English | Telugu
రిహార్సల్స్ లేకుండా చేసిన ఫైట్.. తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్!
Updated : Jun 6, 2024
ఒక సినిమాలో హీరో అన్న తర్వాత డాన్సులు చేయాలి, ఫైట్స్ చేయాలి. సాంఘిక చిత్రాలైతే కొంతలో కొంత హీరోలకు బెటర్‌గానే ఉండే అవకాశం ఉంది. అదే జానపద, పౌరాణిక చిత్రాల్లో చేసే యుద్ధాలు ఒళ్ళు గగర్పొడిచేలా ఉంటాయి. అందుకే అలాంటి యుద్ధాల సీన్స్‌ను చిత్రీకరించే ముందు వీలైనన్నిసార్లు రిహార్సల్స్ చేసేవారు. కొన్నిసార్లు డైరెక్ట్‌గా షాట్‌లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లోనే ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ఓ ప్రమాదం ‘లక్ష్మీకటాక్షం’ షూటింగ్‌లో జరిగింది.
జానపద చిత్రాలంటే గుర్తొచ్చే దర్శకుడు విఠలాచార్య. ఎన్టీఆర్, ఎఎన్నార్, కాంతారావులతో ఆయన ఎన్నో జానపద సినిమాలు చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో జానపద సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో వీరిద్దరిదీ ఎంతో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. విఠలాచార్య చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఆయన సొంత సినిమాలే ఉండేవి. గండికోట రహస్యం, పిడుగు రాముడు, బందిపోటు, ఆలీబాబా 40 దొంగలు, మంగమ్మ శపథం, చిక్కడు దొరకడు.. ఇలా వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. ఆ క్రమంలోనే ఎన్.టి.ఆర్, విఠలాచార్య కాంబినేషన్‌లో వచ్చిన జానపద చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాజశ్రీ, కె.ఆర్.విజయ హీరోయిన్లుగా నటించారు.
ఆరోజుల్లో ఎన్.టి.ఆర్.కు నటుడు జగ్గారావు ఎంతో సన్నిహితుడుగా మెలిగేవారు. అంతేకాదు, ఎప్పుడూ ఎన్టీఆర్ వెంటే ఉండేవారు. అందుకే ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక క్యారెక్టర్ ఇప్పించేవారు. ‘లక్ష్మీకటాక్షం’ చిత్రంలో కూడా ఒక చిన్నపాటి విలన్ వేషం ఇప్పించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్, రాజశ్రీ బొప్పాయి తోటలో డాన్స్ చేస్తూ పాట పాడుకోవడం చూసి జగ్గారావు సహించలేకపోతాడు. వెంటనే ఎన్టీఆర్‌పై కత్తితో దాడికి దిగుతాడు. అక్కడ ఓ చిన్న ఫైట్ ఉంటుంది. దాని కోసం పదునైన కత్తిని రెడీ చేశారు. ఎందుకంటే ఆ కత్తితో దాడిచేసినపుడు ఎన్టీఆర్ తప్పించుకుంటారు. ఆ వేటు బొప్పాయి చెట్టుమీద పడాలి, బొప్పాయి చెట్టు విరిగిపోవాలి. అదీ సీన్. అప్పటికే సాయంత్రం అయిపోవడంతో ఆ ఒక్క షాట్ పూర్తి చేసుకొని త్వరగా ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్‌కు, జగ్గారావుకు సీన్ వివరించారు దర్శకుడు విఠలాచార్య. రిహార్సల్స్ చేసిన తర్వాత షాట్‌కి వెళతామనే భావనతో ఉన్నారు జగ్గారావు. కానీ, ఎన్టీఆర్ డైరెక్ట్ టేక్ చేద్దామన్నారు. ఇది విన్న జగ్గారావుకు టెన్షన్ మొదలైంది. అది మామూలు సీన్ కాదు, ఫైట్ సీన్. పైగా తన చేతిలో పదునైన కత్తి ఉంది. ఒకసారి రిహార్సల్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది జగ్గారావుకి. కానీ, ఆ మాటను డైరెక్ట్‌గా అన్నగారికి చెప్పే ధైర్యం లేదు.
విఠలాచార్య యాక్షన్ అన్నారు. కెమెరా రన్ అవుతోంది. ఒక్కసారిగా ఎన్టీఆర్‌పైకి కత్తితో దూకారు జగ్గారావు. కానీ, భయంతో చేతులు వణుకుతుండడం వల్ల ఆ కత్తి ఎన్టీఆర్ తలమీదకు వచ్చింది. ప్రమాదాన్ని గుర్తించిన ఎన్టీఆర్ తన చేతిని అడ్డుపెట్టారు. కత్తి పదునుగా ఉండడంతో ఆయన చేతికి పెద్ద గాయమైంది. రక్తం కారుతున్న చేతిని గట్టిగా పట్టుకున్నారు. విఠలాచార్యతో సహా యూనిట్‌లోని సభ్యులంతా షాక్‌కి గురయ్యారు. వెంటనే వారు తేరుకొని ఆయనకు ప్రథమ చికిత్స చేశారు. ఈ పరిణామాన్ని ఊహించని జగ్గారావు అన్నగారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయంతో వణికిపోయారు. జరిగిన పొరపాటుకు క్షమించమని ఎన్టీఆర్‌ను వేడుకున్నారాయన. మరేం ఫర్వాలేదంటూ జగ్గారావు భుజం తట్టారు ఎన్టీఆర్.