English | Telugu
ఎఎన్నార్, కృష్ణ కాంబినేషన్‌లో సినిమా అనే ఎనౌన్స్‌మెంట్ చూసి షాక్ అయిన శోభన్‌బాబు!
Updated : May 31, 2024
హీరో కృష్ణ, శోభన్‌బాబు సమకాలీనులు. వీరిద్దరూ కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించారు. అలాగే సోలో హీరోలుగా నటించిన సినిమాలతో కృష్ణ, శోభన్‌బాబు పోటీ పడేవారు. ఒక దశలో శోభన్‌బాబు కెరీర్ కాస్త నెమ్మదించింది. కృష్ణ వరస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఆ సమయంలో నటుడు కైకాల సత్యనారాయణ ఒకసారి కృష్ణను కలిసి ‘ఈమధ్య శోభన్‌బాబు సినిమాలు అంతగా ఆడడం లేదు. అతనితో కలిసి నువ్వు ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా’ అన్నారు. తనతో ఒక సినిమా చెయ్యమని శోభన్‌బాబు స్వయంగా కబురు పంపడం కృష్ణకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘తప్పకుండా చేస్తాను’ అని సత్యనారాయణకు మాట ఇచ్చారు కృష్ణ. ఆ తర్వాత కృష్ణ స్వయంగా శోభన్‌బాబు ఇంటికి వెళ్ళి కలిసారు. మనం కలిసి సినిమా చేద్దామని అని చెప్పి, స్టోరీ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అన్నారు. ఆరోజుల్లో శోభన్‌బాబు ఒక సినిమాకి రెండు లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకునేవారు. తను కూడా అంత ఎమౌంట్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు కృష్ణ. ఆ తర్వాత మహారథి, విజయనిర్మల, అప్పలాచార్య కలిసి సినిమా ఔట్ లైన్ తయారు చేశారు. ఆ సినిమానే ‘హేమాహేమీలు’. సినిమా కోసం అనుకున్న ఔట్‌లైన్‌ని శోభన్‌బాబుకి వినిపించారు మహారథి. అందులో కొన్ని మార్పుల గురించి చెప్పారు శోభన్‌బాబు. ఆ మార్పుల గురించి విజయనిర్మలతో కలిసి మహారథి చర్చలు జరుపుతున్న రోజుల్లోనే శోభన్‌బాబు నటించిన ‘మల్లెపూవు’ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ‘ఇక మనకు శోభన్‌బాబు సినిమా చెయ్యడు’ అన్నారు కృష్ణ. ఆయన అన్న మాట నిజమైంది. కథ తనకు నచ్చలేదని, అందుకే సినిమా చెయ్యలేకపోతున్నానని శోభన్‌బాబు నుంచి కబురు వచ్చింది.
శోభన్‌బాబు చెయ్యను అన్న తర్వాత అంత కంటే పెద్ద హీరోతోనే వెళ్లాలి తప్ప చిన్న హీరోతో సినిమా చెయ్యకూడదని డిసైడ్ అయ్యారు కృష్ణ. అప్పటికి ఎన్.టి.ఆర్, కృష్ణల మధ్య మాటలు లేవు. కాబట్టి ఆయన్ని అడిగే అవకాశం లేదు. ఇక ఎఎన్నార్‌తో ‘దేవదాసు’ వివాదం ఉండనే ఉంది. కానీ, ఈ సినిమాలో ఎఎన్నార్ అయితేనే బాగుంటుందని భావించిన కృష్ణ తమ మనస్పర్థలు పక్కన పెట్టి అక్కినేనిని కలవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు రజినీకాంత్ కాంబినేషన్‌లో ‘ఇద్దరూ అసాధ్యులే’ చిత్రం చేస్తున్నారు కృష్ణ. షూటింగ్ కోసం మద్రాస్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి సరాసరి అక్కినేని ఇంటికి వెళ్లారు. మీతో సినిమా చెయ్యాలనుకుంటున్నాను అని విషయం చెప్పారు. దానికి ఎఎన్నార్ ‘జరిగినవన్నీ మర్చిపోదాం.. మనం కలిసి సినిమా చేద్దాం’ అన్నారు.
అప్పటివరకు ఔట్ లైన్ మాత్రమే సిద్ధంగా ఉంది. సింగిల్ లైన్ ఆర్డర్ రెడీ చేసే పనిలో పడ్డారు విజయనిర్మల, మహారథి. ‘హేమాహేమీలు’ హిందీ చిత్రం ‘డాన్’ స్ఫూర్తితో రూపొందింది. ఇందులో కృష్ణ, విజయనిర్మల పాత్రలను అదనంగా చేర్చారు. మహారథి సింగిల్ లైన్ ఆర్డర్ తయారు చెయ్యగానే అక్కినేనికి కథ వినిపించారు. ఆయనకు కథ నచ్చి ఓకే చెప్పారు. ఆ సమయంలో శోభన్‌బాబు ‘ఎంకి నాయుడుబావ’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ‘హేమాహేమీలు’ సినిమా ఎనౌన్స్‌మెంట్ పేపర్‌లో చూసి షాక్ అయ్యారు శోభన్‌బాబు. నాగేశ్వరరావుగారిని అంత ఈజీగా ఎలా ఒప్పించారు, అంత త్వరగా సినిమా షూటింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు అని శోభన్‌బాబు ఆశ్చర్యపోయారట. ఈ సినిమా షూటింగ్ పాటలతో సహా అంతా హైదరాబాద్‌లోనే చేశారు.
అవి తెలుగు సినిమాకి సినిమా స్కోప్ అనే ప్రక్రియ ప్రారంభమైన రోజులు. అప్పట్లో అది కొత్తదనంగా భావించిన దర్శకనిర్మాతలు ఎక్కువ శాతం సినిమా స్కోప్‌లోనే సినిమాలు నిర్మించేవారు. దాని వల్ల కిందిస్థాయి సెంటర్లలో సినిమాను ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ విషయంలో పంపిణీదారులు గొడవ చేసేవారు. వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ‘హేమాహేమీలు’ చిత్రాన్ని 35 ఎంఎంలోనే చిత్రీకరించారు. ‘డాన్’ చిత్రంలో మాదిరిగానే ఈ సినిమాలో ఎఎన్నార్ డాన్ రఘువీర్‌గా, పల్లెటూరి అబ్బాయి రామచంద్రంగా రెండు పాత్రలు పోషించారు. అక్కినేని సరసన బాలీవుడ్ నటి జరీనా వాహబ్ నటించారు. ఎన్నో సినిమాల్లో ఎఎన్నార్‌తో కలిసి నటించిన విజయనిర్మల ఈ సినిమాలో ఆయన్ని డైరెక్ట్ చేయడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని విజయనిర్మల అనేవారు. ఈ సినిమా కోసం ఆరోజుల్లోనే ఒక ట్రైన్‌ను, హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకొని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించారు. రమేష్‌నాయుడు సంగీత సారధ్యంలో రూపొందిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. 1979 మార్చి 23న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. కలెక్షన్లలో ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది. ఎఎన్నార్, కృష్ణ ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకొని వారి పాత్రలను చాలా బాగా బ్యాలెన్స్ చేశారు విజయనిర్మల. అందుకే ఇద్దరు హీరోల అభిమానులు ఈ సినిమా విషయంలో తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.