Read more!

English | Telugu

రెండు హాలీవుడ్‌ సినిమాల ఆధారంగా రూపొందిన బాలీవుడ్‌ సినిమా ఇదే!

ప్రపంచంలోని వివిధ భాషల్లో వచ్చిన కొన్ని సినిమాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని భారతీయ భాషల్లో సినిమాలు రూపొందిస్తుంటారు కొందరు దర్శకులు. మరికొంతమంది డైరెక్టర్లు మక్కీకి మక్కీ కాపీ చేసి తాము సొంతంగా చేసినట్టు బిల్డప్‌ ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే ఏకంగా రెండు హాలీవుడ్‌ సినిమాలు కాపీ చేసి ఒక సినిమాను రూపొందించారన్న విషయం మీకు తెలుసా? ఇది బాలీవుడ్‌లో జరిగింది. 1983లో విడుదలైన ‘ఏక్‌ జాన్‌ హై హమ్‌’ చిత్రాన్ని రెండు హాలీవుడ్‌ సినిమాల ఆధారంగా రూపొందించారు. 

భారతదేశం గర్వించదగ్గ నటుడు, దర్శకుడు, నిర్మాత రాజ్‌కపూర్‌ మూడో కుమారుడు రాజీవ్‌ కపూర్‌ను హీరోగా పరిచయం చేస్తూ రాజీవ్‌ మెహ్రా ‘ఏక్‌ జాన్‌ హై హమ్‌’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో దివ్యా రాణా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలోని ఫస్ట్‌హాఫ్‌ అంతా 1979లో వచ్చిన హాలీవుడ్‌ మూవీ ‘గోయింగ్‌ స్టడీ’ ఆధారంగా చేశారు. సెకండాఫ్‌కు ‘ఎండ్‌లెస్‌ లవ్‌’ అనే హాలీవుడ్‌ మూవీ ఆధారం. అప్పట్లో ‘ది బ్లూ లగూన్‌’ అనే సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బ్రూక్‌ షీల్డ్స్‌ ‘ఎండ్‌లెస్‌ లవ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. మార్టిన్‌ హెవిట్‌ హీరోగా నటించాడు. ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఇప్పుడు టాప్‌ హాలీవుడ్‌ హీరో అయిన టామ్‌ క్రూజ్‌ ఈ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్‌ చేయడం ద్వారా నటుడిగా పరిచయమయ్యాడు. 

‘ఏక్‌ జాన్‌ హై హమ్‌’ సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకు ‘గోయింగ్‌ స్టడీ’ చిత్రాన్ని తీసుకున్నారు. సెకండాఫ్‌ను ‘ఎండ్‌లెస్‌ లవ్‌’ చిత్రంతో పూర్తి చేశారు. రెండు సినిమాలను కాపీ చేసి తీసినప్పటికీ అప్పట్లో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. మ్యూజికల్‌గా రికార్డులు క్రియేట్‌ చేసింది. అను మాలిక్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ‘యాద్‌ తేరీ ఆయేగీ.. ముజ్‌కో బడా సతాయేగి..’, ‘ఆస్మా పే లిఖ్‌దూ నామ్‌ తేరా..’, ‘బోలో కుచ్‌తో బోలో..’ వంటి పాటలు అప్పట్లో మారుమోగిపోయాయి. ఈ చిత్రంలో హీరోగా నటించిన రాజీవ్‌ కపూర్‌ ఆ తర్వాత తండ్రి రాజ్‌కపూర్‌ దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్‌ మూవీ ‘రామ్‌ తేరి గంగా మైలి’ చిత్రంలో హీరోగా నటించాడు. ఆ తర్వాత నటుడుగా, నిర్మాతగా, ఎడిటర్‌గా పలు బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ కపూర్‌ 2021లో కన్ను మూశారు.