English | Telugu

రిలీజ్‌కు ముందే 'ఆర్ఆర్ఆర్' ఆల్‌టైమ్ ఇండియ‌న్ సినిమా రికార్డ్‌!

 

య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి సినిమా అంటే ఏమిటో మ‌రోసారి దేశం మొత్తానికి తెలిసింది. 'బాహుబ‌లి' సిరీస్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌మౌళి.. ఇప్పుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం'తో మ‌రోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. విడుద‌ల‌కు ముందే 'ఆర్ఆర్ఆర్‌' బిజినెస్ ప‌రంగా ఆల్‌టైమ్ ఇండియ‌న్ సినిమా రికార్డ్ సృష్టించింది. 

డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. అన్ని భాష‌ల్లో క‌లిపి శాటిలైట్ అండ్ డిజిట‌ల్ రైట్స్ ఏకంగా రూ. 330 కోట్ల‌కు అమ్ముడ‌వ‌డం ఏ ర‌కంగా చూసినా అసాధార‌ణం. ఈ హ‌క్కుల‌ను జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. 

అలాగే ద‌క్షిణాది రాష్ట్రాల్లో హిందీ కాకుండా మిగ‌తా భాష‌ల్లో థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ. 327 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయ‌ని స‌మాచారం. హిందీ వెర్ష‌న్ థియేట్రిక‌ల్ హ‌క్కులు రూ. 140 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. ఒక సౌత్ ఫిల్మ్ హిందీ వెర్ష‌న్ రైట్స్ ఈ రేంజ్‌కు అమ్ముడ‌వ‌డం మ‌రో రికార్డ్‌. అలాగే ఓవ‌ర్సీస్ థియేట‌ర్ హ‌క్కులు రూ. 80 కోట్లు ప‌లికాయి. ఆడియో, బ్రాండింగ్ ఇత‌ర హ‌క్కులు కూడా క‌లుపుకుంటే టోట‌ల్‌గా 'ఆర్ఆర్ఆర్' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 900 కోట్ల పైమాటే అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. సో.. ప్రొడ్యూస‌ర్ దాన‌య్య పంట పండింద‌న్న మాటే!

వాస్త‌వానికి 'ఆర్ఆర్ఆర్‌'ను ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇదివ‌ర‌కు అనౌన్స్ చేశారు. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్‌కు ప‌దే ప‌దే విఘాతం క‌ల‌గ‌డం వ‌ల్ల అనుకున్న స‌మ‌యానికి సినిమా పూర్త‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దాంతో ఈ సినిమా ఈ ఏడాది కాకుండా 2022 ఆరంభంలో కానీ, స‌మ్మ‌ర్‌లో కానీ విడుద‌ల కావ‌చ్చ‌ని చెబుతున్నారు.