English | Telugu
సూపర్‌స్టార్ కృష్ణ వంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరు.. ఇకపై రారు!
Updated : May 30, 2024
తెలుగు సినిమా చరిత్రలో సూపర్‌స్టార్ కృష్ణకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆయన తన సినీ జీవితంలో చేయని ప్రయోగం లేదు. తెలుగు సినిమాకి ఎన్నో దశల్లో కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత సూపర్‌స్టార్ కృష్ణకే దక్కుతుంది. హీరోగా కంటే వ్యక్తిగా ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన ఆయన సినిమా ఇండస్ట్రీలో దేవుడు అనే పేరు తెచ్చుకున్నారు. వాస్తవానికి కాలేజీ రోజుల్లోనే ఆయనకు దేవుడు అనే నిక్‌నేమ్ పెట్టారు స్నేహితులు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ పేరును సార్థకం చేసుకున్నారు కృష్ణ. ఆయన స్వతహాగా ఎన్.టి.రామారావు అభిమాని. ఆయనకు నచ్చిన సినిమా ‘పాతాళభైరవి’. సినిమా హీరో కావాలన్న ఆలోచన కృష్ణలో కలిగించిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. కాలేజీ రోజుల్లో కృష్ణకు చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఒక సినిమా ఫంక్షన్‌కి అక్కినేని రావడం, ఆయన్ని చూసేందుకు జనం ఎగబడడం కృష్ణను ఆకర్షించింది. అంతటి ఫాలోయింగ్ మనం కూడా తెచ్చుకుంటే బాగుంటుంది అనుకున్నారాయన. అప్పటి నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించారు. ఆ తర్వాత మద్రాస్ చేరుకొని సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టారు. 1961 నుంచి 1965 వరకు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన కృష్ణను ‘తేనె మనసులు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు. ఆ సినిమా నుంచి 2015లో వచ్చిన ‘శ్రీశ్రీ’ వరకు సూపర్‌స్టార్ కృష్ణ చేసిన 340 సినిమాల గురించి, సాధించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. మే 31 సూపర్‌స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితంలోని కొన్ని మైలు రాళ్ళు, చేసిన ప్రయోగాలు, కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.
తెలుగులో తొలి సాంఘిక కలర్ చిత్రం సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా పరిచయమైన ‘తేనె మనసులు’. అలాగే తొలి జేమ్స్‌బాండ్ సినిమా ‘గూఢచారి 116’, తొలి కౌబాయ్ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’, తొలి సినిమా స్కోప్ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’. ఇలా తెలుగు సినిమాకు దశలవారీగా కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత సూపర్‌స్టార్ కృష్ణకే దక్కుతుంది. 1965లో హీరోగా పరిచయమైన కృష్ణ ఐదు సంవత్సరాల్లోనే అంటే 1970లో సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించడం విశేషం. పద్మాలయా ఫిలింస్ పతాకంపై ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను నిర్మించారు. అలాగే 1983లో పద్మాలయా స్టూడియోను ప్రారంభించి తెలుగు సినిమా అభివృద్దికి ఎంతో దోహదం చేశారు. సినిమాల ఎంపికలో ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే కృష్ణ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఎవరికీ సాధ్యం కాని ‘అల్లూరి సీతారామరాజు’, ‘మోసగాళ్ళకు మోసగాడు’ వంటి సినిమాలు చేసి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు.
1968 నుంచి 1975 వరకు సంవత్సరానికి 10 కంటే ఎక్కువ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు కృష్ణ. అత్యధికంగా 1969లో 19 సినిమాలు చేశారు. అది ఇప్పటికీ రికార్డుగానే ఉంది. 1971లో పద్మాలయా ఫిలింస్ పతాకంపై సూపర్‌స్టార్ కృష్ణ నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ తొలి పాన్ వరల్డ్ మూవీ. ఈ సినిమా ‘ట్రెజర్ హంట్’ పేరుతో ఇంగ్లీషులోకి అనువాదమై 150 దేశాల్లో రిలీజ్ అయింది. ఈ రికార్డును కూడా ఇప్పటి వరకు ఏ సినిమా క్రాస్ చెయ్యలేకపోయింది. తెలుగు సినిమా హీరోల్లో ఎక్కువ అభిమాన సంఘాలు ఉన్న హీరోగా సూపర్‌స్టార్ కృష్ణ రికార్డు సాధించారు. అప్పట్లో ఆయనకు 2400 అభిమాన సంఘాలు ఉండేవి. ఒక సినిమా శతదినోత్సవానికి రాష్ట్రం నుంచి 30,000 మంది అభిమానులు 400 బస్సుల్లో మద్రాస్ తరలి వెళ్లారు. దీన్ని బట్టి ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అభిమానుల నుంచి వచ్చే ఉత్తరాలను స్వయంగా చదివి వారికి సమాధానం ఇచ్చేవారు కృష్ణ.
సినిమాల్లో హీరోగా అందరి మన్ననలు పొందడమే కాదు, నిజ జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో హీరో అనిపించుకున్నారు కృష్ణ. ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణ తమ పాలిట దేవుడు అని నిర్మాతలు భావించేవారంటే ఆయన వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు. తనతో సినిమాలు నిర్మించి నష్టపోయిన నిర్మాతల కోసం పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా అన్ని ఏర్పాట్లు తానే చేసి కొందరు నిర్మాతలతో సినిమాలు చేయించేవారు. అందులో వచ్చిన లాభాలను పూర్తిగా వారికే చెందేలా చూసేవారు. రిలీజ్ సమయంలో నిర్మాతలకు ఆర్థిక సమస్యలు ఏర్పడితే ఫైనాన్సర్స్‌కి తాను బాధ్యత వహిస్తూ సంతకాలు కూడా పెట్టేవారు. అలా సూపర్‌స్టార్ కృష్ణ నిర్మాతల హీరో అనిపించుకున్నారు. తెలుగు సినిమా అభివృద్ధి చెందడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవుడుగా భావించే సూపర్‌స్టార్ కృష్ణ మరణం ఎంతో మంది నిర్మాతలను మానసికంగా కృంగదీసింది. అలాంటి హీరో తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ లేరు, ఇకపై రారు అనే విధంగా అందరి మనసుల్లోనూ నిలిచిపోయిన సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పిస్తోంది తెలుగువన్.