English | Telugu
తొలిరోజుల్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ తనను ఆదరించిన తీరుకు ఆశ్చర్యపోయిన కృష్ణంరాజు!
Updated : May 25, 2024
ఏ నటుడికైనా, ఏ నటికైనా ప్రశంస అనేది ఎంతో బలాన్నిస్తుంది. మరిన్ని మంచి పాత్రలు చేసేందుకు కొత్త ఉత్సాహాన్ని గుండెల్లో నింపుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో కొత్త నటీనటులు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారిని చులకన భావంతో చూడడం కొంతమంది సీనియర్స్ నైజం. కానీ, కొందరు మాత్రం అలా ఉండరు. కొత్తగా వచ్చేవారిని ప్రోత్సహించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. అలాంటి అరుదైన సంఘటనలు తన కెరీర్ ప్రారంభంలో ఎదురైనట్టు రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఆయన జీవించి ఉన్న రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్వూలో తెలిపారు. తనను ఎంతో ప్రోత్సహించి తన ఎదుగుదలకు కారణమైన ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు.
1966లో వచ్చిన ‘చిలకా గోరింకా’ చిత్రంతో కృష్ణంరాజు హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. అప్పటికే 100 సినిమాలు పూర్తి చేసిన కృష్ణకుమారి ఈ సినిమాలో కృష్ణంరాజు సరసన నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ సమీపంలోని భువనగిరి కోటలో జరిగింది. చాలా భాగం షూటింగ్ జరిగిన తర్వాత ఎస్.వి.రంగారావు కాంబినేషన్‌లో కృష్ణంరాజు నటించాల్సి ఉంది. కానీ, దానికి సంబంధించిన సీన్ పేపర్స్ మద్రాస్ నుంచి ఆత్రేయ పంపించాలి. ఈ విషయంలో ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టే ఆత్రేయ ‘చిలకా గోరింకా’ సినిమా విషయంలో కూడా అదే చేశారు. ఓ పక్క ఎస్వీఆర్ డేట్స్ అయిపోతున్నాయి. మరుసటి రోజు మరో సినిమా షూటింగ్‌కి హాజరు కావాల్సి ఉంది. చివరి రోజు సాయంత్రం 4 గంటలకు సీన్ పేపర్స్ వచ్చాయి. తన కాంబినేషన్‌లో నటించబోతున్న కృష్ణంరాజును చూసి ‘కొత్త కుర్రాడితో ఈ సీన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది’ అని చిరాకు పడ్డారు ఎస్వీఆర్. షూటింగ్ ప్రారంభమైంది. ప్రతి షాట్‌ను సింగిల్ టేక్‌లో ఓకే చేస్తున్న కృష్ణంరాజును చూసి ఎస్వీఆర్ ముగ్ధుడైపోయారు. ఒకరోజు పట్టే షూటింగ్ రెండు గంటల్లో పూర్తయింది. కృష్ణంరాజును ఎస్వీఆర్ విశేషంగా ప్రశంసించారు. మరుసటిరోజు ఎస్వీఆర్ మద్రాస్ వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత యూనిట్ సభ్యులంతా మద్రాస్ చేరుకున్నారు. కృష్ణంరాజు పరిచయస్తులంతా తనని అభినందిస్తుంటే ఆశ్చర్యం కలిగింది. తన గురించి ఎస్వీఆర్ అందరికీ చెప్పడం వల్లే తనకు కంగ్రాట్స్ చెబుతున్నారని కృష్ణంరాజుకి అర్థమైంది. ఎస్వీఆర్ అక్కడా, ఇక్కడా చెప్పిన మాటలు పేపర్లు సైతం ప్రచురించాయి. దీంతో కృష్ణంరాజుకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. మద్రాసులో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న స్టూడియోలోనే శ్రీకృష్ణతులాభారం షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్‌ను చూద్దామని ఆ సెట్‌కి వెళ్లిన కృష్ణంరాజును చూసి ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. తన పక్కన కూర్చోబెట్టుకొని ‘ఎస్వీఆర్ నీ గురించి చాలా గొప్పగా చెప్పారు. నీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని ఆశీర్వదించారు. తన మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అలాంటిది తనతో ఆయన అంత ప్రేమగా మాట్లాడడం కృష్ణంరాజుకి ఆశ్చర్యాన్ని కలిగించింది.
‘చిలకా గోరింకా’ 1966 జూన్ 10న విడుదలైంది. సినిమాకి ఆశించిన ఫలితం దక్కలేదు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు వచ్చినా కృష్ణంరాజు చెయ్యడానికి ఒప్పుకోలేదు. నటనలో మరింత మెరుగ్గా ఉండాలనే ఉద్దేశంతో కొన్నాళ్ళు శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురుచూశారు. కానీ, ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఒక సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్‌గా నటించారు కృషంరాజు. ‘ఇంటి దొంగలు’ చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత హీరోగా బిజీ అయిపోయారు. ఆ సమయంలోనే చలసాని గోపి, హరిరామజోగయ్యలతో కలిసి ‘కృష్ణవేణి’ చిత్రాన్ని నిర్మించారు కృష్ణంరాజు. ఈ సినిమా ఫస్ట్‌కాపీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా షో వేసి ఎన్టీఆర్‌కు చూపించారు. సినిమా చూసిన ఆయన ఎంతో ప్రశంసించారు. రివర్స్ సెంటిమెంట్ కథాంశంతో ఎంతో ధైర్యంగా సినిమా చేశారన్నారు. ఈ సినిమా గురించి ఎంతో మంది ఎన్నోరకాలుగా చెబుతారని, అవేవీ పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా శతదినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దానికి ముఖ్యఅతిథిగా ఎన్.టి.రామారావును ఆహ్వానించారు. కానీ, ఆ సమయంలో షూటింగ్ ఉందని, కుదరకపోవచ్చని, అవకాశం ఉంటే తప్పకుండా వస్తానని అన్నారు ఎన్టీఆర్. ఇచ్చిన మాట కోసం షూటింగ్‌నే క్యాన్సిల్ చేసుకొని ఫంక్షన్‌కు హాజరయ్యారు ఎన్టీఆర్. ఆ తర్వాత కృష్ణంరాజు నిర్మాణంలోనే రూపొందిన ‘భక్త కన్నప్ప’ ఫస్ట్ కాపీని కూడా మొదట ఎన్టీఆర్‌కే చూపించారు. సినిమా చూసిన ఎన్టీఆర్ క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చెప్పారు. అలా చేస్తే ఇంకా ఇంపాక్ట్ ఉంటుందని అన్నారు. కానీ, ఆ మార్పులు చేసేందుకు దర్శకుడు బాపు ఒప్పుకోలేదు. అలాగే రిలీజ్ చేశారు. ‘భక్త కన్నప్ప’ విడుదలై సంచలన విజయం సాధించింది. అలా కెరీర్ ప్రారంభంలోనే ఎస్.వి.రంగారావు, ఎన్.టి.రామారావు వంటి దిగ్గజ నటుల ప్రోత్సాహం కృష్ణంరాజుకి లభించింది. ఎవరైనా మంచి పేరు తెచ్చుకుంటున్నారంటే అసూయపడే మన సమాజంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టే కృష్ణంరాజు వంటి నటులు వెలుగులోకి వచ్చారు. తన ఎదుగుదలకు కారకులైన వారిద్దరి గురించి ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకొని వారికి కృతజ్ఞతలు తెలిపేవారు కృష్ణంరాజు.