English | Telugu

ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించడం ముఖ్యమని చాటి చెప్పిన గుమ్మడి!

పాతతరం నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావుది ఓ విభిన్నమైన శైలి. ఆయన చేసిన పాత్రలను మరెవ్వరూ చేయలేరు అన్నంతగా ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. తన కెరీర్‌లో 500కి పైగా సినిమాల్లో నటించిన గుమ్మడి లభించిన ప్రతీపాత్రకూ న్యాయం చేసేవారు. ఎలాంటి పాత్రయినా అందులో ఆ పాత్రే కనిపించాలి తప్ప నటుడు కనిపించకూడదు అనే సిదాÊధంతాన్ని అక్షరాలా పాటించేవారు గుమ్మడి. ఆ స్థాయిలో నటనను ప్రదర్శించేందుకు, ప్రేక్షకుల మెప్పు పొందేందుకు శాయశక్తులా కృషి చేసేవారు. జూలై 9 సహజ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి. ఈ సంందర్భంగా ఆయన సినీ జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

మన దేశం గర్వించదగ్గ ‘మెథడ్‌ ఆర్టిస్ట్స్‌’లో గుమ్మడికి ప్రత్యేక స్థానం ఉంది. సాత్విక పాత్రలకు పెట్టింది పేరైన గుమ్మడి కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించి మెప్పించారు. ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలో తిమ్మరుసు పాత్రను అద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకోవడమే కాదు,  రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. రాష్ట్రప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. సాత్వికాభినయంలో తనకు తానే సాటి అనిపించుకున్న గుమ్మడి పేరు తలచుకోగానే ఆయన ధరించిన అనేక వైవిధ్యమైన పాత్రలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. 

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గుమ్మడి వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచీ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనే తపన ఉండేది. ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. దాకా చదువుకున్న గుమ్మడికి పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసాలు బాగా నచ్చేవి. దాంతో గుమ్మడి కూడా కమ్యూనిస్టు భావజాలాన్ని ఒంటపట్టించుకున్నారు. కాలేజీలో చేరితే చెడిపోతాడని భావించిన గుమ్మడి కన్నవారు ఆయనకు 17 ఏళ్ళ వయసులోనే పెళ్ళి చేశారు. చివరకు ఎలాగోలా హిందూ కళాశాలలో చేరి ఇంటర్‌ చదివారు. ఇంటర్‌ పాస్‌ కాకపోవడంతో వ్యవసాయంలో దింపారు పెద్దలు. వ్యవసాయం చేస్తూనే పుస్తకాలను విపరీతంగా చదివేవారు గుమ్మడి. ఆ సమయంలోనే ఆయన మనసు నటనవైపు మళ్ళింది. మెల్లగా నాటకాలు వేయసాగారు. తరువాత మిత్రుల ప్రోత్సాహంతో మదరాసు చేరి, సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘అదృష్టదీపుడు’ గుమ్మడి నటించిన తొలి సినిమా.

‘అదృష్ట దీపుడు’ తర్వాత గుమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. వచ్చిన సినిమాలు కూడా ఆయనకు నటుడుగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ పరిస్థితుల్లో తిరిగి ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్న గుమ్మడికి తమ సొంత సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు ఎన్టీఆర్‌. ఆయన బేనర్‌లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత గుమ్మడికి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘తోడుదొంగలు’ చిత్రంలో తన వయసుకు మించిన పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ సినిమా చూసిన దర్శకుడు పి.పుల్లయ్య తన ‘అర్ధాంగి’ చిత్రంలో ఏయన్నార్‌, జగ్గయ్యకు తండ్రిగా నటించే పాత్రను ఇచ్చారు. అప్పటి నుంచి గుమ్మడికి ఎక్కువగా వృద్ధ పాత్రలే లభించేవి. ఒకే తరహా పాత్రలు వచ్చినా వాటిని తనదైన శైలిలో పోషించి అందర్నీ మెప్పించేవారు. ప్రతినాయక పాత్రల్లోనూ తేనె పూసిన కత్తిలా నటించడంలో గుమ్మడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ తరహా పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేసేవారు గుమ్మడి. చివరి రోజుల్లో తన గాత్రానికి సమస్య రావడంతో ఇతర ఆర్టిస్టులతో డబ్బింగ్‌ చెప్పారు. అలా చేయడానికి ఇష్టపడని గుమ్మడి ఆ తర్వాత సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపలేదు. ఒక పాత్రను పోషించడం అంటే నటించడం కాదు, జీవించడం అని నమ్మే గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి జూలై 9. ఈ సందర్భంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తోంది తెలుగువన్‌.