Read more!

English | Telugu

రెండు పెళ్లిళ్ళు, ఒక సహజీవనం.. ఆ హీరో చివరి రోజులు ఎంతో దుర్భరం!

సినిమా రంగంలో ఆర్టిస్ట్‌గా రాణించి మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నవారిలో కొందరు ఎంతో త్వరగా లైమ్‌లైట్‌లోకి వస్తారు.  మంచి పేరు, డబ్బు సంపాదించుకుంటారు. వాటిని కాపాడుకునేందుకు కొన్ని త్యాగాలు చేస్తారు. వ్యసనాలను దగ్గరికి రానివ్వరు. నిగ్రహంతో తమ జీవితాన్ని లీడ్‌ చేస్తారు. అయితే అంత నిబద్ధతతో ఉండేవారు ఇండస్ట్రీలో తక్కువనే చెప్పాలి. తమని తాము ఎంత కంట్రోల్‌ చేసుకున్నా ఏదో ఒక సమయంలో అదుపు తప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వారి జీవితం ఎన్నో మలుపులు తిరిగి విషాదాంతంగా ముగుస్తుంది. నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ‘ఆంధ్రా దిలీప్‌’ అని పృథ్విరాజ్‌ కపూర్‌ వంటి దిగ్గజ నటుడు, దర్శకుడితో పిలిపించుకున్న గొప్ప నటుడు చలం. సహజ నటుడుగా చలంకు చాలా మంచి పేరు వుంది. 

1952లో ‘దాసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన చలం హీరోగా, సెకండ్‌ హీరోగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించాడు. ఒకప్పుడు సినిమాల్లో నటించేవారంతా నాటకరంగం నుంచి వచ్చినవారే. తాము నటిస్తున్నది సినిమాల్లోనే అయినా అప్పుడప్పుడు రంగస్థల ప్రభావం వారి బాడీ లాంగ్వేజ్‌లో, డైలాగులు చెప్పడంలో, హావభావాల్లో కనిపించేది. దానివల్ల వారి నటనలో సహజత్వం అనేది లోపించేది. కానీ, చలం విషయంలో మాత్రమే అలాంటి పోకడలు కనిపించేవి కావు. ఎందుకంటే అతని నటన ఎంతో సహజంగా ఉండేది. దానితోనే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పాతతరం నటులైన ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, ఎస్వీఆర్‌ వంటి మహానటులతో కలిసి నటించిన చలం ఆ విషయంలో వారితో పోటీపడేవాడు. 

చలం అసలు పేరు సింహాచలం. ఆయన రమణకుమారిని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత తన పేరును రమణాచలంగా మార్చుకున్నాడు. 1961లో విడుదలైన ‘తండ్రులు కొడుకులు’ చిత్రంలో చలం, శారద కలిసి నటించారు. చలం అప్పటికే మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. శారద అప్పుడప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడిరది. ఇద్దరూ ఎంతో సరదాగా ఉండేవారు. అలా జరుగుతున్న క్రమంలోనే 1964లో చలం భార్య రమణకుమారి ఆత్మహత్య చేసుకుంది. అప్పటివరకు చలంపై అందరికీ మంచి అభిప్రాయం ఉండేది. సినిమాల్లో అతను పోషించిన పాత్రలన్నీ ఎంతో అమాయకంగా, మంచికి మారు పేరులా ఉండేవి. అతని భార్య మరణమే అతనికి సంబంధించి జనం విన్న తొలి చెడు వార్త.  అయితే అతని భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో ఎవరికీ తెలీదు. కాకతాళీయమే అయినా చలంకి శారద పరిచయమైన మూడు సంవత్సరాలకు అతని భార్య చనిపోయింది. శారద విషయంలోనే చలం, అతని భార్య మధ్య మనస్పర్థలు వచ్చి ఉంటాయని అప్పట్లో చెప్పుకున్నారు. 

భార్య చనిపోయిన తర్వాత ఒంటరితనాన్ని అనుభవిస్తున్న చలం.. శారదకు దగ్గరయ్యాడు. తన మాటలతో ఆమె సానుభూతిని పొందాలని చూశాడు. తన బాధల్ని ఆమెతో చెప్పుకునేవాడు. అలా ఇద్దరూ దగ్గరయ్యారు. 1972లో వీరు వివాహం చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్నారు. అప్పటివరకు నటుడుగా మంచి ఫామ్‌లో ఉన్న చలంకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. శారద నటిగా బాగా బిజీ అయిపోయింది. ఇంటిని, చలంని పట్టించుకునే పరిస్థితి కూడా లేనంత బిజీ. ఆమెకు బాగా అవకాశాలు రావడం, తన ఇంటికి వచ్చేవారు కూడా ఆమె కోసమే వస్తుండడంతో చలం అసూయతో రగిలిపోయాడు. ఏదో ఒక కారణంతో చీటికి మాటికీ గొడవ పడేవాడు. శారీరకంగా, మానసికంగా శారదను హింసించేవాడు. ఆ క్రమంలోనే మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. ఆ సమయంలోనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి కొన్ని సినిమాలు నిర్మించాడు. ఆ సినిమాల వల్ల చాలా నష్టపోయాడు. సినిమాలు నిర్మించేందుకు, తన సొంత ఖర్చులకు అంతా శారద డబ్బునే వినియోగించాడు. సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టడంతో మరింత డిప్రెషన్‌కి వెళ్లిపోయాడు. చలంతో కలిసి ఎక్కువ సంవత్సరాలు ఉండలేకపోయింది శారద. ఒకరోజు అతనికి చెప్పకుండా తన తల్లిగారింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత లాయర్‌ ద్వారా నోటీసులు పంపించింది. కొన్నాళ్ళు కేసు కోర్టులో నడిచింది. 1984లో వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. 

ఇక అప్పటి నుంచి చలం జీవితం మరింత దుర్భరంగా మారింది. సినిమాల కోసం చేసిన అప్పులు మరింత పెరిగిపోవడంతో కోట్లల్లో ఉన్న తన ఆస్తిని లక్షలకు అమ్మి అప్పులు తీర్చాడు. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక డాన్సర్‌ పరిచయమైంది. ఆమెతో సహజీవనం చేశాడు. చివరి రోజుల్లో పర్వర్టెడ్‌గా మారిన చలం ఆమెతో కూడా గొడవలు పడేవాడు. తను చనిపోతానని ముందే తెలిసిందో ఏమో.. తనతో సహజీవనం చేస్తున్న ఆమె జీవితంలోకి మరో మగాడు రాకూడదు అనుకున్నాడు. ఒకరోజు ఆమె నిద్రిస్తుండగా రుబ్బురోలు వంటి రాయిని ఆమె నడుం మీద వేశాడు. దాంతో ఆమె వెన్నెముక పూర్తిగా దెబ్బతింది. నడవలేని పరిస్థితికి వచ్చేసింది. ఇది జరిగిన నెలరోజుల్లోనే 1989లో చలం మరణించాడు.