్‌చాంబ‌ర్ గేటుకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఆయ‌న‌దే. చెన్నైలోనూ ఆయ‌న‌కు ప‌లు ఆస్తులున్నాయి. శ్రీ‌ధ‌ర్‌కు ముగ్గురు కుమార్తెలు. కొడుకులు లేరు. త‌న కుటుంబ‌స‌భ్యుల‌నెవ‌రినీ ఆయ‌న సినిమాల్లోకి రానివ్వ‌లేదు. 2007 జూలై 11న శ్రీ‌ధ‌ర్ క‌న్నుమూశారు.