English | Telugu

సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్‌ స్టార్‌ అనిపించుకున్న శ్రీహరి!

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు..’. ఇది సర్వసాధారణంగా కొన్ని సందర్భాల్లో వినిపించే మాట. అయితే ఎందరు మహానుభావులు ఉన్నా.. కొందరు మాత్రమే జనం గుండెల్లోకి వెళ్ళగలరు, తమ మానవత్వంతో వారిని తట్టి లేపగలరు అనేది కొందరి విషయంలో మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా రంగం విషయానికి వస్తే.. ఎందరో మహానటులు ఉన్నారు. కానీ, కొందర్ని మాత్రమే ప్రేక్షకులు తమ గుండెల్లో దాచుకుంటారు. వారి ప్రతిభ పరంగా, సినిమా రంగానికి వారు చేసిన సేవపరంగా నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళే. కానీ, మంచితనం, మానవత్వం, సేవాగుణం, సమాజం కోసం మనమూ ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన మాత్రం కొందరిలోనే ఉంటుంది. అలాంటి కొందరు నటుల్లో రియల్‌ స్టార్‌ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 

సినిమా హీరో అవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో.. ఒక నిరుపేద కుటుంబం నుంచి సినిమా రంగానికి వచ్చిన శ్రీహరి తను అనుకున్నది సాధించారు. కేవలం 49 సంవత్సరాల వయసులోనే శ్రీహరి మృత్యువు ఒడికి చేరినపుడు బాధపడనివారు లేరు. ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీహరి వల్ల సాయం పొందినవారు, ఆయన అభిమానులు ఆరోజు లక్షల సంఖ్యలో శ్రీహరి నివాసానికి తరలి వచ్చారు. అతను సినిమాల్లో స్టార్‌ హీరో కాదు. కానీ, నిజజీవితంలో తన మంచితనంతో, మానవత్వంతో స్టార్‌ హీరో అయ్యారు. ఆయన్ని కడసారి చూడాలన్న తపనతో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా అభిమానులు శ్రీహరి నివాసానికి చేరుకున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్ట్‌ 15న పుట్టిన శ్రీహరి దాన్ని సార్థకం చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. నిజజీవితంలో రియల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని విశేషాలను ఒకసారి మననం చేసుకుందాం. 

రఘుముద్రి శ్రీహరి 1964 ఆగస్ట్‌ 15న కృష్ణాజిల్లాలోని యలమర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి సత్యనారాయణ, తల్లి సత్యవతి. శ్రీహరికి అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిల్‌ షాపు రన్‌ చేస్తూ సోడాలు అమ్ముతూ జీవనం సాగించేవారు. శ్రీహరి చిన్నతనంలోనే వారి కుటుంబం హైదరాబాద్‌లోని బాలానగర్‌కు వలస వచ్చింది. చదువుకుంటూనే శోభన థియేటర్‌ ఎదురుగా అన్నయ్య పెట్టిన మెకానిక్‌ షాపులో పనిచేసేవారు శ్రీహరి. ఖాళీ దొరికినప్పుడల్లా శోభన థియేటర్‌లో సినిమాలు చూసేవారు. తన 12వ ఏటనే సినిమా రంగంపై ఆసక్తి ఏర్పరుచుకున్నారు. ఎలాగైనా హీరో అవ్వాలి అని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని తను అక్కడ నెగ్గుకు రావాలంటే ఎవరి దగ్గరా లేని ప్రత్యేకత తనలో ఉండాలని భావించారు. చిన్నతనం నుంచి బ్రూస్‌లీ సినిమాలు చూడడం వల్ల శ్రీహరికి మార్షల్‌ ఆర్ట్స్‌పైన ఆసక్తి కలిగింది. అందులో జిమ్నాస్టిక్స్‌ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఉదయం, సాయంత్రం జిమ్నాస్టిక్స్‌లో కఠోర శిక్షణ తీసుకున్నారు. ఏడు సార్లు మిస్టర్‌ హైదరాబాద్‌గా ఎంపికయ్యారు. అలాగే జాతీయ స్థాయిలో రెండుసార్లు విజయం సాధించారు. ఏషియన్‌ గేమ్స్‌లో ఆడాలన్న తన కోరిక మాత్రం నెరవేరలేదు. 

డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ సమయంలోనే వంగవీటి మోహనరంగా పరిచయమయ్యారు. చిన్నతనం నుంచీ జిమ్నాస్టిక్స్‌ చేయడం వల్ల పర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌తో ఉన్న శ్రీహరిని చూసిన రంగా తను తియ్యబోయే ‘చైతన్యరథం’ సినిమా ద్వారా హీరోగా పరిచయం చెయ్యాలనుకున్నారు. శ్రీహరిని తను హీరోగా పరిచయం చేస్తానని, కొత్తవారితో కాకుండా అనుభవం ఉన్న హీరోతో సినిమా చెయ్యమని రంగాకి సలహా ఇచ్చారు దాసరి నారాయణరావు. అలా దాసరి క్యాంప్‌లో చేరిన శ్రీహరికి ‘బ్రహ్మనాయుడు’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా విజయం సాధించకపోవడంతో అవకాశాలు ఎక్కువగా రాలేదు. కానీ, అందులో శ్రీహరి చేసిన ఫైట్స్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’ చిత్రంలో విలన్‌గా మంచి క్యారెక్టర్‌ లభించింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో శ్రీహరికి అవకాశాలు రావడం మొదలైంది. సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసే స్థాయి నుంచి ఏడాదికి 10 సినిమాలు చేసే రేంజ్‌కి వెళ్లిపోయారు శ్రీహరి. 

హీరో అవ్వాలన్నది శ్రీహరి కల. అందుకే రౌడీ ఇన్‌స్పెక్టర్‌ తర్వాత విలన్‌ క్యారెక్టర్స్‌ చాలా వచ్చినా వాటిని రిజెక్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, మోహన్‌బాబు చెప్పిన మాటలు శ్రీహరిని ఇన్‌స్పైర్‌ చేశాయి. మొదట తామూ విలన్స్‌గానే నటించామని, వచ్చిన అవకాశాలను వదులుకోకుండా చేస్తూ పోతే ఏదో ఒకరోజు హీరోగా ఛాన్స్‌ వస్తుందని చెప్పడంతో అప్పటి నుంచి వచ్చిన ఏ అవకాశాన్ని శ్రీహరి వదులుకోలేదు. చివరికి 1999లో ‘సాంబయ్య’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు శ్రీహరి. ఈ సినిమాలో అతని నటన, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, డూప్‌ లేకుండా చేసిన ఫైట్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కె.ఎస్‌.నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం అతని డైరెక్షన్‌లోనే చేసిన ‘పోలీస్‌’ చిత్రం శ్రీహరిని రియల్‌ స్టార్‌గా నిలబెట్టింది. హీరో అవ్వాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి 50కి పైగా సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు, విలన్‌ క్యారెక్టర్స్‌ చెయ్యాల్సి వచ్చింది. శ్రీహరి హీరోగా 28 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. అతని కెరీర్‌లో ఉత్తమ విలన్‌గా, ఉత్తమ సహాయనటుడిగా 6 నంది అవార్డులు అందుకున్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు, ఫిలింఫేర్‌ అవార్డు లభించాయి. 

ఇక శ్రీహరి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1996లో డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు శశాంక్‌, మేఘాంశ్‌, కుమార్తె అక్షర. అయితే నాలుగు నెలల వయసులోనే అక్షర కన్ను మూసింది. ఆమె జ్ఞాపకార్థం అక్షర ఫౌండేషన్‌ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్‌ బారిన పడి బాధపడుతున్న మూడు గ్రామాల ప్రజల కోసం రూ.50 లక్షల ఖర్చుతో ఫ్లోరైడ్‌ రహిత మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. అలాగే మేడ్చల్‌లోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ ఫౌండేషన్‌ స్థాపించక ముందు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరికీ నేనున్నానంటూ ధైర్యం చెప్పి వారిని ఆదుకునే వారు. తాము చేసే సహాయం కుమార్తె పేరున చేస్తే బాగుంటుందని భార్య శాంతి ఇచ్చిన సలహా మేరకు ఫౌండేషన్‌ స్థాపించి దాని ద్వారా సాయం అందిస్తున్నారు. తను సినిమాలు చేయడం ద్వారా సంపాదించిన దానిలో సగభాగం సేవా కార్యక్రమాలకే ఖర్చు పెట్టేవారు శ్రీహరి. తన నటనతో సినిమాల్లో రియల్‌ స్టార్‌ అనిపించుకోవడమే కాదు, నిజ జీవితంలోనూ రియల్‌ స్టార్‌ అనిపించుకున్న శ్రీహరి జయంతి సందర్భంగా మానవత్వం పరిమళించిన ఆ మంచి మనిషికి ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.