English | Telugu
పోస్టర్స్‌లో దర్శకుడిగా దాసరి నారాయణరావు పేరును తీసేసి ఆఫీస్‌బోయ్ పేరు వేసిన నిర్మాత!
Updated : May 25, 2024
రచయితగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 250 సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన దర్శకరత్న దాసరి నారాయణరావును ‘తాత మనవడు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశారు ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ. తనను దర్శకుడిగా పరిచయం చేసిన రాఘవ పట్ల ఎప్పుడూ గౌరవంగానే ఉండేవారు దాసరి. అయితే ‘తూర్పు పడమర’ చిత్ర నిర్మాణ సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అవి సద్దుమణగకపోగా తారాస్థాయికి చేరుకున్నాయి. అసలు ఈ విభేదాలు రావడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి? వాటివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం.
తమిళ్‌లో కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రాన్ని తెలుగులో ‘తూర్పు పడమర’ పేరుతో రీమేక్ చేశారు. తమిళ్‌లో కమల్‌హాసన్, రజినీకాంత్, శ్రీవిద్య, జయసుధ నటించారు. తమిళ్‌లో ముఖ్యపాత్ర పోషించిన శ్రీవిద్య తెలుగులోనూ అదే పాత్రలో నటించారు. మిగతా పాత్రలను సత్యనారాయణ, మోహన్‌బాబు, నరసింహరాజు, మాధవి పోషించారు. సత్యనారాయణ, నరసింహరాజు తండ్రీకొడుకులుగా... శ్రీవిద్య, మాధవి తల్లీకూతుళ్ళుగా నటించారు. తమిళ్‌లో రజినీకాంత్ చేసిన పాత్రను తెలుగులో మోహన్‌బాబు పోషించారు. తనకంటే వయసులో పెద్దదైన శ్రీవిద్యను నరసింహరాజు ప్రేమిస్తాడు, అలాగే శ్రీవిద్య కూతురు మాధవి తనకంటే వయసులో పెద్దవాడైన నరసింహారాజు తండ్రిని ప్రేమిస్తుంది. ఈ విచిత్రమైన ప్రేమకథ అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. భేతాళ కథల్లో జవాబులేని ఆఖరి ప్రశ్నగా ఈ కథ ఉంటుంది. బాలచందర్ తీసిన ఎన్నో సినిమాలు ఒక పజిల్‌లాగే అనిపిస్తాయి. ఈ కథ కూడా ఆ కోవలోనే నడుస్తుంది.
తనను దర్శకుడుగా పరిచయం చేసిన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్‌లో దాసరి నారాయణరావు చేసిన మూడో సినిమా ఇది. ఈ సినిమా ప్రారంభమైన రోజు నుంచీ దాసరి, నిర్మాత రాఘవ మధ్య విభేదాలు మొదలయ్యాయి. తమిళ్‌లో నటించిన ఆర్టిస్టులతోనే తెలుగులోనూ తీస్తే కొన్ని సన్నివేశాలు మళ్ళీ తియ్యాల్సిన అవసరం ఉండదని, వాటినే తెలుగు వెర్షన్‌కి కూడా వాడుకోవచ్చని రాఘవ అభిప్రాయపడ్డారు. కమల్‌హాసన్, రజినీకాంత్ కూడా తెలుగులో నటించేందుకు ఆసక్తి కనబరిచారు. కానీ, దాసరి మాత్రం దానికి అంగీకరించలేదు. ఆ సన్నివేశాలనే తెలుగులోనూ వాడేట్టయితే మళ్ళీ తెలుగులో తియ్యడం దేనికి? దాన్నే తెలుగులోకి డబ్ చేస్తే సరిపోతుంది కదా అన్నారు దాసరి. దీంతో దాసరిపై రాఘవకు విపరీతమైన కోపం వచ్చింది. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. చివరికి తన నిర్ణయాన్నే అమలు పరిచారు దాసరి.
తమిళ్ వెర్షన్‌కు కొన్ని మెరుగులు దిద్ది ‘తూర్పు పడమర’ చిత్రాన్ని రూపొందించారు దాసరి. ఈ సినిమాకి దర్శకుడిగానే కాదు, మాటల రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 1976 అక్టోబర్ 24న ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. రమేష్‌నాయుడు సంగీత సారధ్యంలో రూపొందిన అన్ని పాటలు విజయఢంకా మోగించాయి. అప్పట్లో ఎక్కడికి వెళ్లినా ఇవే పాటలు వినిపించేవి. అంతగా ఈ సినిమాలోని పాటలు పాపులర్ అయ్యాయి. అయితే ఈ విజయాన్ని నిర్మాత రాఘవ ఆస్వాదించలేకపోయారు. ఎందుకంటే సినిమా ప్రారంభం నుంచి దాసరి నారాయణరావు మీద ఎంతో కోపంగా ఉన్నారాయన. ఆరోజుల్లో పబ్లిసిటీ పోస్టర్స్‌లో తమ పేర్లను వెరైటీగా వేసుకునేవారు కె.బాలచందర్, దాసరి నారాయణరావు. డైరెక్టర్‌గా వారి పేర్లను మబ్బుల్లో వేసుకునేవారు. ‘తూర్పు పడమర’ చిత్రానికి కూడా దాసరి అలాగే చేశారు. కానీ, దాసరి మీద ఉన్న కోపంతో మబ్బుల్లో ఉన్న దాసరి పేరును తీసేసి ఆ స్థానంలో ‘ఆఫీస్ బోయ్ గోపాల్’ అనే పేరును వేసి తన కక్ష తీర్చుకున్నారు రాఘవ. దర్శకుడు దాసరి పేరు వున్న స్థానంలో ఆఫీస్ బోయ్ పేరుతో పోస్టర్స్ ప్రింట్ చేయించడంపై ఆ తర్వాత పెద్ద గొడవే జరిగింది. ఈ ఉదంతంతో దాసరి నారాయణరావు, కె.రాఘవల మధ్య దూరం పెరిగింది. ఈ వివాదం తర్వాత వీరిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చెయ్యలేదు.