English | Telugu

టాప్‌ హీరోలందరితో నటించిన ఒన్‌ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌.. అతిలోక సుందరి శ్రీదేవి!

టాప్‌ హీరోలందరితో నటించిన ఒన్‌ అండ్‌ ఓన్లీ హీరోయిన్‌.. అతిలోక సుందరి శ్రీదేవి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరి ఎవరు అంటే అందరూ ఠక్కున చెప్పే పేరు అందాల తార శ్రీదేవి. తెలుగుతోపాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో టాప్‌ హీరోయిన్‌ అనిపించుకోవడమే కాకుండా హిందీలోనూ తన అందచందాలతో, అభినయంతో ఉత్తరాది ప్రేక్షకుల్ని కట్టిపడేసారు. టాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌కీ లేని ప్రత్యేకత శ్రీదేవికి మాత్రమే ఉంది. అదేమిటంటే.. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కి పైగా సినిమాల్లో నటించారు. వీటిలో ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమాలే ఎక్కువ శాతం ఉండడం విశేషం. అంతకుముందు తరం హీరోయిన్లు అయినా, శ్రీదేవి తర్వాత వచ్చిన హీరోయిన్లు అయినా అంత ఎక్కువ సంఖ్యలో హీరోయిన్‌గా నటించలేదు. అన్ని భాషల్లోనూ అందరు టాప్‌ హీరోలతో కలిసి నటించిన ఘనత కూడా శ్రీదేవికే దక్కుతుంది. ఇప్పటికీ శ్రీదేవి అంటే అందరూ ఎంతో అభిమానాన్ని చూపిస్తారు అంటే దానికి కారణం ప్రేక్షకుల మనసుల్లో ఆమె అంత గాఢ ముద్రే. ఆగస్ట్‌ 13 శ్రీదేవి జయంతి. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 

1963 ఆగస్ట్‌ 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. తల్లిపేరు రాజేశ్వరి, తండ్రి పేరు అయ్యప్పన్‌. ఈమెకు సోదరి శ్రీలత, సోదరుడు సతీష్‌ ఉన్నారు. 1967లో వచ్చిన కన్‌దన్‌ కరుణై చిత్రంతో బాలనటిగా తన నటజీవితాన్ని ప్రారంభించారు శ్రీదేవి. అదే సంవత్సరం ఆమె నటించిన రెండో సినిమా తుణైవన్‌ విడుదలైంది. ఈ రెండు సినిమాల్లోనూ శ్రీదేవి బాలమురుగన్‌గా నటించడం విశేషం. తెలుగులో ఆమె తొలి చిత్రం మానాన్న నిర్దోషి. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో బాలనటిగానే 60కి పైగా సినిమాల్లో నటించింది. ఇంతవరకు హీరోయిన్‌ అన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించలేదు. 

1977లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 16 వయతినిలే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచమయ్యారు శ్రీదేవి. 1978లో పదహారేళ్ళ వయసు పేరుతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. తెలుగు, తమిళ్‌ భాషల్లో ఒకే కథతో రూపొందిన సినిమా ద్వారా శ్రీదేవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తూ, అందరు హీరోల సరసన నటిస్తూ దాదాపు రెండు దశాబ్దాలపాటు హీరోయిన్‌గా నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు శ్రీదేవి. దక్షిణాది సినిమాలతో ఎంత పేరు తెచ్చుకున్నారో దాన్ని మించిన స్థాయిలో ఉత్తరాదిన హీరోయిన్‌గా తనకు తిరుగులేదు అనిపించుకున్నారు. తొలిరోజుల్లో శ్రీదేవి నటించిన హిందీ సినిమాలకు నటి రేఖ డబ్బింగ్‌ చెప్పేవారు. ఆ తర్వాత తన సొంతంగానే డబ్బింగ్‌ చెప్పుకోవడం ప్రారంభించారు. 

