English | Telugu
6 జాతీయ అవార్డులు, 29 నంది అవార్డులు.. ఈ ఘనత గానగంధర్వుడు ఎస్.పి.బాలుకే సాధ్యమైంది!
Updated : Jun 3, 2024
ఆయన గాత్రం మధురం.. ఆయన పాట మరింత మధురం. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తర్వాత మళ్ళీ అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. తన గానమాధుర్యాన్ని అందరికీ పంచుతూ దాదాపు 50 ఏళ్ళపాటు సంగీత ప్రియులను అలరించారు. ఎంతోమంది యువగాయకులకు ఆదర్శంగా నిలిచారు. ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘అన్నాత్తై’ వరకు దేశంలోని 16 భాషల్లో దాదాపు 40 వేల పాటలు పాడిన బాలు గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జయంతి జూన్ 4. ఆయన జీవితంలో లెక్కకు మించిన విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో చిన్నతనంలోనే బాలుకి సంగీతంపై ఆసక్తి ఏర్పడిరది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదువులో, ఆటల్లో ఎప్పుడూ ప్రథముడిగా ఉండేవారు బాలు. చదువుకునే రోజుల్లోనే కొందరు మిత్రులతో కలిసి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసుకొని ప్రదర్శనలు ఇచ్చేవారు. తండ్రి మాత్రం కొడుకుని ఇంజనీరుగా చూడాలనుకునేవారు. తండ్రి కోరిక మేర మద్రాసులో ఇంజనీరింగ్‌లో చేరారు. చదువుకుంటూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు బాలు.
1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో ఎస్.పి.కోదండపాణి బాలులోని ప్రతిభను గమనించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని బాలుకు మాట ఇచ్చారు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంతో సినీగాయకునిగా కెరీర్‌ను ప్రారంభించారు బాలు. ‘ఏమి ఈ వింత మోహం’ అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి.సుశీల, కల్యాణం రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌లతో కలిసి పాడారు.
మొదటి పాటను ఇచ్చి ప్రోత్సహించిన కోదండపాణి ఆ తర్వాత ఎన్నో సినిమాలకు బాలుని రికమెండ్ చేసి గట్టి పునాది వేశారు. తన ఎదుగదలకు ముఖ్యకారకులైన ఎస్.పి.కోదండపాణిపై ఉన్న కృతజ్ఞతతో తను నెలకొల్పిన ఆడియో ల్యాబ్‌కు ఆయన పేరే పెట్టుకున్నారు బాలు.
ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోనప్పటికీ ఎలాంటి కఠినతరమైన పాటనైనా అవలీలగా పాడగలిగేంత ప్రతిభ బాలులో ఉండేది. రాగతాళాలపై పట్టు, అసాధారణ సంగీత పరిజ్ఞానం వల్ల ఒక్కసారి ట్యూన్ వింటే చాలు.. దాన్ని యథాతధంగా పాడేవారు. అలా ఆయన పాడిన పాటలు సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేసేవి. నేపథ్యగాయకుడిగానే కాదు, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా పలు విభాగాల్లో రాణించారు. డబ్బింగ్ కళాకారుడిగా తనదైన శైలిలో ఎంతో మంది హీరోలకు తన గాత్రాన్ని అందించారు. 1982లో వచ్చిన ‘గాంధీ’ చిత్రంలో మహాత్మాగాంధీ పాత్రధారి బెన్‌కింగ్‌స్లేకి డబ్బింగ్ చెప్పారు. కమల్‌హాసన్ నటించిన తెలుగు అనువాద చిత్రాలకు బాలునే డబ్బింగ్ చెప్పేవారు. 2010లో వచ్చిన ‘దశావతారం’ చిత్రంలోని పది పాత్రల్లో 7 పాత్రలకు వివిధ స్లాంగ్స్‌లో తన గాత్రాన్ని అందించారు బాలు. అందులో 90 ఏళ్ళ వృద్ధురాలి పాత్రలో నటించిన కమల్‌కి కూడా బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. అన్నింటికంటే ముఖ్యమైనది కమల్ ద్విపాత్రాభినయంతో వచ్చిన ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలోని మేయర్ పాత్ర కోసం ఒక పాటను రికార్డ్ చేశారు. ఆ పాటను విచిత్రమైన వాయిస్‌తో ఆ పాత్రకు తగ్గట్టు పాడారు. దీంతో బాలు కంఠానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడి పాడలేని పరిస్థితికి రావడంతో శస్త్ర చికిత్స ద్వారా ఆ సమస్యను దూరం చేశారు వైద్యులు.
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అందుకున్న పురస్కారాలకు లెక్కేలేదు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 6 సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ‘శంకరాభరణం’ చిత్రానికిగాను తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు బాలు. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత దర్శకుడిగా, సహాయనటుడిగా 29 సార్లు నంది అవార్డు అందుకోవడం బాలుకే సాధ్యమైంది. ఇవేగాక ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు కూడా ఆయన పొందారు. దేశంలోని సంగీత ప్రియులను తన గాన మాధుర్యంతో అలరించిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఆ గానగంధర్వుడికి నివాళులు అర్పిస్తోంది తెలుగువన్.