Read more!

English | Telugu

దివ్య‌వాణికి ఫ‌స్ట్ మేక‌ప్ స్టిల్స్ శార‌ద తీయించారు!

 

ఒక‌ప్ప‌టి బాపు బొమ్మ‌, 'పెళ్లిపుస్త‌కం' హీరోయిన్ దివ్య‌వాణి సినిమాల్లోకి రావ‌డానికి కార‌ణ‌మైందీ, ప్రేర‌ణ‌నిచ్చిందీ 'ఊర్వ‌శి' శార‌ద అని ఎంత‌మందికి తెలుసు! అవును. ఊహ తెలిసిన‌ప్ప‌ట్నుంచీ ఇంట్లో అంద‌రితో పాటు సినిమాలు చూడ్డం అల‌వాటైంది దివ్య‌కు. ముఖ్యంగా శార‌ద న‌టించిన చిత్రాలంటే మ‌రీ ఇష్టంగా చూసేది. శార‌ద వాళ్ల ఊరూ, దివ్య ఊరూ ఒక‌టే కావ‌డం వ‌ల్ల - వారి కుటుంబానికీ, దివ్య కుటుంబానికీ స‌న్నిహిత సంబంధాలు ఉన్న కార‌ణంగా, శార‌ద‌తో దివ్య ప‌రిచ‌యం బాగా పెరిగింది.

దివ్య‌ను చూసి శార‌ద‌, "సినిమాల్లో న‌టించ‌కూడ‌దూ.. న‌టిగా రాణిస్తావు" అని ప్రోత్స‌హించారు. కేవ‌లం మాట‌ల‌తో స‌రిపెట్ట‌కుండా మొట్ట‌మొద‌టిసారిగా దివ్య‌కు మేక‌ప్ స్టిల్స్ తీయించారు. త‌ర్వాత శార‌ద ప్రోత్సాహంతోనే సినిమాల్లో న‌టించ‌డం కోసం మ‌ద్రాసు వెళ్లింది దివ్య‌. ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌కు దివ్య‌ను ప‌రిచ‌యం చేశారు శార‌ద‌. ఆయ‌న రిక‌మండేష‌న్‌తో 'స‌ర్దార్ కృష్ణ‌మ‌నాయుడు' సినిమాలో హీరో కృష్ణ చెల్లెలిగా తొలిసారిగా చిత్ర‌రంగ ప్ర‌వేశం చేసింది దివ్య‌. ఆ త‌ర్వాత 'లాయ‌ర్ భార‌తీదేవి', 'మా తెలుగుత‌ల్లి', 'ఆడ‌దే ఆధారం' చిత్రాల్లో ముఖ్య‌పాత్ర‌లు పోషించే అవ‌కాశం ల‌భించింది.

నిజానికి దివ్య‌వాణి అస‌లు పేరు ఉష‌. స్వ‌స్థ‌లం తెనాలి. పుట్టిందీ, పెరిగిందీ, ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిందీ అక్క‌డే. తెలుగుతో పాట‌లు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ న‌టించి, ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. 'అడ‌విలో అర్ధ‌రాత్రి' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన‌ప్పుడు ఆ సినిమా డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ఆర్‌. దాస్ ఆమె పేరును స్వాతిగా మార్చారు. స్వాతి పేరుతోనే 'స‌ర్దార్ కృష్ణ‌మ‌నాయుడు', 'లాయ‌ర్ భార‌తీదేవి' చిత్రాల్లో న‌టించింది. అదే స‌మ‌యంలో క‌న్న‌డంలో 'డాన్స్ రాజా డాన్స్' మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ప్పుడు న‌టుడైన ఆ చిత్ర నిర్మాత ద్వార‌కేశ్ ఆమె పేరును దివ్య‌గా మార్చారు. ఆ త‌ర్వాత వాణి అనే పేరును జోడించుకొని దివ్య‌వాణిగా మారింది ఉష‌.

1991లో బాపు తీసిన 'పెళ్లి పుస్త‌కం' దివ్య‌వాణి న‌ట జీవితంలోనే మైలురాయిగా నిలిచింది. ఆమెకు 'బాపుబొమ్మ' అనే పేరు వ‌చ్చింది కానీ పెళ్లి త‌ర్వాత ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. బాపు తీసిన 'రాధా గోపాళం' (2005) మూవీలో వేణుమాధ‌వ్ భార్య పాత్ర‌లో దివ్య‌ను చూసిన‌వాళ్లంతా, ఆమె స్థూల‌కాయం చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.