English | Telugu
‘లవకుశ’ ఒరియాలో రిలీజ్ అయినపుడు జరిగిన సంఘటన ఇది.. తనికెళ్ళ భరణి వెల్లడించిన సంచలన విషయం!
Updated : May 31, 2024
దేవుళ్ళు ఎలా ఉంటారు.. రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఇది నటరత్న ఎన్.టి.రామారావు సినిమా రంగానికి పరిచయం అవ్వక ముందు మాట. ఆయన సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత దేవుళ్ళు ఎలా ఉంటారు, వారి రూపం ఎలా ఉంటుంది అనేది పరిచయం చేశారు ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు, శివుడు.. ఇలా ఏ పాత్ర ధరించినా ఆ దేవుళ్ళ రూపాలు ఇలాగే ఉంటాయోమో అనిపించేంతగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారు ఎన్.టి.రామారావు. దీనికి సంబంధించిన ఓ యదార్థ సంఘటన గురించి నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
‘ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి నటరత్న ఎన్.టి.రామారావుగారి గురించి ఓ విషయం చెప్పారు. అది కూడా వాళ్ళ అక్క చెప్పిందట. అది విని నేను స్టన్ అయిపోయాను. అదేమిటంటే.. 1963లో విడుదలైన ‘లవకుశ’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాని ఒరియా భాషలోకి డబ్ చేశారు. దానికి సంబంధించిన పోస్టర్స్‌ను గోడలపై అంటిస్తున్నప్పుడు అక్కడి జనం ఒక్కో పోస్టర్‌ని 50 పైసలు పెట్టి కొనుక్కొని ఇంట్లో అతికించుకున్నారట. ఈ విషయం నేను ఫస్ట్ టైమ్ విన్నాను. రాముడు అంటే ఇలాగే ఉంటాడు అనిపించేంత తేజస్సు రామారావుగారిలో ఉండడంతో ఇంట్లో దేవుడు ఉండాల్సిన స్థానంలో లవకుశ చిత్రంలో రాముడి గెటప్‌లో ఉన్న ఆయన ఫోటోను పెట్టుకున్నారంటే ఒక కళాకారుడికి అంతకు మించిన గౌరవం ఏముంటుంది’ అన్నారు తనికెళ్ళ భరణి.