Read more!

English | Telugu

రాధిక‌తో పాట‌లో న‌టిస్తుంటే చిరంజీవి ప్యాంట్ చిరిగిపోయింది! ఎలా మేనేజ్ చేశారు?

 

చిరంజీవి స‌ర‌స‌న  అత్య‌ధిక చిత్రాల్లో నాయిక‌గా న‌టించిన తార రాధిక‌. వారి కాంబినేష‌న్‌లో ఏకంగా 28 సినిమాలు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌. రాధిక ఏదైనా ప‌నిపైన హైద‌రాబాద్ వ‌చ్చినా, షూటింగ్ కోసం వ‌చ్చినా చిరంజీవి ఇంట్లో ఆతిథ్యం తీసుకోవాల్సిందే. అలాగే చిరంజీవి చెన్నై వెళ్తే రాధిక‌ను క‌ల‌వ‌కుండా ఉండ‌రు. అంత‌టి స‌న్నిహిత‌త్వం ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఉంది. వారు చేసిన సినిమాల్లో 'అభిలాష' పెద్ద హిట్‌.

అయితే ఆ సినిమా టైమ్‌లో ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో గొడ‌వ జ‌రిగి, ఇద్ద‌రూ మాట్లాడుకొనేవాళ్లు కాదు. డైరెక్ట‌ర్ ఎ. కోదండ‌రామిరెడ్డి షాట్‌కు పిలిస్తే వెళ్ల‌డం, ఆయ‌న చెప్పింది చేయ‌డం ఇలా ఉండేది.. ఇద్ద‌రి వ్య‌వ‌హారం. చిత్ర‌మేమిటంలో ఆ సినిమాలోని పాట‌లు "న‌వ్వింది మ‌ల్లెచెండు", "సందెపొద్దుల కాడ‌", "బంతీ చేమంతీ" ఆ రోజుల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాయి. ఆ పాట‌ల్లో వారి మ‌ధ్య కెమిస్ట్రీ చూస్తే వాళ్ల మ‌ధ్య మాట‌లు లేవ‌ని ఎవ‌రూ అనుకోరు.

"న‌వ్వింది మ‌ల్లెచెండు" పాట తీసే టైమ్‌లో అనూహ్య‌మైన విష‌యం ఒక‌టి జ‌రిగింది. ఆ పాట‌ను వైజాగ్ బీచ్ ద‌గ్గ‌ర జ‌నం మ‌ధ్య‌లో చిత్రీక‌రించారు. ఆ పాట‌లో "యురేకా స‌కమిక" అంటూ రాధిక పైనుంచి దూకి, ఒక ప‌ల్టీ కొడ‌తారు చిరంజీవి. చెప్పాలంటే అది డిఫిక‌ల్ట్ మూవ్‌మెంట్‌. అప్పుడు ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌ట్లేదు. డాన్స్ మాస్ట‌ర్ వ‌చ్చి రాధిక‌కు పాట సీన్ చెప్పారు. "చిరంజీవి జంప్ చేసి, మీ మీద నుంచి దూకుతారు, మీరు కిందికి వంగాలి" అని చెప్పారు. చిరంజీవికి కూడా ఆయ‌న అదే చెప్పారు.

చుట్టూ విప‌రీతంగా జ‌నం. ఎక్కువ‌మంది కాలేజీ స్టూడెంట్సే. డైరెక్ట‌ర్ "టేక్" అన‌గానే రాధిక మీదుగా గాల్లో జంప్ చేసి, ఇసుక‌లో కూర్చున్నారు చిరంజీవి. అది లాంగ్ షాట్ కావ‌డంతో యూనిట్ మెంబ‌ర్స్ అంద‌రూ దూరంగా ఉన్నారు. షాట్ ఓకే అయింది. డైరెక్ట‌ర్ స‌హా అంద‌రూ ఓ ప‌క్క‌కు వెళ్లిపోయారు, నెక్ట్స్ షాట్‌కు రెడీ అవ‌డానికి.

కానీ చిరంజీవి మాత్రం ఇసుక‌లో కూర్చున్న‌వాడు కూర్చున్న‌ట్లే ఉన్నారు, పైకి లేవ‌కుండా. రాధిక ఆయ‌న వంక చూశారు. ఆయ‌న "ఎక్స్‌క్యూజ్ మీ" అన్నారు.
"న‌న్ను పిలిచారా?" అన్నారు రాధిక ఆశ్చ‌ర్య‌పోతూనే.
"ఒక స్మాల్ ఫేవ‌ర్" అన్నారు చిరు.
"ఏమైంది?" అడిగారు రాధిక‌.
"జంప్ చేసిన‌ప్పుడు ప్యాంట్ చిరిగిపోయింది. నేను లేవ‌లేను. చుట్టూ ఫ్యాన్స్ ఉన్నారు." అన్నారు చిరంజీవి.
"ఓకే.. అయితే ముందు నాకు సారీ చెప్పు." అన్నారు రాధిక‌.
"త‌ర్వాత చెప్తాను" అన్నారు చిరు.
"ఇప్పుడు చెప్పు. లేక‌పోతే నేను వెళ్లిపోతాను." అన్నారు రాధిక‌.
"లేదు లేదు" అని సారీ చెప్పి, రాధిక చీర కొంగు అడ్డంపెట్టుకొని లేచి నిల‌బ‌డ్డారు చిరంజీవి. 
ఆయ‌న ముందు అడ్డంగా నిల్చున్నారు రాధిక‌, ఎవ‌రికీ ఏమీ క‌నిపించ‌కుండా. కాస్ట్యూమ‌ర్స్ వ‌చ్చి దుస్తులు ఇచ్చాక‌, ఆయ‌న డ్ర‌స్ మార్చుకున్నారు. ఆ త‌ర్వాత పాట‌ను కంటిన్యూ చేశారు.
అయితే చిరంజీవి ఏం చేశారంటే.. నెక్ట్స్ షాట్‌కు పిల‌వ‌గానే డాన్స్ అసిస్టెంట్‌ను పిలిచి, "ఆ మేడ‌మ్‌కు చెప్పండి" అని చెప్పారు.
వెంట‌నే రాధిక‌, "నువ్వు నాతో స‌రిగా మాట్లాడ‌క‌పోతే, ఇప్పుడు ఇక్క‌డ జ‌రిగిందంతా అంద‌రికీ చెప్పేస్తాను" అని బెదిరించారు.
ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రూ మ‌ళ్లీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ త‌మాషా సంఘ‌ట‌న‌ను ఒక ఇంట‌ర్వ్యూలో రాధిక చెప్పుకొచ్చారు.