Read more!

English | Telugu

రామ్‌గోపాల్‌వర్మ సినిమాకు బయ్యర్లు కరవు.. రిలీజ్‌ అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది!

ఆ సినిమా సూపర్‌హిట్‌ అయింది, ఆ సినిమా పెద్ద కళాఖండం, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అది.. ఒక సినిమా సూపర్‌హిట్‌ అయిన తర్వాత వినిపించే మాటలివి. ఆ తర్వాత అదే సినిమాని నంది అవార్డులు, జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి. అలాంటి కొన్ని సినిమాలకు సంబంధించిన కొన్ని విశేషాలను వింటున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే సినిమా షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ చేసేందుకు ఆయా దర్శకనిర్మాతలు పడని కష్టాలు ఉండవు, బయ్యర్ల కోసం లెక్కకు మించిన షోలు వేస్తారు. కానీ, ఏ డిస్ట్రిబ్యూటరూ ఆ సినిమాను తీసుకునేందుకు ముందుకు రారు. చివరికి నానా తంటాలు పడి నిర్మాత సినిమాను రిలీజ్‌ చేస్తారు. ఎంతో మంది బయ్యర్లు చూసి పెదవి విరిచిన ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు, ప్రభుత్వాలు అవార్డులతో సత్కరిస్తాయి. అలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్న సినిమాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. సినిమా రిలీజ్‌కి ముందు కనీసం 100 షోలు బయర్ల కోసం వేశారు. రిలీజ్‌ తర్వాత ఆ సినిమాకి ఎలాంటి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి పరిస్థితే రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ‘మనీ’ చిత్రానికి కూడా వచ్చింది. శివనాగేశ్వరరావును దర్శకుడుగా పరిచయం చేస్తూ రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. 

ముదుమలై ఫారెస్ట్‌లో ‘క్షణక్షణం’ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో తన దగ్గర అసోసియేట్‌గా పనిచేస్తున్న శివనాగేశ్వరరావుతో వర్మ ‘నువ్వు నా దగ్గరే ఉండిపోవచ్చు కదా.. సినిమాకి 5 లక్షలు ఇస్తాను’ అన్నారు. అప్పటికి శివనాగేశ్వరరావుకి అసోసియేట్‌గా సినిమాకి 75 వేలు ఇచ్చేవారు. వర్మ ఇచ్చిన ఆఫర్‌ని కాదన్నాడు శివనాగేశ్వరరావు. తాను డైరెక్టర్‌ అవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు. తాను ఒక బేనర్‌ పెట్టబోతున్నానని, అందులో డైరెక్టర్‌గా పరిచయం చేస్తానని వర్మ మాట ఇచ్చాడు. చెప్పినట్టుగానే కొన్ని రోజులకు తన బేనర్‌ వర్మ క్రియేషన్స్‌లో శివనాగేశ్వరరావుకి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు వర్మ. ‘రూత్‌లెస్‌ పీపుల్‌’ అనే సినిమా చూడమని, ఆ కథ అయితే బాగుంటుందని సజెస్ట్‌ చేశాడు. ఆ సినిమా చూసిన శివనాగేశ్వరరావు దానికి తెలుగు నేటివిటీని జోడిరచి ఒక కథను సిద్ధం చేశాడు. వర్మకి కూడా అది బాగా నచ్చింది. దానికి ‘మనీ’ అనే టైటిల్‌ని కూడా వర్మే సూచించాడు. 

జె.డి.చక్రవర్తి, చిన్నా, జయసుధ ప్రధాన పాత్రలుగా అనుకున్నారు. దూరదర్శన్‌లో సురభి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రేణుకా సహాని హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలోని మరో ముఖ్యమైన పాత్రకు ఎవరిని తీసుకుందామా అని ఆలోచించారు. ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, దాసరి నారాయణరావు పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. చివరికి క్షణక్షణం చిత్రంలో విలన్‌గా నటించిన పరేష్‌ రావల్‌ను సుబ్బారావు క్యారెక్టర్‌కి సెలెక్ట్‌ చేసుకున్నారు. క్షణక్షణం చిత్రంలో తన క్యారెక్టర్‌ తానే డబ్బింగ్‌ చెప్పుకున్నారు పరేష్‌. ‘మనీ’ సినిమాలోని క్యారెక్టర్‌కి అతను డబ్బింగ్‌ చెప్పుకోవడం కరెక్ట్‌ కాదని భావించి, సంగీత దర్శకుడు చక్రవర్తితో డబ్బింగ్‌ చెప్పించారు. 

మొత్తానికి 1990లో ‘మనీ’ షూటింగ్‌ ప్రారంభమైంది. కొంతకాలం బాగానే జరిగింది. ఆ తర్వాత పరేష్‌ రావల్‌కు యాక్సిడెంట్‌ అవ్వడంతో మూడు నెలలు షూటింగ్‌కి బ్రేక్‌ పడిరది. మూడు నెలలు గడిచిన తర్వాత అతను కమిట్‌ అయి ఉన్న హిందీ సినిమాలు పూర్తి చెయ్యాల్సి వచ్చింది. అవి కూడా పూర్తి చేసి ‘మనీ’ సెట్స్‌కి వచ్చాడు. అలా 6 నెలలపాటు బ్రేక్‌ పడిరది. ఎలాగైతే సినిమాని పూర్తి చేసారు. సినిమా ఫుటేజ్‌ 9వేల అడుగులు వచ్చింది. సెన్సార్‌ నిబంధనల ప్రకారం ఒక సినిమా కనీసం 11వేల అడుగులు ఉండాలి. మిగతా రెండువేల అడుగులు ఏం తియ్యాలా అని శివనాగేశ్వరరావు, వర్మ ఆలోచిస్తున్నప్పుడు వారికి బ్రహ్మానందంతో ఒక ఎపిసోడ్‌ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలా వచ్చిన ఆలోచనే ఖాన్‌దాదా ఎపిసోడ్‌. ఎంతో హిలేరియస్‌గా ఉండేలా ఆ ఎపిసోడ్‌ని డిజైన్‌ చేశాడు శివనాగేశ్వరరావు. రెండున్నర రోజుల్లో ఈ ఎపిసోడ్‌ను షూట్‌ చేశారు. మొదటి రోజు చేసిన షూటింగ్‌తో ఎంతో శాటిస్‌ఫై అయిన డైరెక్టర్‌ అప్పటికప్పుడు బ్రహ్మానందంపై ‘వారెవా ఏమి ఫేసు..’ అనే పాటను క్రియేట్‌ చేశారు. మొత్తానికి సినిమా పూర్తయింది. తెలుగు, హిందీ వెర్షన్లకు కలిపి రూ.55 లక్షలు ఖర్చయింది. ఇక  అసలైన కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. సినిమాను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎంతోమంది బయ్యర్లకు లెక్కకు మించిన షోలు వేశారు. ఆ సినిమాను చూడని బయ్యర్‌ లేడంటూ అప్పట్లో ఒక టాక్‌ ఉండేది. ఈ సినిమాతోపాటు స్టార్ట్‌ అయిన సినిమాలు, ఆ తర్వాత స్టార్ట్‌ అయిన సినిమాలు కూడా రిలీజ్‌ అయిపోతున్నాయి. ‘మనీ’ మాత్రం డబ్బాల్లోనే ఉండిపోయింది. అలా సినిమా రిలీజ్‌ అవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది. 1990లో ప్రారంభమైన ఈ సినిమా 1993లో రిలీజ్‌ అయింది. మొదట్లో అంతగా కలెక్షన్లు లేకపోయినా.. ఆ తర్వాత ఊపందుకున్నాయి. ముఖ్యంగా బ్రహ్మానందం ఖాన్‌ దాదా ఎపిసోడ్‌ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ‘ఖాన్‌తో గేమ్స్‌ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయి’ అనే డైలాగ్‌ అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. అలాగే జె.డి.చక్రవర్తి, చిన్నా, రేణుక, జయసుధ, పరేష్‌ రావల్‌ క్యారెక్టర్లు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి.

రిలీజ్‌ అవ్వడానికే ఎన్నో కష్టాలు పడిన ‘మనీ’ చిత్రం 8 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై అందర్నీ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్‌లోని ఓడియన్‌ థియేటర్‌లో 130 రోజులు రన్‌ అయింది. రూ.55 లక్షలతో రూపొందిన ఈ సినిమా ఫస్ట్‌ రన్‌లో రూ.3 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ‘గాయం’ 150 రోజుల ఫంక్షన్‌లోనే ‘మనీ’ శతదినోత్సవాన్ని కూడా జరిపారు. ఈ ఫంక్షన్‌కు శ్రీదేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘మనీ’ ప్రివ్యూ చూసి పెదవి విరిచిన ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి ఆ ఫంక్షన్‌లో శివనాగేశ్వరరావును సత్కరించి, భుజం తట్టి.. తాను పొరబడ్డానని చెప్పడం విశేషం. అంతేకాదు, ‘మనీ’ ఉత్తమ ద్వితీయ చిత్రంగా, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడుగా శివనాగేశ్వరరావు, ఉత్తమ హాస్యనటుడుగా బ్రహ్మానందం నంది అవార్డులు గెలుచుకున్నారు. ‘మనీ’ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మానందంకి వర్మ మారుతి కారును బహుమతిగా అందించారు.