English | Telugu
మధుర గాయని వాణీ జయరామ్ గురించి మీకు తెలీని నిజాలు!
Updated : Jun 22, 2021
అక్కచెల్లెళ్లు లతా మంగేష్కర్, ఆశా భోస్లే తర్వాత 1970 నుంచీ ఒకటిన్నర దశాబ్దం పాటు ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన ఒకేసారి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మధుర గాయని వాణీ జయరామ్. "బ్రోచే వారెవరురా" (శంకరాభరణం), "ఆ లోకయే శ్రీ బాలకృష్ణం" (శ్రుతిలయలు), "మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా" (సీతాకోక చిలుక), "కురిసేను విరిజల్లులే" (ఘర్షణ) లాంటి పాటలతో ఆమె సంగీత ప్రియులను తన గాన మాధుర్యంలో ఓలలాడేట్లు చేశారు. ఆమెకు సంబంధించి చాలా మంది తెలీని విషయాలు...
తల్లిదండ్రులకు ఐదో సంతానంగా తమిళనాడులోని వెల్లూరులో ఆమె జన్మించారు. అప్పటికే నలుగురు కుమార్తెలు కన్న వారు ఐదో సంతానమైనా మగపిల్లాడు పుడతాడని వారు ఊహించారు. ఆమె పూర్తిపేరు కలై వాణి. గత జన్మలో ఆమె కుమారస్వామిని తేనెతో పూజ చేయడం వల్లే మంచి స్వరంతో పుట్టిందంటూ జ్యోతిష్కులు ఆమెకు ఆ పేరు సూచించారు.
కళాకారిణులకు వివాహం వారి కెరీర్‌కు ఒక్కోసారి తీవ్ర అవరోధంగా నిలుస్తుంది. కానీ జయరామ్‌తో పెళ్లి వాణి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. 1969లో వారి వివాహం అయ్యాక, భర్త ప్రోత్సాహంతోనే సినిమా ఇండస్ట్రీలోకి ఆమె ప్రవేశించారు. పెళ్లికి ముందు తాను సినీ గాయనిగా మారతానంటే తండ్రి సుతరామూ ఒప్పుకోలేదు.
వాణి భర్త జయరామ్‌కు సంగీతమంటే ప్రాణం. ఆయన స్వయంగా పండిట్ రవిశంకర్ దగ్గర సితార్ నేర్చుకున్నారు. భర్త, అత్తగారి ప్రోత్సాహంతో అబ్దుల్ రెహమాన్ దగ్గర హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు వాణి.
ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన ఆమె కొంతకాలం బ్యాంకులో ఉద్యోగం చేశారు.
ఆమె గాన మాధుర్యానికి పరవశించిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ఆమెతో మరాఠీ భజనలు రికార్డ్ చేయించుకున్నారు. అంతే కాదు, హృషికేశ్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన 'గుడ్డీ' (1970) చిత్రంలోని పాటలన్నింటీనీ ఆమె చేత పాడించారు వసంత్ దేశాయ్. ఆ సినిమాలో ఆమె పాడిన "బోలే రే పప్పీ హరా.." పాట ఆ రోజుల్లో జనం నోళ్లల్లో విపరీతంగా నానడమే కాకుండా, జాతీయ ఉత్తమ గాయని అవార్డు, తాన్‌సేన్ అవార్డు సహా పలు అవార్డులను సాధించిపెట్టింది.
'శంకరాభరణం' కోసం పాడిన "మానస సంచరిరే" పాటతో రెండో సారి, 'స్వాతికిరణం' చిత్రంలోని "ఆనతినీయరా హరా" పాటతో మూడోసారి జాతీయ ఉత్తమ గాయని పురస్కారాలను అందుకున్నారు వాణీ జయరామ్.
రెండు దశాబ్దాలకు పైనుంచే సినిమా పాటలకు దూరంగా ఉన్న ఆమె శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆమె విడుదల చేసిన 'గీత గోవిందం', 'ఆదిశంకరుని ఆనందలహరి' ఆడియో క్యాసెట్లు బాగా ప్రాచుర్యం పొందాయి.
వాణీ జయరామ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, హర్యాన్వీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా భాషల్లో పాటలు పాడారు. ఆమె భర్త జయరామ్ 2018లో మృతి చెందారు.