English | Telugu

ఒకే రోజు రిలీజ్.. బాలయ్యకి బ్లాక్ బస్టర్.. శోభన్ బాబుకి నిరాశ.. కామన్ ఫ్యాక్టర్ అదే!

ఒకే రోజున రెండు ఆసక్తికరమైన సినిమాలు రిలీజ్ అవడం.. వాటిలో ఒకటి బ్లాక్ బస్టర్ కావడం.. మరొకటి నిరాశపరచడం.. చాలాకాలంగా చూస్తున్న వ్యవహారమే. సరిగ్గా 39 ఏళ్ళ క్రితం ఇదే సెప్టెంబర్ 7న వచ్చిన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ విషయంలోనూ అదే జరిగింది. నటభూషణ్ శోభన్ బాబు వర్సెస్ నటసింహం నందమూరి బాలక‌ృష్ణ అన్నట్లుగా సాగిన ఆ పోరులో.. బాలయ్యకి బ్లాక్ బస్టర్ దక్కితే, శోభన్ నిరాశపడ్డారు.

ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన ఫ్యామిలీ డ్రామా 'అభిమన్యుడు'. ఇందులో శోభన్ కి జంటగా విజయశాంతి, రాధిక, సిల్క్ స్మిత నటించారు. యువచిత్ర కంబైన్స్ పతాకంపై కె. మురారి నిర్మించిన ఈ సినిమా 1984 సెప్టెంబర్ 7న రిలీజైంది. మ్యూజికల్ గా ఓకే అనిపించుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ పరంగా నిరాశపరిచింది. ఇక అదే రోజున కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య, సుహాసిని హీరోహీరోయిన్లుగా నటించిన 'మంగమ్మ గారి మనవడు' కూడా జనం ముందు నిలిచింది. తమిళ్ చిత్రం 'మన్ వాసనై' ఆధారంగా భార్గవ్ ఆర్ట్స్ నిర్మించిన 'మంగమ్మ గారి మనవడు' పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అంతేకాదు.. హైదరాబాద్ లో 565 రోజులు ప్రదర్శితమై అప్పట్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అలాగే, సోలో హీరోగా బాలయ్యకి ఫస్ట్ హండ్రెండ్ డేస్, సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ గా నిలిచింది. 

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలతోనే తెరకెక్కాయి. "దంచవే మేనత్త కూతురా" సాంగ్ తో బాలయ్య సినిమా మాస్ ని మత్తెక్కిస్తే.. "ఆకేసి పప్పేసి" పాటతో క్లాస్ ఆడియన్స్ ని శోభన్ సినిమా పాటల పరంగా అలరించింది.