Read more!

English | Telugu

'య‌ముడికి మొగుడు'లో చెట్టెక్కి డైలాగ్ చెప్ప‌మంటే వ‌ణికిపోయిన సుధాక‌ర్‌!

 

చాలా మంది 'ఆ.. కామెడీయే క‌దా' అని తేలిగ్గా మాట్లాడుతుంటారు. కానీ న‌వ‌ర‌సాల్లో హాస్యం పండించ‌డ‌మే క‌ష్ట‌మ‌నేది న‌టులు చెప్పే మాట‌. చూసేవాళ్ల‌కు వినోదంగా అనిపిస్తుంది కానీ చేసేవాళ్ల‌కు మాత్రం భ‌లే ఇబ్బంది. ఒక న‌టుడు తాను న‌వ్వ‌కుండా, త‌న చేష్ట‌ల‌ద్వారానో, సంభాష‌ణ‌ల ద్వారానో ప్రేక్ష‌కుల‌కు న‌వ్వు తెప్పించాలి. చూసేవాళ్ల‌కు న‌వ్వు రాక‌పోతే.. అది హాస్యం కాదు.. అప‌హాస్యం అవుతుంది.

సుధాక‌ర్ హీరోగా ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించి విల‌న్‌గా, కామెడీ విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా రాణించారు. ఆయ‌న కామెడీ యాక్ట‌ర్‌గా రాణించ‌డానికి కార‌ణం త‌న‌కు వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా రేలంగి, ర‌మ‌ణారెడ్డి, ప‌ద్మ‌నాభం లాంటి లెజెండ‌రీ క‌మెడియ‌న్స్ న‌టించిన పాత సినిమాల‌ను ఒక‌టికి రెండు సార్లు చూడ్డ‌మే! కామెడీలో ఆయ‌న‌కు రేలంగి, ప‌ద్మ‌నాభం ప్రేర‌ణ‌. 

అలాంటి సుధాక‌ర్ కామెడీ క్యారెక్ట‌ర్‌ను పోషించ‌డానికి క‌ష్ట‌ప‌డిన సినిమాల్లో చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'య‌ముడికి మొగుడు' ఒక‌టి. ఆ సినిమాలో చిరంజీవి, కోట శ్రీ‌నివాస‌రావు, సుధాక‌ర్‌, కొంద‌రు ఫైట‌ర్స్ పాల్గొన్న ఒక యాక్ష‌న్ సీక్వెన్స్‌లో.. సుధాక‌ర్ ఒక చిన్న‌కుర్రాడిని ఎత్తుకొని చెట్టుకొమ్మ‌ల్లో ఇరుక్కుంటాడు. కింద‌నుంచి చిరంజీవి దిగ‌మ‌ని అంటే, సుధాక‌ర్ దిగ‌కుండా "అయ్య‌బాబోయ్ నేను దిగ‌ను. పిచ్చ‌కొట్టుడు కొడ‌తావు" అని డైలాగ్ చెప్పాలి.. కింద‌కు చూస్తూ.

సుధాక‌ర్ నేల‌మీద ఎన్నిర‌కాల సాములు, విన్యాసాలు చెయ్య‌మ‌న్నా చెయ్య‌గ‌ల‌రు కానీ, స్టూలు మీద నిల్చొని కింద‌కు చూడ‌మంటే మాత్రం ఆయ‌న చూడ‌లేరు. ఆయ‌న‌కు భ‌యం! అలాంటిది ఏకంగా చెట్టుమీద నుంచి కింద‌కు చూస్తూ డైలాగ్ చెప్ప‌డ‌మంటే మాట‌లా! అదే మాట డైరెక్ట‌ర్ ర‌విరాజా పినిశెట్టికి, హీరో చిరంజీవికీ చెప్పారు సుధాక‌ర్‌.. 'చెట్టుమీద కూర్చొని మాత్రం డైలాగ్ చెప్ప‌లేను. కింద‌కు దిగిన త‌ర్వాత చెప్తాను' అని. "ఫ‌ర్వాలేదు.. చెట్టుపై నుంచే డైలాగ్ చెప్పు" అని వాళ్ల‌న్నారు. 

సుధాక‌ర్‌కు పైనుంచి కింద‌కు చూస్తే క‌ళ్లు తిరుగుతున్నాయి. ఇక డైలాగ్ ఏం చెప్తారు? భ‌యంతో ఒళ్లంతా చెమ‌ట్లు ప‌ట్టేశాయి. సీన్ అయిపోతే చాలు.. కింద‌కు దిగిపోవ‌చ్చున‌ని ఆయ‌న తాప‌త్ర‌య‌ప‌డ్డారు. చిట్ట‌చివ‌ర‌కు చిరంజీవి ప్రోత్సాహం, ధైర్యంతో ప్రాణాలుగ్గ‌బ‌ట్టుకొని వాళ్ల చెప్పిన‌ట్లుగానే డైలాగ్ చెబుతూ చెట్టుకొమ్మ‌ల మ‌ధ్య న‌టించారు సుధాక‌ర్‌. సినిమా రిలీజ‌య్యాక ఆ సీన్‌లో ఆయ‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. కానీ ఆ సీన్ వెనుక ఇలాంటి క‌థ ఉంద‌ని వాళ్ల‌కు తెలీదు క‌దా!