English | Telugu
తనకు వ్యతిరేకంగా సినిమా తీసిన దర్శకుడు ఎదురుపడితే ఎన్.టి.ఆర్. ఏం చేశారో తెలుసా?
Updated : May 28, 2024
నటరత్న నందమూరి తారక రామారావు సినీ కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు కొన్ని వున్నాయి. తన ఇమేజ్‌ని పక్కన పెట్టి అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఫామ్‌లో ఉన్న హీరో ఎవరూ చేయడానికి సాహసించని కొన్ని పాత్రల్ని అద్భుతంగా పోషించి నిజమైన హీరో అనిపించుకున్నారు. అలాంటి వాటిలో ‘బడిపంతులు’ చిత్రంలోని వృద్ధుడి పాత్ర ఒకటి. నిజానికి ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టు పోషించాల్సిన ఆ పాత్రను చేసేందుకు ఎన్టీఆర్ ఆసక్తి చూపించడం అందర్నీ ఆశ్చర్యపరచింది. అప్పటి వరకు పౌరాణిక, జానపద, కమర్షియల్ సాంఘిక చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఎన్టీఆర్ పూర్తి సెంటిమెంట్‌తో కూడిన ఒక వృద్ధుడి పాత్ర చేయడం ఆయన అభిమానులకు నచ్చలేదు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు దగ్గర ప్రస్తావించారు అభిమానులు. ఇకపై అన్నగారు అలాంటి పాత్రలు చేయరు అని హామీ ఇచ్చిన తర్వాత వారు శాంతించారు. ‘బడిపంతులు’ సినిమా 1972 నవంబర్ 22న విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకి పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించారు. ఒక అద్భుతమైన సినిమా చేశారనే ప్రశంసలు ఆయనకు లభించాయి. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఒక విభిన్నమైన సినిమాని అందించిన పి.సి.రెడ్డికి ఆ తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం రాకపోవడం గమనార్హం. తన కెరీర్‌ని సరైన విధంగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరిగింది.
ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా హీరో కృష్ణ నిర్మించిన ‘నా పిలుపే ప్రభంజనం’ చిత్రానికి దర్శకత్వం వహించారు పి.సి.రెడ్డి. ఎన్టీఆర్‌తో ‘బడిపంతులు’ వంటి అందమైన చిత్రాన్ని రూపొందించిన పి.సి.రెడ్డి ఆయన్ని విమర్శిస్తూ సినిమా చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా విడుదలైన 7 సంవత్సరాల తర్వాత చదలవాడ బ్రదర్స్ ‘అన్నా వదిన’ పేరుతో సెంటిమెంట్ ప్రధానంగా ఓ సినిమా తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కృష్ణంరాజు హీరోగా నటించిన ఈ సినిమాకి చదలవాడ తిరుపతిరావు, చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతలు. పి.సి.రెడ్డి దర్శకుడు.
నందమూరి తారక రామారావు అంటే చదలవాడ బ్రదర్స్‌కి దైవంతో సమానం. అందుకే తమ సినిమా ప్రారంభోత్సవానికి ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. అన్నగారి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆయనకి వ్యతిరేకంగా సినిమా తీయడం వల్ల పి.సి.రెడ్డి వారితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ, వారు పట్టుబట్టి పి.సి.రెడ్డిని కూడా తీసుకెళ్లారు. అయితే ఆయన కారులోనే కూర్చున్నారు. చదలవాడ బ్రదర్స్ మాత్రమే అన్నగారిని కలిసారు. ఆయన ఎంతో సాదరంగా వారిని ఆహ్వానించారు. కృష్ణంరాజుతో తాము నిర్మించ తలపెట్టిన సినిమా గురించి ఆయనకు వివరించారు. హీరోయిన్‌గా ఎవరిని తీసుకున్నారు అని అడిగారు ఎన్టీఆర్. జయసుధ పేరు చెప్పారు చదలవాడ బ్రదర్స్. ఆ సయమంలో టేబుల్‌పై ఉన్న డైలీ పేపర్‌లో ‘జయసుధ ఆత్మహత్యాయత్నం...’ అనే హెడ్‌లైన్ చూసిన ఎన్టీఆర్ ‘ఆ అమ్మాయి ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంది.. జయప్రదను తీసుకోండి’ అని చెప్పారు. ‘మరి డైరెక్టర్ ఎవరు’ అని అడిగారు. అప్పుడు పి.సి.రెడ్డి పేరు చెప్పారు. అక్కడే ఉన్న చంద్రబాబునాయుడు ‘మనకు వ్యతిరేకంగా సినిమా తీశారాయన. మీరు ఓపెనింగ్‌కి వెళ్ళకండి’ అన్నారు. దానికి ఎన్టీఆర్ ‘అందులో ఆయన తప్పేముంది? నిర్మాతలు సినిమా చెయ్యమన్నారు, చేశారు. అయినా మనకు ‘బడిపంతులు’ వంటి అద్భుతమైన సినిమా చేశారు. మేం మీ సినిమా ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తాం’ అని చదలవాడ బ్రదర్స్‌కి హామీ ఇచ్చారు.
అన్నగారు చెప్పినట్టుగానే జయప్రదను హీరోయిన్‌గా తీసుకున్నారు. ‘అన్నా వదిన’ చిత్రం ద్వారానే చదలవాడ తిరుపతిరావు కుమారుడు భరత్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అతని సరసన సాక్షి శివానంద్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియోస్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఎన్టీఆర్ కారు స్టూడియోలోకి ప్రవేశించగానే అందరి కంటే ముందు దర్శకుడు పి.సి.రెడ్డి కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అన్నగారు కారులో నుంచి దిగగానే ఆయన కాళ్ళ మీద పడిపోయి ‘నన్ను క్షమించండి అన్నగారు.. చాలా తప్పు చేశాను’ అన్నారు. దానికి ఎన్టీఆర్ ‘అదేం లేదు. లేవండి బ్రదర్’ అంటూ ఆప్యాయంగా భుజాలు పట్టుకొని పైకి లేపారు. ఈ సినిమా ముహూర్తపు షాట్‌ను కృష్ణంరాజు, జయప్రద, రాజ్‌కుమార్, భరత్, సాక్షి శివానంద్‌లపై చిత్రీకరించారు. నారా చంద్రబాబు నాయుడు క్లాప్ నివ్వగా, నటరత్న ఎన్టీఆర్ ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. అలా ఎన్టీఆర్ ఆశీస్సులతో ప్రారంభమైన ‘అన్నా వదిన’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది.