English | Telugu

భారతదేశంలోనే పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగి!

హాస్యాన్ని ఇష్టపడని ప్రేక్షకులు ఒక్క శాతం కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే హాస్యానికి అంతటి శక్తి ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది, ఏదో ఒక విషాదం ఉంటుంది. వాటన్నింటినీ మటు మాయం చేసేది హాస్యం. హాయిగా నవ్వుకోవడం వల్ల తక్కువ అనారోగ్యానికి గురవుతారని డాక్టర్లే చెబుతుంటారు. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన హాస్యాన్ని పండించడంలో ఎంతో మంది పేరు తెచ్చుకున్నారు. వారిలో రేలంగి వెంకట్రామయ్యకు ఓ విశష్ట స్థానం ఉంది. ఆయన హాస్యనటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. భారతదేశంలోనే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తొలి హాస్యనటుడు రేలంగి. మిగతా నటీనటులతో పోలిస్తే ఆయన ప్రయాణం ఎంతో సుదీర్ఘమైనది. ఆగస్ట్‌ 9 రేలంగి వెంకట్రామయ్య జయంతి. ఈ సందర్భంగా ఈ హాస్య నటచక్రవర్తి అంతటి స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాలు, ఆయన జీవితంలోని విశేషాల గురించి తెలుసుకుందాం. 

1910 ఆగస్ట్‌ 9న రావులపాలెం సమీపంలోని రావులపాడులో జన్మించారు రేలంగి. తండ్రి రామస్వామి, తల్లి అచ్చాయమ్మ. వీరికి ఒక్కగానొక్క సంతానం రేలంగి. ఆయన మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తల్లి మరణించారు. ఆ తర్వాత అచ్చాయమ్మ చెల్లెలు గౌరమ్మను వివాహం చేసుకున్నారు రామస్వామి. ఆయన పూర్వీకులు ఆబ్కారీ వ్యాపారం చేసేవారు. దాన్ని ఇష్టపడని రామస్వామి ఓ స్కూల్‌లో సంగీతం మాస్టారుగా పనిచేసేవారు. పిల్లలకు సంగీతం, హరికథలు చెప్పడం నేర్పించేరు. అలా తండ్రి దగ్గర ఆ కళలన్నీ నేర్చుకున్నారు రేలంగి. కొడుకు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తే బాగుంటుందని అనుకున్నారు రామస్వామి. కానీ, రేలంగి నాటకాలపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు. దీంతో 9వ తరగతితో చదువుకు స్వస్తి పలికారు. నటనపట్ల వున్న ఆసక్తిని గమనించిన రామస్వామి అతని ప్రయత్నాలకు అడ్డు చెప్పలేదు. 1919లో యంగ్‌మెన్‌ హ్యాపీ క్లబ్‌లో చేరిన రేలంగి నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఎస్వీ రంగారావు, అంజలీదేవి వంటి వారితో కలిసి నటించేవారు. ఆరోజుల్లో స్త్రీ పాత్రలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ అవకాశాలన్నీ రేలంగికే వచ్చేవి. అలా 1935 వరకు నాటకాలు వేస్తూనే గడిపారు. 

1935లో నిర్మించిన ‘శ్రీకృష్ణతులాబారం’ చిత్రంలో మొదటి అవకాశం వచ్చింది. అయితే అది విజయం సాధించకపోవడంతో రేలంగి చేసిన పాత్రకు కూడా అంతగా గుర్తింపు రాలేదు. దాంతో మళ్ళీ కాకినాడకు వచ్చేసి నాటకాలు వేయడం ప్రారంభించారు రేలంగి. తన ఆత్మీయుడైన పరదేశి సహకారంతో కలకత్తాలో ఉన్న దర్శకుడు సి.పుల్లయ్యను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా, క్యాస్టింగ్‌ అసిస్టెంట్‌గా, ప్రొడక్షన్‌ మేనేజర్‌గా.. ఇలా పలు శాఖల్లో దాదాపు 15 సంవత్సరాలు సి.పుల్లయ్య దగ్గరే పనిచేశారు రేలంగి. క్యాస్టింగ్‌ ఏజెంట్‌ కావడం వల్ల ఆయన చేతుల మీదుగా ఎంతో మంది కొత్త ఆర్టిస్టులు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. వీరిలో పుష్పవల్లి, కృష్ణవేణి, భానుమతి, అంజలీదేవి వంటి నటీమణులు ఉన్నారు. ఆ తర్వాత నిర్మాతలుగా మారిన భానుమతి, అంజలీదేవి కృతజ్ఞతగా రేలంగికి తాము నిర్మించిన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు.

