English | Telugu

ఎన్టీఆర్ "ఈ రాళ్ల‌ల్లో ఏం క‌డ‌తావ్‌?" అన్న చోటే స్టూడియో క‌ట్టి చూపించిన రామానాయుడు!

 

మ‌ద్రాసు నుంచి ఎలాగైనా సొంత రాష్ట్రానికి తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను త‌ర‌లించాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న రోజుల‌వి. అంత‌దాకా మ‌ద్రాసులోనే ఉంటూ వ‌చ్చిన అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు అప్ప‌టి ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌ల‌గం వెంగ‌ళ‌రావు బంజారా హిల్స్‌లో స్థ‌లం కేటాయించారు. అప్పుడే సురేశ్ మూవీస్‌ అధినేత డి. రామానాయుడును కూడా ఆయ‌న "స్థ‌లం కావాలా?" అని అడిగారు. ఆయ‌న "వ‌ద్దు" అని చెప్పారు. ఎందుకంటే.. అప్ప‌ట్లో రామానాయుడుకు హైద‌రాబాద్ వ‌చ్చే ఆలోచ‌న లేదు. విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ అధినేతల్లో ఒక‌రైన నాగిరెడ్డి గారి పిల్ల‌ల‌తో క‌లిసి ఉండ‌టం వ‌ల్ల వాహినీ స్టూడియోనే త‌న స్టూడియో అనుకొని ఆయ‌న సినిమాలు తీస్తూ వ‌చ్చారు. 

అయితే అన్న‌పూర్ణ స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం రామానాయుడు నిర్మించిన 'సెక్ర‌ట‌రీ' (1976). అప్పుడు అన్న‌పూర్ణ‌లో మ‌ద్రాస్ వాహినీ నుంచి కార్పెంట‌ర్ల‌ను, ఆర్ట్ డైరెక్ట‌ర్‌ను తెచ్చి సెట్ వేయించారు. ఆ సినిమా ప్రారంభానికి వ‌చ్చిన నాగిరెడ్డి, "ఈ కొండ‌ల్లో స్టూడియో క‌డితే బాగుంటుంది" అన్నారు రామానాయుడుతో. అప్పుడు ఆయ‌న‌లో స్టూడియో ఆలోచ‌న మెదిలింది. భ‌వ‌నం వెంక‌ట్రామ్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రామానాయుడుకు, సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో స్థ‌లాలు కేటాయించారు. 

ఎన్టీఆర్ ఓసారి రామానాయుడుకు ఇచ్చిన స్థ‌లం చూసి, "ఈ రాళ్ల‌ల్లో స్టూడియో ఏం క‌డ‌తావ్‌?" అన‌డిగారు. "వ్యూ చాలా బాగుంది" అన్నారు రామానాయుడు. 
"వ్యాపారం చేస్తావా, వ్యూ చూసుకుంటూ కూర్చుంటావా? మంచి స్థ‌లం చూసుకోరాదా.." అని న‌వ్వారు రామారావు. రామానాయుడుకు ఆ స్థ‌లం న‌చ్చింది. రాళ్ల‌ను ఈజీగా ప‌గ‌ల‌గొట్టొచ్చు అనుకున్నారు. కానీ ఒక రాయిని ప‌గ‌ల‌గొట్ట‌డానికి ఆర్నెల్లు ప‌ట్టేస‌రికి ఆయ‌న‌లో చాలా నిరాశ క‌లిగింది. అప్ప‌టికే పెద్ద‌కొడుకు సురేశ్‌బాబు ఆయ‌న‌తో ఉండ‌టం.. చిన్న‌కొడుకు వెంక‌టేశ్ హీరో అవ‌డంతో.. స్టూడియో క‌ట్టాల‌నే ప‌ట్టుద‌ల పెరిగింది. ఉన్న డ‌బ్బంతా రాళ్ల‌లో పోశారు.

ఆ రాళ్ల‌తో రామానాయుడు ప‌డుతున్న శ్ర‌మ‌చూసి ప‌త్రిక‌ల‌వాళ్లు.. "ఇంత‌కీ మీ ఆశ‌యం ఏమిటండీ?" అని అడిగారు. "స్క్రిప్టు తీసుకొని నా స్టూడియోలోకి అడుగుపెట్టిన నిర్మాత‌.. ప్రింట్ తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లాలి. అన్ని సౌక‌ర్యాలు ఈ స్టూడియోలోనే క‌లిగించాల‌న్న‌దే నా ఆశ‌యం." అని చెప్పారు. ఆ ఆశ‌యాన్ని ఆయ‌న నిజం చేసుకున్నారు.