Read more!

English | Telugu

కె.రాఘవేంద్రరావు బి.ఎ. వెనుక దాగి ఉన్న అసలు కథ ఇదీ!

సినిమా రంగంలోని హీరోలుగానీ, హీరోయిన్లుగానీ, డైరెక్టర్లుగానీ ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటారు. వాళ్ళ పేర్ల విషయంలో కావచ్చు, స్టైల్‌లో కావచ్చు, మరేదైనా కావచ్చు. అలాంటి వారిలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన సినిమాల్లో హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తారని, అవసరాన్ని బట్టి వారిపై పూలు, పండ్లు గుప్పిస్తారనే పేరు ఉంది. అన్నింటినీ మించి ఆయన పేరు పక్కన బి.ఎ. అని లేకుండా మనం ఎక్కడా కనిపించదు. ప్రతి సినిమాకీ ‘దర్శకత్వం.. కె.రాఘవేంద్రరావు బి.ఎ.’ అనేది తప్పకుండా ఉండాల్సిందే. పేరు పక్కన బి.ఎ. లేకపోతే ఆయన దర్శకేంద్రుడు కాదు అని అర్థం. తన పేరు పక్కన బి.ఎ. ఉండడం అనేది సెంటిమెంట్‌గా చెప్పుకుంటారు రాఘవేంద్రరావు. 

బి.ఎ.ని అంత సెంటిమెంట్‌గా ఫీల్‌ అయ్యే రాఘవేంద్రరావు గతంలో డైరెక్ట్‌ చేసిన ఒక సినిమా ఫ్లాప్‌ అయింది. ఆ సినిమా టైటిల్‌ కార్డులో తన పేరును కేవలం కె.రాఘవేంద్రరావు అని మాత్రమే వేశారు. పక్కన బి.ఎ. మిస్‌ అయింది. సాధారణంగా తన పేరును సినిమాలో ఎలా వేశారు అనేది పట్టించుకోని రాఘవేంద్రరావు ఆ సినిమా ఫ్లాప్‌ అయిన తర్వాత అతని సన్నిహితులు ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు రాఘవేంద్రరావు.. పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ దగ్గరకు వెళ్ళి తన పేరు పక్కన బి.ఎ. అనేది సెంటిమెంట్‌గా ఫీల్‌ అవుతానని, అందుకే అది మిస్‌ అవ్వకుండా చూడమని చెప్పారు. 

ఇక బి.ఎ. వెనుక కూడా ఒక కథ ఉంది. రాఘవేంద్రరావు పేరు పక్కన బి.ఎ. అని ఉండడాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. ఎడ్యుకేషన్‌ పరంగా చూస్తే బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అయినప్పటికీ చాలా మంది అనుకునేది మాత్రం బి అంటే ‘బొడ్డు’, ఎ అంటే ‘యాపిల్‌’ అని. తన గురించి అలా అనుకుంటారని తెలిసినా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకునే రాఘవేంద్రరావు తను బి.ఎ. చేయడం వెనుక ఉన్న కథ గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. టెన్త్‌ పాస్‌ అయిన తర్వాత ఆయన తండ్రి కె.ఎస్‌.ప్రకాశరావు ఒక మాట అన్నారట. అదేమిటంటే ‘నువ్వు దర్శకుడు అవ్వాలంటే చదవాల్సింది ఇది కాదు’ అని. అయితే రాఘవేంద్రరావు ఆలోచన మాత్రం వేరేలా ఉంది. ఒకవేళ డైరెక్టర్‌గా సక్సెస్‌ అవ్వకపోతే ఏదైనా ఉద్యోగం వెతుక్కోవడానికి డిగ్రీ అయినా ఉండాలి కదా అనే ముందు చూపుతో బి.ఎ. కంప్లీట్‌ చేశారట. బుక్స్‌ కొనుక్కోవడానికి తండ్రి ఇచ్చే డబ్బులతో సినిమాలు చూసేవారు రాఘవేంద్రరావు. తన ఫ్రెండ్‌ దగ్గర వున్న పుస్తకాలను ఎగ్జామ్స్‌కి ఐదు రోజులు ముందు చదవడం మొదలు పెట్టేవారు. అలా డిగ్రీ పూర్తి చేశారు. రాఘవేంద్రరావు ఫ్రెండ్‌ అతను కొనుక్కున్న పుస్తకాలతో మూడు సంవత్సరాలు కష్టపడి చదివి ఫెయిల్‌ అయ్యాడు. అందుకే ఈ బి.ఎ. విషయంలో తన ఫ్రెండ్‌కి ఎంతో రుణపడి ఉంటానని చెబుతారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.