English | Telugu
'అవే కళ్లు' షూటింగ్‌లో భయపడ్డ కృష్ణ.. ధైర్యం చెప్పి ప్రోత్సహించిన కాంచన!
Updated : Jun 11, 2021
సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రం 'అవే కళ్లు' (1967). అప్పట్లోనే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టవడమే కాకుండా అప్పటికే 'గూఢచారి 116'తో యాక్షన్ హీరోగా ఆకట్టుకున్న కృష్ణను మాస్‌కు మరింత దగ్గర చేసింది. తెలుగులో డిటెక్టివ్ సినిమాలకు ఒక వేవ్ తెచ్చిన స్టార్‌గా కృష్ణ చరిత్రలో నిలిచిపోయారు. 'అవే కళ్లు' సినిమాలో హీరోయిన్‌గా కాంచన నటించారు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత వారి కలయికలో వచ్చిన 'వింత కాపురం', 'తల్లీకొడుకులు', 'నేనంటే నేనే' లాంటి సినిమాలు వచ్చి విజయం సాధించాయి.
ఎ.సి. త్రిలోక్ చందర్ డైరెక్ట్ చేసిన 'అవే కళ్లు' చిత్రాన్ని ఏవీఎం ప్రొడక్షన్స్ ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. ఇందులోని "మావూళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది.." పాట ఆ రోజుల్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో! ఈ మూవీ తమిళ వెర్షన్‌లో హీరోగా రవిచంద్రన్ నటించారు. రెండు భాషల్లోనూ కాంచనే హీరోయిన్. దాంతో ఆమె ఈ సినిమా చేసేటప్పుడు చాలా అవస్థపడ్డారు. కృష్ణ, రవిచంద్రన్ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి షూటింగ్ ముగించుకొని వెళ్లిపోయేవారు. ఆమె మాత్రం ఇరుక్కుపోయారు. వేరే ఏ చిత్రం షూటింగ్‌లోనూ పాల్గొనడానికి వీల్లేకుండా పోయేది. అస్సులు రెస్ట్ ఉండేది కాదు.
"ఆ సమయంలోనే నాకు జ్వరం కూడా వచ్చేసింది. అయినా రాత్రీ పగలూ షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. అప్పట్లో కృష్ణ కొంచెం భయపడేవారు. కొత్త కదా. నేనే ఆయనకు ధైర్యంచెప్పి ప్రోత్సహించేదాన్ని. చాలా మంచివాడు. మా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ఎలా విజయం సాధించాయో అందరికీ తెలిసిందే కదా." అని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.