English | Telugu
'మైనరు బాబు'గా శోభన్ బాబు అలరించి 50 ఏళ్ళు.. ఛాలెంజ్ తో మనిషిగా ఎదిగే కుర్రాడి కథ!
Updated : Sep 6, 2023
నటభూషణ్ శోభన్ బాబు పేరు చెప్పగానే పలు కథాబలమున్న చిత్రాలు గుర్తుకువస్తాయి. అలాంటి సినిమాల్లో 'మైనరు బాబు'ది ప్రత్యేక స్థానం. తండ్రి గారాబంతో, అంతులేని భోగభాగ్యాలతో 'మైనరు బాబు'గా పిలవబడే రాము అనే ధనవంతుల బిడ్డ.. తండ్రి స్నేహితుడితో చేసిన ఛాలెంజ్ కారణంగా మనిషిగా ఎలా ఉన్నత స్థాయికి ఎదిగాడు అనేదే ఈ సినిమా. ఇందులో శోభన్ బాబుకి జంటగా కళాభినేత్రి వాణిశ్రీ నటించగా.. ఎస్వీఆర్, గుమ్మడి, అంజలీ దేవి, రాజబాబు, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, చంద్రమోహన్, మిక్కిలినేని, పొట్టి ప్రసాద్, కేవీ చలం, లీలా రాణి, రమణా రెడ్డి, హలం ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. తాతినేని ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి.. ఆచార్య ఆత్రేయ, భమిడిపాటి రాధాకృష్ణ అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
టి. చలపతి రావు బాణీలు కట్టిన 'మైనరు బాబు'కి శ్రీ శ్రీ, సి. నారాయణరెడ్డి, కొసరాజు, ఆత్రేయ సాహిత్యమందించారు. ఇందులోని "కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.." అంటూ సాగే గీతం విశేషాదరణ పొందగా.. "ఓ మనిషీ ఓహో మనిషీ", "అంగట్లో అన్నీ ఉన్నాయ్", "నేను నువ్వూ ఇలాగే ఉండిపోతే", "రమ్మంటే గమ్మునుంటాడందగాడు", "మనదే మనదేలే ఈ రోజు", "బేబీ బేబీ బేబీ నీ పేరేంటో చెప్పు బేబీ" అనే పాటలు కూడా రంజింపజేశాయి. 1973 సెప్టెంబర్ 7న విడుదలై ప్రజాదరణ పొందిన 'మైనరు బాబు'.. గురువారంతో 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.