English | Telugu

తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన దర్శక దిగ్గజం కె.బాలచందర్‌!

జనజీవనంలో నుంచి తీసుకున్న కథావస్తువులే ఆయన సినిమాలు. తన సమకాలీనులైన దర్శకుల్ని సైతం ఆశ్చర్యపరిచేలా ఆయన సినిమాలు ఉండేవి. ఎంతో సహజమైన కథ, కథనాలతో ప్రేక్షకుల మనసుల్ని తాకే సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన ఎంపిక చేసుకునే కథలు చాలా విలక్షణంగా ఉండేవి. ఆ తరహా కథలు చేసేందుకు ఏ దర్శకుడూ ప్రయత్నించలేదు. ఆయన సినిమాల్లో మానసిక సంఘర్షణ ఉంటుంది, సామాజిక స్పృహ ఉంటుంది, మహిళల సాధికారతకు అద్దం పట్టేలా ఆయా పాత్రల చిత్రణ ఉంటుంది. ఆయన సినిమాలంటే ఇష్టపడనివారు ఉండరు. ఆ దర్శక మేధావే కె.బాలచందర్‌. తెలుగు, తమిళ భాషల్లో 100కు పైగా సినిమాలను ఆయన రూపొందించారు. ప్రస్తుతం బాలచందర్‌ మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సినిమాలతో మనల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటారు. తమిళ దర్శకుల్లో తెలుగువారిని ఎక్కువ ప్రభావితం చేసారాయన. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన కె.బాలచందర్‌ జయంతి జూలై 9. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయన చేసిన విభిన్నమైన ప్రయోగాల గురించి తెలుసుకుందాం. 

కైలాసం బాలచందర్‌ 1930 జూలై 9న తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా మన్నిలంలో జన్మించారు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసులో సినిమాలు చూసే అవకాశం కలిగింది. అప్పటి తమిళ సూపర్‌స్టార్‌ ఎమ్‌.కె. త్యాగరాజ భాగవతార్‌ సినిమాలంటే బాలచందర్‌కు ఎంతో అభిమానం! చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాసి, వాటికి దర్శకత్వం వహించేవారు. అయితే చదువును ఏ నాడూ అశ్రద్ధ చేయలేదు. బియస్సీ (జువాలజీ)లో డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత  కొంతకాలం ముత్తుపేటలో టీచర్‌గా పనిచేశారు. తరువాత మద్రాసు మకాం మార్చారు. అక్కడ ఓ అకౌంటెంట్‌ జనరల్‌ వద్ద క్లర్క్‌గా పనిచేశారు. ఆ రోజుల్లోనే వర్ధమాన కళాకారుల సంఘంలో చేరారు. తరువాత సొంతంగా ఓ నాటకసంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఈయన నాటక సంఘంలోనే సౌందర్‌ రాజన్‌, షావుకారు జానకి, నగేశ్‌, వెన్నిరాడై శ్రీకాంత్‌ వంటి వారు నటించేవారు. ఆ తర్వాత వారంతా సినిమా రంగంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆరోజుల్లో బాలచందర్‌ రాసిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ నాటకం విశేషాదరణ చూరగొంది. ఈ నాటకాన్ని ఎన్నోసార్లు ప్రదర్శించారు. దాంతో బాలచందర్‌కు రచయితగా, దర్శకునిగా మంచిపేరు లభించింది. తద్వారా యమ్‌.జి.ఆర్‌. హీరోగా నటించిన ‘దైవతాయ్‌’ చిత్రానికి మాటలు రాసే అవకాశం లభించింది. ఆపై తన ‘సర్వర్‌ సుందరం’ నాటకాన్ని సినిమా తీయగా, దానికీ రచన చేశారు బాలచందర్‌. తాను రాసిన ‘నీర్‌ కుమిళి’ నాటకం ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు.

నాటకరంగంలో బాలచందర్‌కు ఎంతో పేరు సంపాదించి పెట్టిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ను తరువాత సినిమాగా ఆయనే తెరకెక్కించారు. ఆ సినిమా సైతం ఆకట్టుకుంది. ఆయన రూపొందించిన ‘భామా విజయం’ మంచి ఆదరణ పొందింది. అదే సినిమాను తెలుగులో ‘భలే కోడళ్లు’గా రూపొందిస్తూ తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు బాలచందర్‌. తెలుగునాట కూడా బాలచందర్‌కు మంచి పేరు లభించింది. చలం హీరోగా బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సత్తెకాలపు సత్తెయ్య’ చిత్రం మంచి విజయం సాధించింది. తరువాత వరుసగా చలంతో ‘బొమ్మా బొరుసా, జీవితరంగం’ వంటి చిత్రాలు రూపొందించారు.

తమిళంలో తాను రూపొందించిన ‘అవల్‌ ఒరు తోడర్‌ కథై’ ఆధారంగా తెలుగులో ఆయన దర్శకత్వంలోనే రూపొందిన ‘అంతులేని కథ’ ఆరోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ చిత్రం ద్వారానే కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ తెలుగు తెరకు పరిచయం కాగా, ఇందులో నటించిన జయప్రదకు నటిగా మంచి పేరు లభించింది. తనను ఎంతగానో ఆదరించిన తెలుగు సినిమా రంగం అంటే బాలచందర్‌కు ఎంతో గౌరవం. ఆయనకు తెలుగు చదవడం రాకపోయినా, తెలుగు సాహిత్యం అంటే ఎంతో అభిమానం. అందువల్ల తెలుగులోనే ఓ స్ట్రెయిట్‌ మూవీ రూపొందించాలని ‘మరోచరిత్ర’ను తెరకెక్కించారు. ఈ సినిమా ఓ చరిత్ర సృష్టించింది. ప్రేమకథల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించిన బాలచందర్‌కి దర్శకుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిందీ సినిమా. ఈ సినిమాలో కమల్‌హాసన్‌, సరితల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదే చిత్రాన్ని హిందీలో ‘ఏక్‌ దూజే కే లియే’ పేరుతో హీందీలో రూపొందించి అక్కడ కూడా ఘనవిజయం సాధించారు బాలచందర్‌. ఈ సినిమాలోని ‘తేరే మేరే బీచ్‌ మే..’ పాటకుగాను ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకునిగా రెండో నేషనల్‌ అవార్డు లభించింది. ఈ హిందీ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ నిర్మించడం విశేషం!

కె.బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన తెలుగు సినిమాల్లో అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, 47 రోజులు, కోకిలమ్మ, రుద్రవీణ వంటి సినిమాలు బాలచందర్‌ను అగద్రర్శకుడిగా నిలబెట్టాయి. ఇదికథకాదు, 47 రోజులు చిత్రాల్లో మెగాస్టార్‌ చిరంజీవిని నెగెటివ్‌ క్యారెక్టర్‌లో చూపించారు  బాలచందర్‌. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో చిరంజీవి సొంతంగా రుద్రవీణ చిత్రాన్ని నిర్మించారు. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో నటించడం ద్వారానే కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటివారు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇలా సినిమా రంగంలో ఎంతో మందికి బ్రేక్‌ ఇచ్చిన బాలచందర్‌ కవితాలయా ప్రొడక్షన్స్‌ను స్థాపించింది తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో సినిమాలు  నిర్మించారు. చిత్రసీమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు బాలచందర్‌. సగటు మనిషి జీవితంలోని అనేక కోణాలను ఆవిష్కరిస్తూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు రూపొందించి దర్శకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కె.బాలచందర్‌ జయంతి జూలై 9. ఈ సందర్భంగా ఆ దర్శకదిగ్గజానికి నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.