1948లో వచ్చిన ‘వింధ్యరాణి’, 1949లో వచ్చిన ‘కీలుగుర్రం’ చిత్రాలు రేలంగి కెరీర్‌ని మలుపు తిప్పాయి. ఈ రెండు సినిమాల్లో రేలంగి చేసిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. కె.వి.రెడ్డి రూపొందించిన ‘గుణసుందరి కథ’ చిత్రంతో రేలంగికి అవకాశాలు వెల్లువలా రావడం ప్రారంభమైంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన రేలంగికి అందరూ అవకాశాలు ఇచ్చేవారు. అప్పట్లో ప్రతి సినిమాలోనూ రేలంగి ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉండేవారు. మిస్సమ్మ, మాయాబజార్‌, పాతాళభైరవి, అప్పుచేసి పప్పుకూడు, వెలుగు నీడలు, నర్తనశాల, విప్రనారాయణ వంటి సినిమాల్లో చేసిన పాత్రలు కథానాయకుడితో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. నటుడిగానే కాదు, సింగర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రేలంగి. వినవే బాల.. నా ప్రేమగోల, ధర్మం చెయ్‌ బాబూ, సరదా సరదా సిగరెట్టు.. వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆ తర్వాత ‘సామ్రాజ్యం’ పేరుతో ఓ సినిమాను నిర్మించారు రేలంగి. హాస్యనటుడు రాజబాబుకి ఇదే మొదటి సినిమా. 

తను చేసిన సినిమాల ద్వారా మంచి పేరు, డబ్బు సంపాదించిన తర్వాత తనకు తానే అవకాశాలు తగ్గించుకున్నారు. తోటి హాస్యనటులకు అవకాశాలు రావాలన్న ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు రేలంగి. అంతేకాదు, ఉత్తమ హాస్యనటులకు ఇచ్చే పురస్కార పోటీ నుంచి కూడా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. రేలంగికి లభించిన పురస్కారాలు, పొందిన సత్కారాలకు లెక్కే లేదు. అన్నింటినీ మించి భారతదేశంలోనే మొదటిసారి పద్మశ్రీ అవార్డును అందుకున్న హాస్యనటుడు రేలంగి. 1959 మే 14న మద్రాస్‌లోని తెలుగు జర్నలిస్టు అసోసియేషన్‌ రేలంగితో గజారోహణ చేయించారు. రేలంగిని ఏనుగుపై ఎక్కించి మద్రాసు పురవీధుల్లో తిప్పారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. రేలంగి పుట్టింది రావులపాడులో, పెరిగింది కాకినాడలో అయినా తాడేపల్లిగూడెం అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉండేది. ఎందుకంటే అక్కడి ప్రజలు ఆయన్ని ఎంతో అభిమానించేవారు. వారి కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఆ ఊరిలో రేలంగి చిత్ర మందిర్‌ పేరుతో ఓ సినిమా థియేటర్‌ను నిర్మించారు. ఈ థియేటర్‌ ప్రారంభోత్సవానికి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

రేలంగి వివాహం 1933 డిసెంబర్‌ 8న బుచ్చియమ్మతో జరిగింది. తను ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి.. కళాశాలలకు విరాళాలు ఇవ్వడం ద్వారా, ఎంతో మందికి వివాహాలు చేయించడం ద్వారా కరిగిపోయింది. ప్రతిరోజూ రేలంగి ఇంట్లో అన్నదాన కార్యక్రమం జరిగేది. అడిగిన వారికి లేదనకుండా ఎన్నో దానధర్మాలు చేశారు రేలంగి. దానికి భార్య సహకారం కూడా ఎంతో ఉండేది. రేలంగికి కూడా ఒకే ఒక్క సంతానం. పేరు సత్యనారాయణబాబు. ఈయన కూడా చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. బాలానందం అనే సినిమాలో నటించారు కూడా. ఆ తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కోసం సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరి దశలో రేలంగి నడుము నొప్పితో బాధపడ్డారు. అది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా గుర్తించారు. ఆరోగ్యం క్షీణించడంతో 1975 నవంబర్‌ 27న తాడేపల్లిగూడెంలోని తన స్వగృహంలో కన్నుమూసారు రేలంగి. హాస్యనట చక్రవర్తిగా ఏ హాస్యనటుడికీ లభించని గౌరవాన్ని, ఖ్యాతిని దక్కించుకున్న రేలంగి వెంకట్రామయ్యకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.