Read more!

English | Telugu

ఆ మూడు విషయాలే.. ఆ అగ్రహీరో పతనానికి కారణమయ్యాయి!

సినిమాల్లో హీరో అంటే ఎలా ఉండాలి? ఆరడుగుల ఎత్తు ఉండాలి, ఆకర్షణీయమైన రూపం ఉండాలి. తన నటనతో అందర్నీ ఆకట్టుకోవాలి. ఇన్ని లక్షణాలు ఉంటేనే హీరోగా రాణిస్తారు, అందరి అభిమానాన్ని పొందుతారు. ఎత్తు విషయంలో హీరోలకు కొంత మినహాయింపు ఉంది అని కొందరు హీరోలు నిరూపించారు. పాతతరం హీరోల్లో పైన చెప్పుకున్న లక్షణాలన్నీ ఉన్న హీరో హరనాథ్‌. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన హరనాథ్‌ జీవితంలో ఎన్నో ఆసక్తిరమైన విశేషాలు, మరెన్నో విషాదపూరిత అంశాలు ఉన్నాయి.

కాకినాడలో కాలేజీలో చదువుతున్న రోజులవి. అప్పటికే కాలేజీలో హీరోగా పేరు తెచ్చుకున్నాడు హరనాథ్‌. ఎప్పుడూ 10, 15 మందితో గ్యాంగ్‌ మెయిటెయిన్‌ చేసేవాడు. గొడవలకు వెళ్ళడం, తనని ఎదిరించిన వారిని కొట్టడం వంటివి చేస్తూ ఉండేవాడు. మంచి అందగాడు, హీరో లక్షణాలు ఉన్నవాడు కావడంతో అతనంటే అమ్మాయిలు ఎంతో ఇష్టపడేవారు. కాలేజ్‌ డేస్‌లోనే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాడు ఎన్నో నాటకాల్లో రకరకాల పాత్రలు పోషించాడు. అప్పటికే స్టార్స్‌గా ఉన్న ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లను చూసి తను ఎందుకు హీరో కాకూడదు అనుకున్నాడు. ఆ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టి ‘మా యింటి మహాలక్ష్మీ’ చిత్రంలో తొలి అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ ‘సీతారామకళ్యాణం’ చిత్రాన్ని ఎన్‌.ఎ.టి. బేనర్‌లో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. కె.వి.రెడ్డి దర్శకుడు. తను రావణ పాత్ర పోషిస్తానని చెప్పారు ఎన్టీఆర్‌. డైరెక్టర్‌ కె.వి.రెడ్డితోపాటు ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు కూడా షాక్‌ అయ్యారు. ‘మాయాబజార్‌’లో నువ్వు కృష్ణుడుగా ఎంత అందంగా ఉన్నావు? ఈ సినిమాలో రావణాసురుడు క్యారెక్టర్‌ చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు రాముడిగా అయితేనే బాగుంటావు’ అని కె.వి.రెడ్డి చెప్పారు. కానీ, ఎన్టీఆర్‌ వినలేదు. దీంతో కె.వి.రెడ్డి ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఎన్టీఆరే స్వయంగా ఆ సినిమాను డైరెక్ట్‌ చేశారు. కానీ, డైరెక్టర్‌గా తన పేరు వేసుకోలేదు. రాముడిగా ఎవరిని తీసుకోవాలి అని ఆలోచిస్తుండగా, అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హరనాథ్‌ గురించి తెలిసింది. అతనితో రాముడి క్యారెక్టర్‌ చేయించాలని డిసైడ్‌ అయ్యారు ఎన్టీఆర్‌. ఇది తెలిసి చాలామంది సన్నిహితులు వారించారు. ‘అతనితో మీరు పడలేరు. కాలేజ్‌ డేస్‌లోనే అతను పెద్ద రౌడీ. సిగరెట్‌, మందు, అమ్మాయిలు.. ఇన్ని అలవాట్లు అతనికి ఉన్నాయి’ అని చెప్పారు. ఎన్టీఆర్‌.. హరనాథ్‌ని పిలిపించారు. రాముడు క్యారెక్టర్‌ గురించి చెప్పి, షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ అన్ని అలవాట్లకు దూరంగా ఉండాలని కండిషన్‌ పెట్టారు. ఆరోజుల్లో హరనాథ్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు ఎంతో మంది అమ్మాయిలు షూటింగ్‌ స్పాట్స్‌కి వస్తుండేవారు. దీన్ని కంట్రోల్‌ చెయ్యడానికి హరనాథ్‌కి ఫైట్‌మాస్టర్స్‌ రాజు, సాంబశివరావులను సెక్యూరిటీగా పెట్టారు ఎన్టీఆర్‌. ఎన్ని కండిషన్స్‌ పెట్టినా, ఎన్టీఆర్‌కి తెలియకుండా హరనాథ్‌ మధ్య మధ్య సిగరెట్స్‌ కాలుస్తూనే వుండేవాడు. మొత్తానికి ‘సీతారామ కళ్యాణం’ చిత్రాన్ని పూర్తి చేశారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీరాముడిగా హరనాథ్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్‌ ఎంతో సంతోషించారు. హరనాథ్‌ను సొంత తమ్ముడిలా భావించి ఎన్నో సినిమాలు అతనికి ఇప్పించారు. 

ఈ సినిమా తర్వాత హరనాథ్‌కి అవకాశాలు బాగా పెరిగాయి. అప్పట్లో కొన్ని వివాదాల వల్ల జమునతో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ నటించ కూడదని నిర్ణయించుకున్నారు. అది హరనాథ్‌కి బాగా కలిసొచ్చింది. హరనాథ్‌, జమున జంటకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఇద్దరూ దాదాపు 30 సినిమాల్లో కలిసి నటించారు. హరనాథ్‌ అంటే జమున ఎంతో అభిమానం చూపించేది. కొన్ని సందర్భాల్లో హరనాథ్‌కి సినిమా ఇస్తే తను ఆ సినిమాలో ఫ్రీగా నటిస్తానని చెప్పేది జమున. అలా ఎన్నో సినిమాలు చేసింది. అతనికి ఉన్న దురలవాట్లను మాన్పించాలని ఎంతో ప్రయత్నించింది. కానీ, హరనాథ్‌ వినలేదు. 

పాతతరం నటీనటుల్లో ఎస్‌.వి.రంగారావు, హరనాథ్‌, సావిత్రి.. ఈ ముగ్గురూ మద్యానికి బానిసలయ్యారు. లొకేషన్స్‌కి కూడా మద్యం తాగే వచ్చేవారు. ఇక హరనాథ్‌ ప్రతిరోజూ రాత్రి అమ్మాయిలతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్‌ చేసేవాడు. అతన్ని అందగాడు, ఆజానుబాహుడు అంటూ ఆకాశానికి ఎత్తేసిన అమ్మాయిల వల్లే తన కెరీన్‌ను, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అతను తన పద్ధతులు మార్చుకోకపోవడం వల్ల అవకాశాలు కూడా బాగా తగ్గాయి. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌ అతన్ని మందలించారు, మంచి మార్గంలో నడుచుకోమని సలహా ఇచ్చారు. ఎన్టీఆర్‌ చెప్పిన మాటల్ని విని కొంతకాలం తన కార్యక్రమాలను కొంతవరకు తగ్గించాడు. తర్వాత కొన్నాళ్ళకు మళ్లీ యధావిధిగా మందులో మునిగి తేలేవాడు. 

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ తర్వాత మూడో స్థానం హరనాథ్‌దేనని అందరూ ఫిక్స్‌ అయిపోయిన తరుణంలో ఇలా వ్యసనాలకు బానిసగా మారడంతో అతనితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా ఆసక్తి చూపించేవారు కాదు. ఆ సమయంలోనే వచ్చిన కృష్ణ, శోభన్‌బాబులను ఎంకరేజ్‌ చేశారు. మంచి క్రమశిక్షణతో నడుచుకుంటూ హీరోలుగా ఇద్దరూ ఉన్నత స్థాయికి ఎదిగారు. హీరోగా నటిస్తూ సంపాదించిన డబ్బును తన జల్సాలకు ఖర్చు చేయడంతో అంతా హరించుకుపోయింది. చివరి రోజుల్లో సాధారణ జీవితాన్ని గడిపేందుకు కూడా ఇబ్బందులు పడ్డాడు హరనాథ్‌. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న అతని జీవితం చివరికి విషాదాంతం అయ్యింది.