English | Telugu

అభిమానిని పెళ్లి చేసుకున్న విజ‌య్‌! ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసా?

ఒక‌రేమో యంగ్‌ హీరో.. ఇంకొక‌రేమో ఆయ‌న వీరాభిమాని. కానీ విధి ఆ ఇద్ద‌రి విష‌యంలో మ‌రో ర‌కంగా త‌ల‌చింది. తొలిసారి క‌ల‌యిక‌లోనే త‌న ఫిమేల్ ఫ్యాన్స్‌లో ఒక‌మ్మాయితో ఆ హీరో ప్రేమ‌లోప‌డి, పెళ్లిచేసుకుంటాడ‌ని ఎవ‌రు ఊహిస్తారు! త‌మిళ సూప‌ర్‌స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ విష‌యంలో అదే జ‌రిగింది. ఆయ‌న ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి పేరు సంగీత సోర్ణ‌లింగ‌మ్‌. ఆమె శ్రీ‌లంక‌కు చెందిన ఓ త‌మిళ‌మ్మాయి!!

సంగీత తొలిసారి క‌లిసిన‌ప్పుడు విజ‌య్ ఇంకా సూప‌ర్‌స్టార్ కాడు, కోలీవుడ్‌లో స్టార్‌డ‌మ్ కోసం ప్ర‌య‌త్నిస్తోన్న యంగ్ హీరో. 1996లో 'పూవే ఉన‌క్కాగ‌' సినిమా స‌క్సెస్‌ను విజ‌య్ ఎంజాయ్ చేస్తున్న స‌మ‌యంలో తొలిసారి సంగీత‌ను చూశాడు. విజ‌య్‌కు మంచి పేరుతో పాటు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న తొలి చిత్రం అదే. ఆ సినిమా విడుద‌ల‌య్యాక అత‌నికి యూత్‌లో మంచి క్రేజ్ వ‌చ్చింది. కేవ‌లం త‌మిళ‌నాడులోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న త‌మిళులంద‌రికీ ఆ సినిమా తెగ న‌చ్చేసింది.

'పూవే ఉన‌క్కాగ' సినిమా త‌ర్వాత విజ‌య్ త‌న త‌దుప‌రి సినిమా షూటింగ్‌లో ఉండ‌గా, ఒక అంద‌మైన అమ్మాయి అత‌డిని అభినందించ‌డానికి వ‌చ్చింది. ఆమె శ్రీ‌లంక‌కు చెందిన ఒక త‌మిళ పారిశ్రామిక‌వేత్త కుమార్తె. వారు యు.కె.లో సెటిల్ అయ్యారు. 'పూవే ఉన‌క్కాగ‌' మూవీలో విజ‌య్ ప‌ర్ఫార్మెన్స్ చూసి, ఆయ‌న‌కు అభిమాని అయిన ఆమె, ఆయ‌న‌ను ఎలాగైనా క‌లుసుకోవాల‌ని డిసైడ్ చేసుకుంది.

ఆయ‌న‌ను క‌లుసుకొని అభినందించింది. ఇద్ద‌రూ కొద్దిసేపు క‌బుర్లు చెప్పుకున్నారు. తొలిచూపులోనే సంగీత ఆయన హృద‌యాన్ని దోచుకుంది. ఆమెకు అంగీకార‌మైతే, ఓసారి త‌న ఇంటికి వ‌స్తే, త‌న త‌ల్లిదండ్రుల‌ను ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పాడు విజ‌య్‌. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రూ క‌లుసుకుంది విజ‌య్ ఇంట్లోనే. ఆమెను అమ్మానాన్న‌ల‌కు ప‌రిచ‌యం చేశాడు విజ‌య్‌. ఆమె చ‌క్క‌ద‌నం, సింప్లిసిటీ వారిని కూడా ఆక‌ట్టుకున్నాయి. అయితే ఆ అమ్మాయి రానున్న రోజుల్లో త‌మ కోడ‌లు అవుతుంద‌ని మాత్రం వార‌ప్పుడు ఏమాత్రం ఊహించ‌లేదు. ఈ విష‌యాన్ని త‌ర్వాత ఓ సంద‌ర్భంలో విజ‌య్ త‌ల్లి స్వ‌యంగా తెలిపారు.

సంగీత ప‌ట్ల క్ర‌మేపీ విజ‌య్‌లో ప్రేమ పెరుగుతూ వ‌చ్చింది. ఆమె చెన్నైలో ఉండ‌గా, మ‌రోసారి త‌మ ఇంటికి ఆహ్వానించాడు విజ‌య్‌. అప్పుడు ఆయ‌న పేరేంట్స్‌కు అర్థ‌మైంది, కొడుకు ఆమెను ఇష్ట‌ప‌డుతున్నాడ‌ని. మాట‌ల సంద‌ర్భంగా "విజ‌య్‌ను పెళ్లిచేసుకుంటావా?" అని ఆయ‌న తండ్రి సంగీత‌ను అడిగారు. సిగ్గుల మొగ్గ అయిన సంగీత ఆనందంగా అంగీక‌రించింది. విజ‌య్ తండ్రి అప్ప‌టికే సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పేరుపొందిన ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన ఎస్‌.ఎ. చంద్ర‌శేఖ‌ర్‌.

1999 ఆగ‌స్ట్ 25న విజ‌య్‌, సంగీత దంప‌తులుగా మారారు. సంగీత హిందు, విజ‌య్ క్రిస్టియ‌న్‌. ఆమె కోసం హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆమెను పెళ్లాడాడు విజ‌య్‌. అట్ట‌హాసంగా జ‌రిగిన వారి వివాహానికి సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని అనేక‌మంది సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. విజ‌య్‌, సంగీత దంప‌తులకు ఇద్ద‌రు పిల్ల‌లు.. జాస‌న్‌, దివ్య షాషా. ఈరోజు (జూన్ 22) విజ‌య్ 47వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నాడు.