English | Telugu
కేవలం మూడు గంటల్లో ఆ సినిమా పూర్తి డైలాగులు రాసారు.. దటీజ్ దాసరి!
Updated : Jun 6, 2024
దర్శకరత్న డా. దాసరి నారాయణరావు తొలి చిత్రం ‘తాతమనవడు’ నుంచి చివరి చిత్రం ‘ఎర్రబస్సు’ వరకు ఎన్నో కళాఖండాలను ప్రేక్షకులకు అందించారు. అన్ని జోనర్స్‌లో సినిమాలు చేసిన దాసరి స్టార్ హీరోల నుంచి కొత్త తారల వరకు అందరితోనూ పనిచేశారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 150 సినిమాల్లో కొన్ని మైల్‌స్టోన్స్‌గా చెప్పబడే సినిమాలు ఉన్నాయి. వాటిలో సినిమా నేపథ్యంలో రూపొందించిన ‘శివరంజని’ ఒకటి. ఈ జోనర్‌లో నిర్మించిన తొలి సినిమా ‘విశ్వమోహిని’. ఈ సినిమా 1940లో విడుదలైంది. ఆ తర్వాత సినిమా కళాకారుల జీవితాలు ఎలా ఉంటాయి, తెర వెనుక జరిగే సంఘటనలను ప్రధానంగా తీసుకొని చాలా సినిమాలు వచ్చినా అవేవీ కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. అలాంటి సమయంలో దాసరి నారాయణరావు ‘శివరంజని’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి.
‘శివరంజని’ అనేది కథ కాదు. నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. దాసరి నారాయణరావు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సమయంలో మహానటి సావిత్రి ఆయన్ని ఎంతో ప్రోత్సహించేవారు. ఆమె దర్శకత్వంలో రూపొందిన ‘వింత సంసారం’ చిత్రానికి దాసరి అసోసియేట్ డైరెక్టర్. సావిత్రి తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి ఆ సమయంలో దాసరికి చెప్పేవారు. వాటిలో ఒక సంఘటన దాసరిని కదిలించింది. ‘శివరంజని’ చిత్రాన్ని రూపొందించడానికి సావిత్రి చెప్పిన ఆ సంఘటనే ప్రేరణ ఇచ్చింది. మొదట ఈ సినిమాకి ‘సినిమా తీసిచూడు’ అనే టైటిల్ అనుకున్నారు. సావిత్రి చెప్పిన సంఘటన చుట్టూ కథను అల్లే క్రమంలో ఎన్నో రకాల లైన్స్ అనుకున్నారు. ఒక లైన్ మీద కొన్ని రోజులు డిస్కషన్‌లో కూర్చోవడం, అది నచ్చకపోవడం, మళ్లీ మరో లైన్ రాసుకోవడం.. ఇలా జరుగుతూ ఉండేది. చివరికి ‘శివరంజని’గా టైటిల్ మార్చిన తర్వాత దాని కోసం ఒక లైన్ అనుకున్నారు దాసరి. అది అందరికీ నచ్చింది. సింగిల్ లైన్ ఆర్డర్ కూడా రెడీ చేశారు. అదే సమయంలో తెలుగులో సూపర్‌హిట్ అయిన స్వర్గం నరకం చిత్రాన్ని హిందీలో స్వర్గ్ నరక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు దాసరి. ఆ సినిమా షూటింగ్‌లో కొంత గ్యాప్ దొరకడంతో కేవలం మూడు గంటల్లో ‘శివరంజని’ చిత్రానికి పూర్తి డైలాగులు రాశారు. అలా ఒక సినిమా డైలాగులను మూడు గంటల్లో రాయడం అనేది ఇప్పటివరకు ఏ సినిమాకీ జరగలేదు.
ఇక ఈ సినిమాని తానే సొంతంగా నిర్మించాలి అనుకున్నారు దాసరి. ఈ కథ అనుకునే టైమ్‌కి దాసరి టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు. ఎంతో మంది నిర్మాతలు ఆయనతో సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినా తనే నిర్మాతగా వ్యవహరించడానికి కారణం.. అప్పటివరకు సినిమా నేపథ్యంలో వచ్చిన సినిమాలేవీ సక్సెస్ అవ్వలేదు. తను అనుకున్న ఆ కథతో బయటి నిర్మాతలను ఎందుకు ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతో తనే సొంతంగా ‘శివరంజని’ చిత్రాన్ని నిర్మించారు. ఆరోజుల్లో పెద్ద హీరోల సినిమాలను మాత్రమే సినిమా స్కోప్‌లో నిర్మించేవారు. అలాంటిది చిన్నతారలతో నిర్మించిన ఈ సినిమాని స్కోప్‌లో తీసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా చెయ్యాలని అనుకున్నప్పుడే శివరంజని పాత్రకు జయసుధను ఫిక్స్ చేసుకున్నారు దాసరి. సినిమాలో హీరో పాత్ర కోసం కొత్త కుర్రాడిని తీసుకోవాలనుకున్నారు. ఒక దర్శకుడి భార్య ద్వారా ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్‌ల ఫోటోలు లభించడంతో వారిని పిలిపించారు. ఈ సినిమాలో ఒక్కరికే అవకాశం ఉండడంతో స్క్రీన్ టెస్ట్‌కి పిలుస్తామని చెప్పారు. చివరికి ఆ సినిమాకి హీరోగా హరిప్రసాద్ ఎంపికయ్యారు. విలన్‌గా మోహన్‌బాబు నటించారు. సినిమా నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో ఈ సినిమాలోని చాలా మంది నటీనటులు తమ నిజ జీవిత పాత్రలనే పోషించారు. అలాగే తమ సహనటి శివరంజనిని సన్మానించేందుకు హాజరైన నటీమణులుగా సావిత్రి, జయంతి, ప్రభ, షావుకారు జానకి, ఫటాఫట్ జయలక్ష్మీ నటించారు.
రమేష్‌నాయుడు సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి. ‘అభినవ తారవో.. నా అభిమాన తారవో..’, ‘నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు..’, ‘జోరు మీదున్నావు తుమ్మెదా..’ వంటి పాటలు అప్పుడు రాష్ట్రంలో మారుమోగేవి. 1978లో విడుదలైన ‘శివరంజని’ చిత్రం ఘనవిజయం సాధించింది. బెంగళూరులో ఈ సినిమా 52 వారాలు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 1980లో ఈ చిత్రాన్ని తమిళ్‌లో ‘నచ్చతిరం’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో ప్రధాన పాత్రను శ్రీప్రియ పోషించగా, తమిళ్‌లోనూ హీరోగా హరిప్రసాద్, విలన్‌గా మోహన్‌బాబు నటించారు.