English | Telugu
కాంతారావుకు జానపద హీరోగా పేరు తెచ్చిన విఠలాచార్య.. ఆయన కెరీర్‌ని కూడా నాశనం చేశారా?
Updated : May 30, 2024
జానపద చిత్రాలు అంటే చాలు.. వెంటనే మనకు గుర్తొచ్చే పేరు విఠలాచార్య. పౌరాణిక, సాంఘిక చిత్రాల ఒరవడి ఎక్కువగా ఉన్న రోజుల్లో చందమామ కథల్లాంటి జానపద చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత విఠలాచార్యకు దక్కుతుంది. ఇక జానపద చిత్రాలు అనగానే మన మనసులో మెదిలే హీరో కాంతారావు. ఎన్టీఆర్, ఎఎన్నార్ వంటి హీరోలు ఎన్నో జానపద చిత్రాల్లో నటించినా ఆ తరహా సినిమాలకు వన్నె తెచ్చిన హీరో కాంతారావు. 1953లో ఎన్టీఆర్ సొంతంగా నిర్మించిన ‘జయసింహ’ చిత్రంలో ఆయనకు తమ్ముడిగా నటించారు కాంతారావు. కాంతారావు చేసిన తొలి జానపద చిత్రం ఇదే. ఆ తర్వాత విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘జయవిజయ’ చిత్రంతో కాంతారావుకు కత్తి వీరుడుగా ముద్రపడిపోయింది.
మోడరన్ థియేటర్స్ పతాకంపై ‘సహస్ర శిరఛ్చేద అపూర్వ చింతామణి’ చిత్రాన్ని నిర్మించారు సుందరం. ఈ సినిమాకి ఎస్.డి.లాల్ దర్శకుడు. మెయిన్ హీరో జగ్గయ్య కాగా, రాకుమారుల పాత్రల్లో కాంతారావు, హరనాథ్ నటించారు. సెట్‌లో సిగరెట్ తాగడం నిర్మాత సుందరానికి అసలు ఇష్టం ఉండేది కాదు. ఇదే విషయాన్ని జగ్గయ్యకు చెప్పినా ఆయన వినకపోవడంతో ఆ సినిమా నుంచి జగ్గయ్యను తొలగించి కాంతారావును మెయిన్ హీరో చేశారు సుందరం. ఈ సినిమా కాంతారావును జానపద హీరోగా ఒక రేంజ్‌కి తీసుకెళ్లింది. ‘జయ విజయ’ నుంచి ‘పేదరాశి పెద్దమ్మ కథ’ వరకు కాంతారావు, విఠలాచార్య కాంబినేషన్‌లో లెక్కకు మించిన జానపద చిత్రాలు వచ్చాయి. కాంతారావుకు జానపద హీరోగా ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేసిన దర్శకుడు విఠలాచార్య.
తనకు జానపద హీరోగా ఎంతో పేరు తెచ్చిన దర్శకుడు విఠలాచార్య అనీ, అలాగే తన కెరీర్‌ని నాశనం చేసింది కూడా ఆయనేనని కాంతారావు చెప్పేవారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా హిట్ సినిమాలు మంచి వసూళ్ళు సాధించినా, ఏ సినిమా కూడా 100 రోజులు పూర్తి చేసుకోకుండా విఠలాచార్య అడ్డుపడేవారని కాంతారావు చెప్పేవారు. 100 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవాన్ని జరుపుకుంటే థియేటర్స్ స్టాఫ్‌కి, పంపిణీదారుల స్టాఫ్‌కి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అలా చేసేవారు. విఠలాచార్య కాంబినేషన్‌లోనే కాంతారావు ఎక్కువ సినిమాలు చెయ్యడంతో ఆయనకు శతదినోత్సవ సినిమాలు ఎక్కువగా లేవు. అంతేకాదు, సినిమా సూపర్‌హిట్ అయినప్పటికీ తదుపరి సినిమాకి కాంతారావు రెమ్యునరేషన్ పెంచేవారు కాదు. బయటి సినిమాల నిర్మాతలకు కూడా పారితోషికం పెంచవద్దని, అలా పెంచితే తను కూడా పెంచి ఇవ్వాల్సి వస్తుందని ఎంతో మంది నిర్మాతలకు చెప్పారని కాంతారావు చెప్పేవారు.
కాంతారావు జానపద హీరోగా చక్రం తిప్పుతున్న రోజుల్లోనే నిర్మాత డూండీ ఆయనతో మూడు సినిమాలు వరసగా నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారు. కాంతారావును పిలిపించి రెమ్యునరేషన్ ఎంత ఇవ్వమంటారు అని అడిగారు డూండీ. సినిమాకి 15 వేలు చొప్పున 45 వేలు ఇవ్వండి అని అడిగారు కాంతారావు. దానికి డూండీ కూడా అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న విఠలాచార్య వెంటనే డూండీ దగ్గరకు వెళ్ళి అతని పారితోషికం 10 వేలే.. మీరు 15 వేలు ఇస్తే నాలాంటి చిన్న నిర్మాతలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని డూండీకి చెప్పారు. అయితే విఠలాచార్యకు తెలియకుండా కాంతారావుకి 15 వేల పారితోషికం ఇచ్చారు డూండీ. ఇలా తన రెమ్యునరేషన్ విషయంలో జోక్యం చేసుకుంటున్న విఠలాచార్యతో ఇకపై సినిమాలు చెయ్యకూడదని నిర్ణయించుకున్నారు కాంతారావు. అనుకున్నట్టుగానే చాలా కాలం ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. దాంతో వేరే హీరోలతో సినిమాలు చెయ్యడం ప్రారంభించారు విఠలాచార్య. కానీ, అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తిరిగి కాంతారావు దగ్గరికే రావాల్సి వచ్చింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నానని, తనకు ఒక జానపద సినిమా చేసి పెట్టమని రిక్వెస్ట్ చేశారు విఠలాచార్య. మొదట ఆయనతో సినిమా చెయ్యకూడదు అనుకున్నప్పటికీ తనకు జానపద హీరోగా మంచి పేరు రావడానికి కారణం విఠలాచార్యేనన్న కృతజ్ఞతతో ‘అగ్గిదొర’ చిత్రం చేశారు కాంతారావు. ఈ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత కాంతారావు, కృష్ణ హీరోలుగా ‘ఇద్దరు మొనగాళ్ళు’ చిత్రాన్ని రూపొందించారు విఠలాచార్య. ఇక ఎన్టీఆర్, కాంతారావు హీరోలుగా విఠలాచార్య రూపొందించిన ‘చిక్కడు దొరకడు’ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాను తమిళ్‌లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్‌హిట్ అయింది.