Read more!

English | Telugu

ఆ విషయంలో రజినీని ఎవ్వరూ బీట్‌ చెయ్యలేరు.. అది సూపర్‌స్టార్‌కే సాధ్యం!

హీరోగారు వస్తున్నారంటే ఒక బిల్డప్‌.. చుట్టూ కొంతమంది అనుచరులు,  ఆయన రావడానికి లైన్‌ క్లియర్‌ చేసేందుకు కొందరు వ్యక్తులు.. ఇలా కొన్ని సందర్భాల్లో హీరోలకు అవసరానికి మించిన ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఈమధ్యకాలంలో హీరోలు కూడా అలాంటి సంప్రదాయానికి స్వస్తి పలికి సాధారణంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పద్ధతిలో ఇప్పటి హీరోలు కూడా వెళుతున్నారు. ఎంత ఒదిగి ఉన్నా.. ఒక స్టార్‌ హీరోకి మాత్రం ఆ విషయంలో ఎవ్వరూ పోటీకి రాలేరు. ఆయనే సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌. సినిమాలను పక్కన పెడితే.. బయట ఎంతో సాదా సీదా జీవితాన్ని గడుపుతారని, ఎంతో సింపుల్‌గా కనిపిస్తారని అందరికీ తెలిసిందే. అయితే ఆ సింప్లిసిటీ ఎలా ఉంటుంది?  ఆ విషయంలో రజినీకాంత్‌ని ఎవరూ ఎందుకు బీట్‌ చెయ్యలేరు అనే విషయాలు తెలుసుకుందాం.

సూపర్‌స్టార్‌ రజిని, మమ్ముట్టి కలిసి నటించిన చిత్రం ‘దళపతి’. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక సంఘటన.. రజినీ సింప్లిసిటీని తెలియజేస్తుంది. ఈ సినిమా ద్వారానే నటుడిగా పరిచయమైన అరవింద్‌ స్వామి షూటింగ్‌ విరామంలో తెలీక రజినీకాంత్‌ రూమ్‌కి వెళ్లారు. అప్పటికే ఎసి ఆన్‌ చేసి ఉంది. అక్కడ బెడ్‌పై పడుకున్నాడు అరవింద్‌. అతనికి తెలీకుండానే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారి లేచి చూసేసరికి అదే గదిలో రజినీ నేలమీద పడుకొని కనిపించారు. కంగారు పడ్డ అరవింద్‌ ఈ విషయాన్ని యూనిట్‌ సభ్యులకు చెప్పాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత రజినీ.. రూమ్‌కి వచ్చారని, ఆ సమయంలో మంచి నిద్రలో ఉన్న అరవింద్‌ని లేపవద్దని అసిస్టెంట్‌ డైరెక్టర్లకు చెప్పి తను నేలపై పడుకున్నారని తెలుసుకున్నాడు. ఈ విషయంలో అరవింద్‌ సారీ చెప్పేందుకు ప్రయత్నించగా, రజినీ అతన్ని వారించి ఓ చిరునవ్వు నవ్వారట. 

రజినీ తొలిరోజుల్లో బెంగళూరులో సిటీ బస్‌ కండక్టర్‌గా పనిచేసేవారన్న సంగతి అందరికీ తెలుసు. ఎప్పుడు ఖాళీ దొరికినా ఎంతో సాదా సీదాగా బెంగళూరు వెళ్లిపోవడం రజినీకి అలవాటు. అలా ఓసారి అక్కడ ఓ గుడి దగ్గర కూర్చొని ఉండగా, అతని డ్రెస్సింగ్‌ స్టైల్‌ చూసి బిచ్చగాడు అనుకున్న ఓ మహిళ చేతిలో పది రూపాయలు పెట్టి చకచకా వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత కారు ఎక్కుతూ కనిపించిన రజినీని గుర్తు పట్టిన ఆ మహిళ దగ్గరకు వచ్చి సారీ చెప్పింది. ‘స్టార్‌డమ్‌, మేకప్‌ లేకపోతే నేనేంటో ఆ సంఘటన గుర్తుచేస్తూనే ఉంటుంది. అందుకే పైపై మెరుగులకు నేను ప్రాధాన్యం ఇవ్వను’ అంటారు రజనీ. అలాగే ‘ఏ తల్లయినా తన బిడ్డకు మంచి బట్టలు వేసి, అందంగా తయారు చేసిన తర్వాత చూసి మురిసి పోతుంది. అలా ప్రేక్షకులు నా తల్లివంటి వారు. వాళ్ళకి కావాల్సిన విధంగా ఉండేందుకు సినిమాల్లో ఆర్భాటంగా, రకరకాల గెటప్స్‌లో కనిపిస్తాను తప్ప, బయట నేను నాలా ఉంటాను’ అంటారు రజినీ. సాధారణంగా ఆయన ధోతీ, కుర్తా, ఇంట్లో ఉంటే లుంగీ, హవాయి చెప్పుల్లోనే కనిపిస్తారు. మేకప్‌, నెరిసిన వెంట్రుకలకు రంగు వేసుకోవడానికి ఆయన ఇష్టపడరు. 

సాధారణంగా హీరోల పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా, ఎంత సందడిగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ఎక్కడెక్కడి నుంచో అభిమానులు రావడం, పెద్ద ఫంక్షన్‌ ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాం. ఇది పాత తరం హీరోల్లో బాగా ఎక్కువ. ఒకప్పుడు రజనీకాంత్‌ కూడా చెన్నయ్‌లో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘటన రజినీ ఆలోచనా ధోరణిని మార్చేసింది. ఎప్పటిలాగే రజినీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు వేల సంఖ్యలో చెన్నయ్‌ చేరుకున్నారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు అభిమానులు చనిపోయారు. ఆ ఘటన రజినీని ఎంతో బాధించింది. అందుకే అప్పటి నుంచి ఇప్పటివరకు తన పుట్టినరోజును జరుపుకోలేదు రజినీ. 

రజినీకాంత్‌ కుమార్తెలు కూడా సినిమా రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. పెద్ద కుమార్తె ఐశ్వర్య ‘త్రీ’ చిత్రాన్ని చేసినపుడు, చిన్న కుమార్తె ‘కొచ్చడయాన్‌’ తీసినపుడు ఆ సినిమాల కోసం రజినీ ఎలాంటి ప్రచారం చెయ్యలేదు. సాధారణంగా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సినిమా చేస్తే హీరోలు ఆ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ప్రచారం కూడా అదే స్థాయిలో చేస్తారు. ‘వారికి సినిమా తీయడం తెలుసు. అలాగే దాన్ని మార్కెట్‌ ఎలా చేసుకోవాలో కూడా తెలుస్తుంది. ఇందులో నా ప్రమేయం అవసరం లేదనేది నా అభిప్రాయం’ అంటారు రజినీ. 

ఒక సినిమా హీరో జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారంటే అందరూ ఆశ్చర్యపోక తప్పదు. ‘ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టు సూపర్‌స్టార్‌’ పేరుతో సీబీఎస్‌ సిలబస్‌లో ఆరో తరగతి పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధిస్తున్నారు. ఒక సినిమా నటుడి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా అందించడం అనేది ఒక్క రజినీకాంత్‌ విషయంలోనే జరిగింది. అలా పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కిన ఏకైక భారతీయ నటుడు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌.