Read more!

English | Telugu

చిరంజీవి, రామ్‌గోపాల్‌వర్మ సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి అదే రీజన్‌!

1989లో వచ్చిన ‘శివ’ చిత్రంతో టాలీవుడ్‌ లుక్‌నే మార్చేసిన రామ్‌గోపాల్‌వర్మ ఆ తర్వాత క్షణక్షణం, అంతం, రాత్రి, గాయం, రంగీలా వంటి సినిమాలతో ఒక విభిన్నమైన శైలి ఉన్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికే నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలు రామ్‌గోపాల్‌వర్మతో సినిమాలు చేసేశారు. అదే తరం హీరో అయిన చిరంజీవి కూడా ఆర్జీవీతో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. వైజయంతీ మూవీస్‌ అధినేత సి.అశ్వినీదత్‌ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ విషయం వర్మకు చెప్పారు. చిరంజీవికి సూట్‌ అయ్యే ఒక కథను రెడీ చేసి వినిపించాడు వర్మ. చిరుకి కథ నచ్చింది. కానీ, అందులో చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. అయితే వర్మ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. సినిమా స్టార్ట్‌ చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని చిరంజీవికి సర్దిచెప్పారు నిర్మాత అశ్వినీదత్‌. 

ఒక శుభ ముహూర్తాన చిరంజీవి, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్‌ అయింది. సినిమా పేరు ‘వినాలని ఉంది’. టబు హీరోయిన్‌. అప్పట్లో చాలా మంది డైరెక్టర్లు టాకీ కంటే ముందే పాటలు చిత్రీకరించేవారు. అలా ఈ సినిమా కోసం రెండు పాటల్ని చిత్రీకరించారు. చిరంజీవి మాత్రం స్క్రిప్ట్‌ విషయంలో శాటిస్‌ఫై అవ్వలేదు. ఆ విషయాన్ని షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే క్లియర్‌ చేసుకోవాలన్న ఉద్దేశంతో వర్మతో ఈ విషయం డిస్కస్‌ చేశారు. తను అనుకున్న స్క్రిప్ట్‌ని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి వర్మ ఇష్ట పడడు అన్న విషయం చిరంజీవికి, అశ్వినీదత్‌కి తెలిసినా మరోసారి ఆ విషయాన్ని వర్మ దగ్గర ప్రస్తావించారు. కానీ, స్క్రిప్ట్‌ని మార్చడానికి వర్మ ఇష్టపడలేదు. దీంతో సినిమా ఆగిపోయింది. ఒక టాప్‌ హీరో, ఒక టాప్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో రూపొందే సినిమా సడన్‌గా ఆగిపోవడంతో ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

ఆ సినిమా కోసం మణిశర్మ స్వరపరిచిన పాటల్ని చిరంజీవి, గుణశేఖర్‌ కాంబినేషన్‌లో అశ్వినీదత్‌ నిర్మించిన ‘చూడాలని వుంది’ సినిమాలో వాడారు. ఈ సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో తెలిసిందే. సాధారణంగా ఒక కథ సెట్‌ అవ్వకపోతే మరో కథతో ముందుకెళ్తారు. కానీ, ఆ సినిమా ఆగిపోయిన తర్వాత మళ్ళీ చిరు, వర్మ కాంబినేషన్‌లో మరో సినిమా ఎనౌన్స్‌ చెయ్యలేదు, అసలు ఆ ప్రయత్నం కూడా ఎవ్వరూ చెయ్యలేదు.