Read more!

English | Telugu

లైట్ల అద్దె కట్టలేక వైజాగ్‌లో మూతపడిన స్టూడియో గురించి విన్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా స్టూడియోలు అనగానే హైదరాబాద్‌లోని స్టూడియోలు మనకు గుర్తొస్తాయి. వాస్తవానికి మొట్ట మొదటి స్టూడియో రాజమండ్రిలో 1936వ సంవత్సరంలో దుర్గా సినీటోన్‌ పేరుతో ప్రారంభించారు. స్టూడియో పేరుతోనే ‘సంపూర్ణ రామాయణం’ చిత్రాన్ని నిర్మించేందుకు ఆ స్టూడియో అధినేతలు సిద్ధమయ్యారు. కొంత భాగం ఆ స్టూడియోలోనే సెట్‌ వేసి షూట్‌ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. స్టూడియోను కూడా మూసేశారు. సినిమా షూటింగ్‌కి కావాల్సిన సామాగ్రి అంతా అక్కడ ఉంది. వాటిని బొబ్బిలి రాజావారు, చిక్కవరం జమీందారు తీసుకొని ఆంధ్రా సినీటోన్‌ పేరుతో విశాఖపట్నంలో స్టూడియోను ప్రారంభించారు. 

ఆ స్టూడియోలో 1938లో సి.పుల్లయ్య దర్శకత్వంలో ‘మోహిని భస్మాసుర’, హిరేన్‌బోస్‌ దర్శకత్వంలో ‘భక్త జయదేవ’, కొచ్చెర్లకోట రంగారావు దర్శకత్వంలో ‘పాశుపతాస్త్ర’ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాల కోసం స్టూడియోకి కావాల్సిన లైట్లను ఓ కంపెనీ నుంచి అద్దెకు తెచ్చారు. ఆ మూడు సినిమాలను పూర్తి చేశారు. మరో పౌరాణిక సినిమా నిర్మాణ దశలో ఉంది. షూటింగ్‌ కోసం తెచ్చిన లైట్లకు అద్దె బకాయి పడింది స్టూడియో. ఆ డబ్బు వెంటనే చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా స్టూడియో యాజమాన్యం పట్టించుకోలేదు. ఆ తర్వాత లైట్లు సప్లయ్‌ చేసిన కంపెనీవారు స్టూడియోలోకి ప్రవేశించి షూటింగ్‌ జరుగుతుండగా, వెలుగుతున్న లైట్లను తీసుకెళ్ళిపోయారు. ఆ కారణం వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. షూటింగ్‌ను కొనసాగించేందుకు కొత్త లైట్లను తెచ్చే ప్రయత్నం చెయ్యలేదు స్టూడియో యాజమాన్యం. బకాయిపడిన అద్దెను చెల్లించి లైట్లను తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని కూడా చెయ్యలేదు. దీంతో షూటింగులు లేక స్టూడియోను మూసెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది.