English | Telugu
వేణుమాధవ్ రాసిన సీన్స్‌తో హిట్ కొట్టిన రాజమౌళి!
Updated : Jul 8, 2024
ప్రతి సినిమాలో అన్నింటినీ కమాండ్ చేసే అంశం కథ. ఒక బలమైన కథ ఉంటేనే దాన్ని అందంగా మలిచే కథనం పుడుతుంది. ఒకప్పుడు బౌండ్ స్క్రిప్ట్‌తోనే సెట్స్‌కి వెళ్ళేవారు. షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి మార్పులు చేసేవారు కాదు. కాలంతోపాటు ఈ పద్ధతులు కూడా మారాయి. సినిమాకి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ఉన్నప్పటికీ ఒక్కోసారి షాట్ తీసే ముందు స్క్రిప్ట్‌లో మార్పులు చేయడం, అనవసరం అనుకున్న షాట్‌ను తీసేయడం, అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో ఒక కొత్త షాట్‌ని క్రియేట్ చేయడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇంతకుముందు సినిమాలో నటించే ఆర్టిస్టులకు ఎవరికి ఎన్ని సీన్లు ఉంటాయి అనేది ముందే నిర్ధారించేవారు. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఉండేది. ఒక్కోసారి ఒక సీన్ బాగా వచ్చింది అని అందరూ ఫీల్ అయితే దానికి కొనసాగింపుగా కొన్ని సీన్స్‌ను పెంచేవారు. కమెడియన్ వేణుమాధవ్ తను నటించిన కొన్ని సినిమాల్లోని కామెడీ ట్రాక్స్ కూడా తానే రాసుకుంటారన్న విషయం తెలిసిందే. అలా రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘సై’ చిత్రంలోని కామెడీ ట్రాక్‌కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఆయన జీవించి ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమా ప్రారంభంలో కాలేజ్ స్టూడెంట్స్, వేణుమాధవ్ మధ్య వచ్చే సీన్‌ను అతనే రాసుకున్నాడు. ఎన్నికల ప్రచారం కోసం గోడలపై అభ్యర్థుల పేర్లు రాయించే వ్యక్తిగా వేణు కనిపిస్తాడు. ఆ సీన్‌లో రాజమౌళి కూడా నటించాడు. రాజమౌళి వచ్చి ‘అన్నా గోడలమీద రాయనీకి పర్మిషన్ కావాల్నంటనే..’ అంటాడు. అప్పుడు ‘పర్మిషనేందిరో.. గోడల మీద కాదురా.. గుండెల్లో కునుకు తీస్తా.. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాలి.. నల్లబాలు.. నల్లత్రాచు లెక్క.. నాకి చంపేస్తా’ అంటూ వేణుమాధవ్ చెప్పిన డైలాగ్‌కి రాజమౌళి కట్ చెప్పడం కూడా మర్చిపోయి నవ్వుతూనే ఉన్నాడట. ఆ సీన్ బాగా వచ్చిందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. టోటల్‌గా సినిమా షూటింగ్ పూర్తయిపోయిన తర్వాత ఎడిటింగ్‌లో చూసుకున్నప్పుడు వేణుమాధవ్ సీన్ బాగా వచ్చిందని, అలాంటి సీన్స్ మరో రెండు ఉంటే బాగుంటుందని ఎవరో సలహా ఇచ్చారట.
రాజమౌళికి కూడా అది నిజమేననిపించి వేణుమాధవ్‌కి విషయం చెప్పారు. అప్పుడు వేణుమాధవ్ సినిమాలో వున్న మెయిన్ క్యారెక్టర్స్ ఏమిటి అని అడిగి తెలుసుకొని ఎసిపి, విలన్‌లతో ఆ సీన్‌ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ రెండు సీన్స్‌ని తనే రాసుకొని చేసి చూపించాడు. రాజమౌళి ఓకే అన్నాడు. అలా ఏసీపీ అరవింద్ (సమీర్), భిక్షుయాదవ్ (ప్రదీప్ రావత్)లను బెదిరించే సన్నివేశాలు రాసి... అందులో నటించారు వేణుమాధవ్.
విలన్‌ను బెదిరించే సన్నివేశాలను తీయడానికి ప్రదీప్ రావత్ హైట్‌కు సరిపోయే విధంగా వేణుమాధవ్‌కు ఒక పీట వేశారట. తను తక్కువ హైట్‌లో ఉండి తల ఎత్తి విలన్‌కి వార్నింగ్ ఇస్తేనే బాగుంటుందని చెప్పాడు వేణు. దాన్ని ఒకసారి చేసి చూపించాడు. ఇదే బాగుంది అని అతను చెప్పినట్టుగానే తీశారు రాజమౌళి. అలా ఒక సీన్ కాస్తా మూడు సీన్లకు పెరిగింది. ఆ రెండు సీన్స్‌ని షూట్ చేసి సినిమాలో యాడ్ చేయడం వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్ళు పెరిగింది. ఈ సినిమాలోని ఆ కామెడీ ట్రాక్‌ను ఇప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు.