Read more!

English | Telugu

ఎన్టీఆర్‌, కృష్ణ మధ్య పదేళ్ళు మాటలు లేకపోవడానికి కారణం ఆ సినిమానే!

సినిమా రంగంలో కొన్ని సంఘటనలు చిత్రంగాను, విచిత్రంగానూ ఉంటాయి. ఒక్కోసారి హీరోల మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాల గురించి వింటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి ఓ సంఘటన నటరత్న ఎన్‌.టి.రామారావు, సూపర్‌స్టార్‌ కృష్ణల మధ్య జరిగింది. తన నెక్స్‌ట్‌ మూవీ ఎన్టీఆర్‌తో తీస్తానని ఒక పబ్లిక్‌ ఫంక్షన్‌లో ఎనౌన్స్‌ చేశారు కృష్ణ. ఆ తర్వాత ఒకరోజు కృష్ణకు ఎన్టీఆర్‌ ఫోన్‌ చేసి ‘బ్రదర్‌ నాతో సినిమా తీస్తాను అన్నారు.. కాల్‌షీట్స్‌ ఇస్తాను చేస్తారా?’ అని అడిగారు. అప్పటికే దేవుడు చేసిన మనుషులు సినిమాను చేసేందుకు కృష్ణ సిద్ధమవుతున్నారు. ఆ సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయం చెయ్యాలనే ఉద్దేశంతో ఆ కథ రెడీ చేయించారు. ఎన్టీఆర్‌ చేస్తానని అన్నారు కాబట్టి ఆ కథలో కొన్ని మార్పులు చేసి ఎన్టీఆర్‌తో తీశారు. 

ఆ తర్వాత కొన్ని రోజులకు అక్కినేనితో దేవదాసు చిత్రాన్ని నిర్మించిన డి.ఎల్‌.నారాయణ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని శోభన్‌బాబుతో చేస్తానని ప్రకటించారు. మరో సినిమా కోసం కృష్ణ దగ్గరకు వచ్చారు డి.ఎల్‌. ఆ సందర్భంలో మరో సినిమా చెయ్యడం ఎందుకు అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని నాతోనే చెయ్యొచ్చు కదా అని అడిగారు కృష్ణ. దానికి డి.ఎల్‌...‘ఆ సినిమా చేద్దామనుకున్న మాట వాస్తవమే కానీ, అంత ఆర్థిక స్తోమత నాకు లేదు. కావాలంటే ఆ స్క్రిప్ట్‌ ఇస్తాను. మీరు చేసుకోండి’ అన్నారు. వెంటనే రచయిత మహారథిని పిలిపించి ఆ కథను సిద్ధం చేయమని చెప్పారు కృష్ణ. కానీ, మహారథి.. ‘ఆ స్క్రిప్ట్‌ వద్దు. నేను రీసెర్చ్‌ చేసి కథ రెడీ చేస్తాను’ అని చెప్పారు. ఆ మరుసటి రోజు అల్లూరి సీతారామరాజు సినిమా చెయ్యబోతున్నాను అని ప్రకటించారు కృష్ణ. ఇది తెలుసుకున్న ఎన్టీఆర్‌.. కృష్ణను పిలిపించారు. ‘అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తున్నారట. అది మేం చెయ్యాలనుకున్నాం’ అన్నారు. దానికి కృష్ణ.. ‘మీరు చేస్తానంటే నేను మానేస్తాను’ అని చెప్పారు. కానీ, దానికి ఎన్టీఆర్‌ ఒప్పుకోలేదు. ‘నేను చేద్దామనుకున్నాను. కానీ, చెయ్యడం లేదు. మీరు కూడా చెయ్యొద్దు’ అన్నారు. అలా అనడానికి రీజన్‌ ఏమిటంటే.. కాషాయ వస్త్రాలు కట్టుకొని అడవుల్లో తిరిగే క్యారెక్టర్‌ అది. ఆ సినిమా ఆడదు అని ఆయన ఉద్దేశం. ఎన్టీఆర్‌ అలా చెప్పిన తర్వాత కూడా కృష్ణ సినిమాను ప్రారంభించారు. అది ఆయనకు కోపం తెప్పించింది. దాంతో కృష్ణతో మాట్లాడడం మానేశారు. ఆ తర్వాత జరిగిన దేవుడు చేసిన మనుషులు శతదినోత్సవానికి కూడా ఆయన హాజరు కాలేదు. 

అల్లూరి సీతారామరాజు రిలీజ్‌ అయిన పదేళ్ళ తర్వాత పరుచూరి బ్రదర్స్‌ని పిలిపించి.. ఆ సినిమాను తాను చెయ్యాలనుకుంటున్నట్టు వారికి చెప్పారు ఎన్టీఆర్‌. అప్పుడు పరుచూరి బ్రదర్స్‌.. ‘కృష్ణగారు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని మీరు ఒకసారి చూడండి’ అని సలహా ఇచ్చారు. అప్పటికే పదేళ్ళ నుంచి మాట్లాడుకోని ఎన్టీఆర్‌, కృష్ణ ఒకసారి స్టూడియోలో ఎదురు పడ్డారు. ఆయన ఎలాగూ మాట్లాడరు కదా అని కృష్ణ మొహం తిప్పుకొని వెళ్లిపోతుండగా.. ‘బ్రదర్‌ ఒకసారి ఇలా రండి’ అని పిలిచి ‘మీరు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని మాకు చూపించండి. మీరు నా పక్కనే ఉండాలి’ అన్నారు. ఆ మరుసటి రోజే ఒక డబ్బింగ్‌ థియేటర్‌లో సినిమా వేసి దగ్గరుండి ఆయనకు చూపించారు కృష్ణ. ఫస్ట్‌హాఫ్‌ పూర్తయిన తర్వాత సినిమా బాగుంది అన్నారు ఎన్టీఆర్‌. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత కృష్ణ భుజం తట్టి చాలా అద్భుతంగా చేశారు అని మెచ్చుకున్నారు. ఆ తర్వాతి రోజు పరుచూరి బ్రదర్స్‌ని పిలిచి మనం అల్లూరి సీతారామరాజు చెయ్యడం లేదు. కృష్ణ చేసిన తర్వాత ఆ సినిమా ఎవరు చేసినా అంత ఇంపాక్ట్‌ రాదు అన్నారు. అయితే సీతారామరాజు క్యారెక్టర్‌ చెయ్యాలన్న తపన ఆయనలో ఉండడం వల్ల ఆ తర్వాత ఎన్టీఆర్‌ చేసిన కొన్ని సినిమాల్లో ఆ గెటప్‌లో కాసేపు కనిపించి తృప్తి పడేవారు.