English | Telugu

అనారోగ్యంతోటే 'ఆహుతి'లో అశోక్‌గా న‌టించి, యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా మారిన రాజ‌శేఖ‌ర్‌!

 

'ప్ర‌తిఘ‌ట‌న‌', 'తలంబ్రాలు' సినిమాల త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌కు మంచి పేరు తెచ్చిన‌, ఆయ‌న‌ను యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా మార్చిన మూవీ 'ఆహుతి' (1987). 'తలంబ్రాలు' మూవీని నిర్మించిన ఎం. శ్యామ్‌ప్ర‌సాద్‌ రెడ్డి 'ఆహుతి'ని నిర్మించ‌డం, ఆ సినిమా ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఈ సినిమానీ డైరెక్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. 'ఆహుతి' క‌థ విన్న‌ప్పుడే మంచి చిత్రం అవుతుంద‌నీ, త‌ప్ప‌కుండా హిట్ట‌వుతుంద‌నీ అనుకున్నారు రాజ‌శేఖ‌ర్‌. కానీ అది అంత పెద్ద హిట్ట‌వుతుంద‌ని మాత్రం ఊహించ‌లేదు. ఊహించిన దానికి మించి ఆహుతికి ల‌భించిన ఆద‌ర‌ణ‌, ఆయ‌న పోషించిన అశోక్ పాత్ర‌కు ల‌భించిన ప్ర‌శంస‌లూ ఆయ‌న‌ను ఆనంద‌ప‌ర‌వ‌శుడ్ని చేశాయి.

"ఈ సినిమా షూటింగ్‌కు ముందు కోడి రామ‌కృష్ణ రూపొందించిన అశోక్ పాత్ర‌ను పూర్తిగా అవ‌గాహ‌న చేసుకున్న త‌ర్వాత ఇంత మంచి పాత్ర‌కు ఏ విధంగా న్యాయం చేకూర్చ‌గ‌ల‌నా? అని నాలో నేనే ప్ర‌శ్నించుకొని ఎలా చేస్తే బావుంటుందో మ‌న‌సులోనే ఊహించుకున్నాను." అని చెప్పారు రాజ‌శేఖ‌ర్‌.

ఆ మూవీలో అశోక్ పాత్ర‌కు గెట‌ప్ ఎలా ఉండాలో, బిహేవియ‌ర్ ఎలా ఉండాలో వివ‌రించి చెప్పారు కోడి రామ‌కృష్ణ‌. ఆద్యంతం ఆ పాత్ర చిత్రీక‌ర‌ణ‌పై ఎంతో శ్ర‌ద్ధ వ‌హించి, త‌ను ఏ విధంగా ఆ పాత్ర‌ను ఊహించుకున్నారో ఆ విధంగా రాజ‌శేఖ‌ర్ నుంచి న‌ట‌న‌ను రాబ‌ట్టుకొని సినిమా విజ‌యానికి ప్ర‌ధాన కార‌కుడ‌య్యారు. "న‌డ‌క‌లో, న‌డ‌వ‌డిక‌లో, మీస‌క‌ట్టులో వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల్లే నా మొహంలో ఒక విల‌క్ష‌ణ‌మైన మార్పు క‌లిగి నాలో రాజశేఖ‌ర్‌ను కాకుండా అశోక్‌నే ఆడియెన్స్ చూశారు. కాబ‌ట్టే నా క్యారెక్ట‌ర్ అంత‌గా అంద‌రి మ‌న్న‌న‌లూ పొందింద‌ని నా అభిప్రాయం." అంటారు రాజ‌శేఖ‌ర్‌.

ఈ సినిమా షూటింగ్ జ‌రిగే రోజుల్లో ఆయ‌న ఆరోగ్యం అంత బాగోలేదు. దానికి తోడు అంత మంచి పాత్ర ల‌భించి కూడా తాను స‌రిగా ప‌నిచెయ్య‌డానికి లేకుండా ఈ అనారోగ్యం ఏమిటి? ఈ పాత్ర‌ను స‌రిగా పోషించ‌క‌పోతే పాత్ర దెబ్బ తింటుంది. దాంతో త‌న‌కు చెడ్డ పేరొస్తుంది అని త‌న‌లో తాను మ‌న‌సులో మ‌ధ‌న‌ప‌డుతూ ఉండేవారు. "ఆ సినిమా షూటింగ్ జ‌రిగిన‌న్నాళ్లూ రాత్రిళ్లు నాకు నిద్ర‌ప‌ట్టేది కాదు. ఎప్పుడూ ఆ పాత్ర గురించే ఎక్కువ‌గా ఆలోచించేవాడ్ని. అయితే నాకు తెలీకుండానే ఆ పాత్ర‌లో లీన‌మై న‌టించాను." అని ఆయ‌న వెల్ల‌డించారు.

కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో, కొన్ని కొన్ని స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో కోడి రామ‌కృష్ణ ఓ డైరెక్ట‌ర్‌గా కాకుండా, ఒక స్నేహితుడిగా ఎప్ప‌టిక‌ప్పుడు, "రాజ‌శేఖ‌ర్‌.. నువ్వు రాజ‌శేఖ‌ర్‌వి కాదు, అశోక్‌వి." అని ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేస్తూ వ‌చ్చారు. "నిజం చెప్పాలంటే 'ఆహుతి' చిత్రం విజ‌యం సాధించ‌డానికి, నేను ధ‌రించిన అశోక్ పాత్ర‌కు అంత పేరు రావ‌డానికి కార‌ణం ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒక‌రు నిర్మాత శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి, రెండ‌వ‌వారు డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ‌. ఆ త‌ర్వాత స‌హ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులూ." అని త‌న కృత‌జ్ఞ‌త వ్య‌క్తం చేశారు రాజ‌శేఖ‌ర్‌.

ఈ మూవీలో ఫైట్స్ కానీ, ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ మీద‌కు దూకే స‌న్నివేశాల్లో కానీ ప్ర‌తి షాట్‌లోనూ ఆయ‌న డూప్ లేకుండా న‌టించారు. "సినిమా పూర్త‌య్యాక నా పాత్ర చూసుకుంటే ఎందుకో నాకు అంత సంతృప్తిక‌రంగా అనిపించ‌లేదు. ఇంత మంచి పాత్ర‌ను ఏమిటిలా చేశాను? ఇంకా బాగా చేసుండాల్సింది అనుకున్నాను. కానీ చూసిన‌వాళ్లంతా నేను బాగా న‌టించాన‌ని మెచ్చుకున్నారు. దాంతో నాలో కొంతవ‌ర‌కూ సంతృప్తి క‌లిగింది. అయినా ఇంకా బాగా చేసుండాల్సింది అనే ఫీలింగ్ మాత్రం ఇప్ప‌టికీ నాకు అనిపిస్తూ ఉంటుంది." అన్నారు రాజ‌శేఖ‌ర్‌.

1987 డిసెంబ‌ర్ 3న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఘ‌న విజ‌యం సాధించిన 'ఆహుతి' మూవీలో రాజ‌శేఖ‌ర్ జోడీగా జీవిత న‌టించ‌గా, ఇదే సినిమాతో విల‌న్‌గా ప‌రిచ‌య‌మైన ప్ర‌సాద్‌, ఆ త‌ర్వాత నుంచీ 'ఆహుతి' ప్ర‌సాద్‌గా పాపుల‌ర్ అయ్యారు. గ‌ణేశ్ పాత్రో సంభాష‌ణ‌లు ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ అయ్యాయి.