English | Telugu

ఇది తెలుసా.. రావుగోపాలరావు నటనకు ఎస్‌.వి.రంగారావు పెద్ద ఫ్యాన్‌!

ఇదెలా సాధ్యం?.. ఎస్‌.వి.రంగారావు 1974లోనే కన్నుమూసారు. ఇక రావుగోపాలరావుకి నటుడిగా మంచి బ్రేక్‌ ఇచ్చిన సినిమా 1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు’. అంతకుముందు ఓ ఇరవై సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ అతనిలోని నటనా పటిమ గురించి ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు రావుగోపాలరావు నటనకు ఎస్‌.వి.రంగారావు ఫ్యాన్‌ ఎలా అవుతారు అనుకోవచ్చు. కానీ, ఇది అక్షరాలా నిజం. నాటక రంగం నుంచి వచ్చిన వారు సినిమాల్లో తప్పకుండా రాణిస్తారు అనడానికి రావుగోపాలరావు గొప్ప ఉదాహరణ. అయితే ఆయనకు నటన కంటే దర్శకత్వంపైనే ఎక్కువ మక్కువ ఉండేది. నటుడు కావాలన్న ఆలోచన రావుగోపాలరావుకి లేదు. ఓసారి కాకినాడలో ‘కీర్తిశేషులు’ అనే నాటకంలో మురారి పాత్రను పోషించడమే కాకుండా ఆ నాటకానికి దర్శకత్వం కూడా వహించారు గోపాలరావు. ఆ నాటకాన్ని ఎస్‌.వి.రంగారావు తిలకించి గోపాలరావు బృందాన్ని అభినందించారు. కాకినాడలో ఎస్వీఆర్‌ బంధువు ఉండడం వల్ల తరచూ అక్కడికి వచ్చేవారు. వచ్చినప్పుడల్లా గోపాలరావు నాటకాలను చూసేవారు. ఆయన నటన చూసి ఎస్వీఆర్‌ ఎంతో ముగ్ధులయ్యేవారు. ఆయన డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌ని ఎనలైజ్‌ చేసేవారు. ఓ నాటకంలో ఆయన నటన చూసి ‘నేను నీ అభిమానినయ్యా’ అని రావుగోపాలరావుతో చెప్పారు ఎస్వీఆర్‌. అంత గొప్ప నటుడై ఉండి కూడా తనకు అభిమానినని చెప్పడంతో ఆయనపై గోపాలరావుకు ఎంతో గౌరవం పెరిగింది.

గోపాలరావును ఎలాగైనా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలనుకున్న ఎస్వీఆర్‌ ఆయన్ని మద్రాస్‌ పిలిపించారు. దర్శకుడు జి.రామినీడు రూపొందిస్తున్న ‘భక్తపోతన’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా  పనిచేసే అవకాశం కల్పించారు. అంతేకాదు, ఆ సినిమాలో రాజా మామిడి శింగనామాత్యుని పాత్ర ఇప్పించారు. ఆ క్యారెక్టర్‌ రావుగోపాలరావుకి ఇప్పించడం వెనుక ఓ కథ ఉంది. ఆ సినిమాలో శ్రీనాథుని పాత్రను పోషించారు ఎస్వీఆర్‌. శృంగార నైషధాన్ని రాజుకి అంకితమిచ్చే సన్నివేశం సినిమాలో ఉంటుంది. ఆ రాజు పాత్ర ఎవరో చేస్తే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టడం ఇష్టంలేని ఎస్వీఆర్‌.. ఆ పాత్రకు అర్హుడు రావుగోపాలరావే అని భావించి అతనిచేత ఆ వేషం వేయించారు. ఆ తర్వాత చాలా సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గోపాలరావు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు. ఆయన నటన, వాయిస్‌ నచ్చి తను నిర్మిస్తున్న ‘జగత్‌కిలాడీలు’ చిత్రంలో విలన్‌ భయంకర్‌గా నటించే అవకాశం ఇచ్చారు నిర్మాత రాఘవ. అయితే సినిమా పూర్తయిన తర్వాత రావుగోపాలరావు వాయిస్‌ బాగాలేదని పంపిణీదారులు చెప్పడంతో వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కూడా ఆయన వాయిస్‌ బాగా లేదని చాలా మంది అనేవారు. ఇది గోపాలరావును ఎంతో బాధించేది. 

అప్పటివరకు తనను విమర్శించిన వారితోనే శభాష్‌ అనిపించుకోవాలన్న పట్టుదలతో నటనలో, డైలాగ్‌ డెలివరీలో ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకొని తనను తాను మార్చుకున్నారు గోపాలరావు. ఆ తర్వాత రావుగోపాలరావు చాలా సినిమాల్లో చెప్పిన డైలాగ్స్‌ ఎంత పాపులర్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఎంతో మంది విమర్శించిన ఆ స్వరమే కొన్నాళ్ళ తర్వాత మిమిక్రీ కళాకారుల పాలిట వరంగా మారింది. రావుగోపాలరావు వాయిస్‌ని ఇమిటేట్‌ చెయ్యకుండా ఏ మిమిక్రీ కళాకారుడు ప్రదర్శన ఇవ్వరంటే అతిశయోక్తి కాదు. నటుడిగా రావుగోపాలరావుకు పెద్ద బ్రేక్‌ ఇచ్చిన సినిమా బాపు దర్శకత్వంలో వచ్చిన ‘ముత్యాల ముగ్గు’. ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ చిత్రంలోని రావుగోపాలరావు డైలాగ్స్‌ ఎంత పాపులర్‌ అయ్యాయంటే.. కొలంబియా రికార్డింగ్‌ కంపెనీ కేవలం డైలాగులతో కూడిన రికార్డ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అప్పటివరకు సినిమా పాటలే రికార్డులుగా వచ్చేవి. కేవలం డైలాగులతో రికార్డు విడుదల కావడం అదే ప్రథమం. ఆ ఘనతను దక్కించుకున్నారు రావుగోపాలరావు. ‘ముత్యాల ముగ్గు’ తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో తన నటనతో, డైలాగులతో ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని అందించారు. మూడు తరాల హీరోలకు విలన్‌గా నటించిన ఘనత రావుగోపాలరావుది. దాదాపు 400 సినిమాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన ఆయన ఎక్కువగా విలన్‌గానే నటించారు. 

కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినిమాలో విలన్‌ అంటే రావుగోపాలరావే. సినిమాల్లో భయంకరమైన విలన్‌గా కనిపించే ఆయన నిజజీవితంలో ఎంతో సాత్వికమైన మనసు కలవారు. అందరితోనూ ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. దానికి ఉదాహరణ.. తన వైవాహిక జీవితంలో ఏనాడూ తన భార్యను ఏకవచనంతో పిలిచి ఎరుగరు రావుగోపాలరావు. హరికథ కళాకారిణి అయిన కమలకుమారిని కాకినాడలో హరికథ చెబుతుండగా చూసి ఆమెతో ప్రేమలో పడిపోయారు. 1966లో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారుల్లో రావు రమేష్‌ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటూ తండ్రి పేరును నిలబెడుతున్నారు.