తెలుగులో అప్పటి స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు సరసన హీరోయిన్‌గా నటించారు శ్రీదేవి. ఈ హీరోలు నటించిన ఎన్నో సినిమాల్లో మనవరాలిగా, కూతురుగా నటించి వారి పక్కనే హీరోయిన్‌గా నటించడం విశేషం. ఆ తర్వాతి తరంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలతో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. అప్పటి టాప్‌ హీరోల్లో బాలకృష్ణ సరసన నటించే అవకాశం శ్రీదేవికి రాలేదు. ఇక తమిళ్‌లో శివాజీ గణేశన్‌, రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి హీరోలతో లెక్కకు మించిన సినిమాలు చేశారు. అయితే శ్రీదేవి కెరీర్‌లో కమల్‌హాసన్‌తోనే ఎక్కువ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆ రికార్డును ఏ హీరో బ్రేక్‌ చెయ్యలేదు. ఇక హిందీ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరితోనూ శ్రీదేవి నటించారు. రాజేష్‌ ఖన్నా, ధర్మేంద్ర వంటి సీనియర్‌ హీరోలతోపాటు మిథున్‌ చక్రవర్తి, అనిల్‌ కపూర్‌, సన్నిడియోల్‌, రిషి కపూర్‌, జితేంద్ర వంటి యంగ్‌ హీరోలతోనూ జత కట్టారు. అయితే అందరికంటే జితేంద్రతోనే శ్రీదేవి ఎక్కువ సినిమాలు చేశారు. తెలుగులో సూపర్‌హిట్‌ అయిన సినిమాల హిందీ రీమేక్స్‌ అన్నీ జితేంద్రతోనే నిర్మించేవారు. అందులో శ్రీదేవినే హీరోయిన్‌గా తీసుకునేవారు. 

బాలనటి దగ్గర నుంచి తీసుకుంటే దాదాపు 50 సంవత్సరాలపాటు నటిగా కొనసాగిన శ్రీదేవి టాప్‌ హీరోయిన్‌గా 20 సంవత్సరాల పాటు తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా ఎక్కడా ఎవరితోనూ వివాదాలకు తావులేకుండా తన కెరీర్‌ను కొనసాగించారు. 1996లో బాలీవుడ్‌ నిర్మాత, హీరో అనిల్‌కపూర్‌ సోదరుడు బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే అందులో హిందీ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో శ్రీదేవి నటించిన చివరి సినిమా 1994లో చిరంజీవి హీరోగా వచ్చిన ఎస్‌.పి.పరశురామ్‌. తమిళ్‌లో 2015లో విజయ్‌ హీరోగా వచ్చిన పులి ఆమె చివరి సినిమా. హిందీలో ఆమె చివరి సినిమా షారూక్‌ఖాన్‌ హీరోగా వచ్చిన జీరో చిత్రం. 

వ్యక్తిగత జీవితానికి వస్తే.. శ్రీదేవి హిందీ చిత్రం లమ్‌హే షూటింగ్‌లో ఉండగా తండ్రి అయ్యప్పన్‌ మరణించగా, జుదాయి చిత్రం షూటింగ్‌ సమయంలో తల్లి రాజేశ్వరి కన్ను మూశారు. హిందూ సంప్రదాయం ప్రకారం కొడుకు తల్లి చితికి నిప్పు అంటించాలి. కానీ, కూతురు అయినప్పటికీ శ్రీదేవే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి. జాన్వీ హిందీలో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న ‘దేవర’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె చెల్లెలు ఖుషి కూడా నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. 

తను హీరోయిన్‌గా ఎంత పేరు తెచ్చుకుందో తన కుమార్తెలు కూడా ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కలలు కన్నారు శ్రీదేవి. జాన్వీని హీరోయిన్‌గా ప్రమోట్‌ చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, కూతురి తెరంగేట్రం చూడకుండానే తుది శ్వాస విడిచారు. దుబాయ్‌లో తమ బంధువు వివాహానికి హాజరైన శ్రీదేవి ఒక ప్రమాదంలో మరణించారు. శ్రీదేవి మరణం అందర్నీ కలచివేసింది. దేశవ్యాప్తంగా అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న హీరోయిన్‌ మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. తన అందచందాలతో, అభినయంతో దేశ ప్రజల మనసుల్లో బలమైన ముద్ర వేసిన శ్రీదేవి జయంతి ఆగస్ట్‌ 13. ఈ సందర్భంగా ఆ అతిలోక సుందరికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.