English | Telugu
రెండు సార్లు ఫ్లాప్ అయినా.. మూడోసారి ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది!
Updated : May 31, 2024
దక్షిణ భారతదేశంలో సినిమా రంగం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఎన్నో చిత్ర నిర్మాణ సంస్థలు వెలిశాయి. వాటిలో ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ ఒకటి. ఆ తర్వాతి కాలంలో అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎ.వి.ఎం. సంస్థ పేరు తెచ్చుకుంది. ఈ సంస్థ అధినేత ఎ.వి.మెయ్యప్పన్ చెట్టియార్ చిత్ర నిర్మాణాన్ని ఒక తపస్సులా భావించి చేసేవారు. ఈ సంస్థ ద్వారా తన మాతృభాష అయిన తమిళ్‌లోనే ఎక్కువ సినిమాలు నిర్మించారు. 50వ దశకంలో తెలుగులో జీవితం, వదిన, సంఘం చిత్రాలను నిర్మించారు. అయితే ఈ మూడు సినిమాలూ ఆర్థికంగా ఎ.వి.ఎం. సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత చెట్టియార్ నిర్మించిన ‘నాగులచవితి’, ‘భూకైలాస్’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అయినా ఇతర భాషల్లో సినిమాలు నిర్మించారు తప్ప తెలుగులో ఎక్కువగా సినిమాలు నిర్మించలేదు. అయితే ఇతర భాషల్లో ఈ సంస్థ నిర్మించిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేవారు. ఎ.వి.ఎం. సంస్థ తమిళ్‌లో నిర్మించిన ఓ సూపర్‌హిట్ సినిమాను తెలుగులో ‘నాదీ ఆడజన్మే’ పేరుతో ఎస్వీ రంగారావు నిర్మించారు. దీనికి ఎ.వి.ఎం. సంస్థ భాగస్వామిగా వ్యవహరించింది. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ రెగ్యులర్‌గా తెలుగులో సినిమాలను నిర్మించడం ప్రారంభించారు చెట్టియార్. ఆ సమయంలో ఆయనకు భక్త ప్రహ్లాదుని కథతో సినిమా తీస్తే బాగుంటుంది అనిపించింది.
భక్తప్రహ్లాద పేరుతో అంతకు మునుపే రెండు సినిమాలు వచ్చాయి. 1932లో వచ్చిన భక్త ప్రహ్లాద చిత్రానికి హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 1942లో వచ్చిన భక్తప్రహ్లాద చిత్రాన్ని చిత్రపు నారాయణమూర్తి రూపొందించారు. ఈ రెండు సినిమాలు విజయం సాధించలేదు. అయితే కథలో వైవిధ్యం ఉందని, దాన్ని అప్పటి ట్రెండ్‌కి తగినట్టుగా, అందరికీ అర్థమయ్యేలా తీస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని చెట్టియార్ నమ్మారు. ఆరోజుల్లో పౌరాణిక సినిమాలకు సముద్రాల రాఘవాచార్య సంభాషణలు రాసేవారు. అయితే సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా మాటలు ఉంటేనే సినిమా రక్తి కడుతుందని భావించి డి.వి.నరసరాజుకి మాటలు రాసే బాధ్యతను అప్పగించారు. అదే ఆయనకు తొలి పౌరాణిక సినిమా. 1942లో వచ్చిన భక్తప్రహ్లాద, తమ సంస్థ నిర్మించిన నాగులచవితి చిత్రాలకు దర్శకత్వం వహించిన చిత్రపు నారాయణమూర్తినే దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు చెట్టియార్.
హిరణ్యకశ్యపుని పాత్రకు ఎస్వీఆర్‌ను, లీలావతి పాత్రకు అంజలీదేవిని ఎంపిక చేసుకున్నారు. ప్రహ్లాదుని పాత్ర కోసం ఎంతో మంది పిల్లలను చూశారు. కానీ, ఎవరూ ఆ పాత్రకు సరిపోయేలా కనిపించలేదు. చివరికి సినిమారంగం మాసపత్రికలో పనిచేసే సత్యం కుమార్తె ఐదేళ్ళ రోజారమణిని ఎంపిక చేసారు. అయితే రోజారమణి చాలా సన్నగా ఉండడంతో మూడు వారాలపాటు చక్కని డైట్ ఇచ్చారు. దాంతో పాప చాలా బాగా తయారైంది. రోజా రమణికి నటనలో, డైలాగులు చెప్పడంలో శిక్షణ ఇచ్చారు. ఒక్కసారి చెబితే ఇట్టే నేర్చుకునే రోజారమణి తక్కువ సమయంలోనే శిక్షణ పూర్తి చేసుకుంది. ఆమెపై చెట్టియార్ పెట్టుకున్న నమ్మకాన్ని రోజారమణి నిజం చేసింది. సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. సింగిల్ టేక్‌లోనే ప్రతి షాట్‌ను పూర్తిచేసింది.
ఆరోజుల్లో నారదుడి పాత్రకు కాంతారావు పెట్టింది పేరు. అయితే రొటీన్‌కి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో నారదుడి పాత్రకు సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన మూడు పాటలు కూడా పాడారు. అంతటి సంగీత విద్వాంసుడికి తాను రాగాలు కట్టి పాడిరచడం గౌరవం కాదని, ఆయన పాడిన పాటలకు స్వరాలు సమకూర్చే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత చెట్టియార్‌కు సినిమాపై మంచి నమ్మకం ఏర్పడింది. అందుకే సినిమాను కలర్‌లో తియ్యాలని నిర్ణయించుకున్నారు. 1965లో ప్రారంభమైన ఈ సినిమా 1967 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమాతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ‘అవేకళ్ళు’ చిత్రాన్ని నిర్మించింది ఎ.వి.ఎం. సంస్థ. ఆ చిత్ర నిర్మాణాన్ని చెట్టియార్ కుమారులు చూసుకునేవారు. భక్తప్రహ్లాద సినిమాపై అంతగా నమ్మకం లేని వారు.. ‘అవేకళ్ళు’ చిత్రానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే భక్తప్రహ్లాద చిత్ర నిర్మాణం బాగా ఆలస్యమైంది. విశేషం ఏమిటంటే.. ‘అవేకళ్ళు’ ఫ్లాప్ అవ్వగా, ‘భక్త ప్రహ్లాద’ ఘన విజయం సాధించింది. అద్భుతమైన నటనను ప్రదర్శించిన రోజారమణి ఈ ఒక్క సినిమాతోనే టాప్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోయారు.