English | Telugu
తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు అందించిన శ్రీశ్రీ.. ఆ పాటలో వ్యాకరణ దోషం!!
Updated : Jun 16, 2021
1968లో జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రారంభమైతే ఈ 53 సంవత్సరాల్లో మూడండే మూడు సార్లు తెలుగు పాటకు సాహిత్యపరంగా అవార్డులు దక్కాయంటే ఒకింత బాధ కలిగించే విషయమే. అవార్డులు ప్రారంభమైన ఏడవ ఏట, అంటే 1974లో గేయరచయితగా మహాకవి శ్రీశ్రీ తొలి జాతీయ అవార్డును తెలుగు పాటకు అందించారు. సూపర్‌స్టార్ కృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో శ్రీశ్రీ రాసిన "తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.." పాట జాతీయ అవార్డును సాధించింది. ఆ తర్వాత 1993లో 'మాతృదేవోభవ' చిత్రానికి వేటూరి సుందరరామ్మూర్తి రాసిన గీతం "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే.." రెండో జాతీయ అవార్డును, తిరిగి 2003లో సుద్దాల అశోక్‌తేజ 'ఠాగూర్' సినిమా కోసం రాసిన "నేను సైతం ప్రపంచాగ్నికి.." పాట మూడో అవార్డును సాధించిపెట్టింది.
'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో మన్యం ప్రజలను తిరుగుబాటకు ప్రేరేపిస్తూ రామరాజు పాడే మార్చింగ్ సాంగ్‌ను రాయాల్సిందిగా శ్రీశ్రీని కోరారు కృష్ణ. ఉద్విగ్నభరితమైన ఆ సన్నివేశానికి తగ్గట్లు అంతే ఉద్వేగభరితంగా "తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.. దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా.." అంటూ శ్రీశ్రీ రాయడంతో కృష్ణతో పాటు సంగీత దర్శకుడు ఆదినారాయణరావు కూడా సంబరపడిపోయారు. ఆ పాటకు న్యాయం చేయగలిగేది ఘంటసాల గాత్రమేనని కృష్ణ తలచారు. అయితే అప్పుడు ఘంటసాల చాలా అనారోగ్యంతో ఉన్నారు. పాడటం కూడా బాగా తగ్గించేశారు. కృష్ణ ఆయన ఇంటికి వెళ్లి మరీ ఈ పాటను పాడాల్సిందిగా కోరారు. ఘంటసాల తన పరిస్థితి చెప్పగానే, "మీకోసం ఎన్ని నెలలైనా ఆగుతాను" అన్నారు కృష్ణ. దాంతో ఘంటసాల ఆయన మాటను మన్నించి, కాస్త ఆరోగ్యం కుదుటపడగానే విజయా గార్డెన్స్‌కు వచ్చి ఆ పాటను పాడారు.
'అల్లూరి సీతారామరాజు' సినిమా విడుదలయ్యాక "తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.." అంటూ తెలుగువాళ్లంతా ఊగిపోయారు. అందుకు తగ్గట్లే ఆ పాటకు జాతీయ అవార్డు దక్కింది. అప్పటి రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు శ్రీశ్రీ.
అయితే ఈ పాటలో వ్యాకరణపరంగా ఓ దోషం చోటు చేసుకుంది. పాట బయటకు వచ్చేదాకా దాన్ని శ్రీశ్రీతో పాటు చిత్ర బృందం కూడా పసిగట్టలేకపోయింది. అదేమంటే.. చరణంలో "ప్రతి మనిషి తొడలుగొట్టి.." అంటూ "సింహాలై గర్జించాలి" అని రాశారు శ్రీశ్రీ. ప్రతి మనిషి అనేది ఏకవచనం. సింహాలై అనేది బహువచనం. నిజానికి అక్కడ ఉండాల్సింది.. "సింహంలా గర్జించాలి" అని. ఏదేమైనా తెలుగుపాటకు తొలిసారిగా జాతీయ అవార్డును సాధించిపెట్టిన కవిగా శ్రీశ్రీ చరిత్రలో నిలిచిపోయారు.