English | Telugu
రెహమాన్ మ్యూజిక్‌లో తమిళ్ పాట పాడేందుకు ఒప్పుకున్న మైఖేల్ జాక్సన్. కానీ...
Updated : Aug 7, 2024
పాప్‌స్టార్‌గా మైఖేల్ జాక్సన్‌కి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. జాక్సన్ పాటలంటే చెవి కోసుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జాక్సన్.. సింగర్‌గా, డాన్సర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా, లిరిక్ రైటర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి గొప్ప కళాకారుడ్ని కలవడమే మహాభాగ్యంగా అందరూ భావించేవారు. అలాంటిది అతనితో ఒక పాట పాడించాలనుకున్నారు ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్.
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం జరుగుతున్న రోజులవి. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఎ.ఆర్.రెహమాన్ లాస్ ఏంజిలిస్‌లో ఉన్నారు. అతనికి ఎందుకో మైఖేల్ జాక్సన్‌ని ఒకసారి కలవాలి అనిపించింది. ఇదే విషయాన్ని తన మేనేజర్‌కి చెప్పడంతో అతను జాక్సన్ పి.ఎ.తో మాట్లాడాడు. అతను మరో మాట లేకుండా ‘తప్పకుండా కలవొచ్చు’ అని చెప్పాడు. ఇది జరిగి వారం రోజులు గడిచినా అటువైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అదే టైమ్‌లో తాను ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్నట్టు అకాడమీ ప్రకటించింది. అప్పుడు జాక్సన్ తనని కలవాలనుకుంటున్నారని రెహమాన్‌కి మెయిల్ వచ్చింది. ఆస్కార్‌లో తన నామినేషన్ ఉంది కాబట్టి ఒకవేళ అవార్డు గెలిస్తే అతన్ని కలవాలని డిసైడ్ అయ్యారు. అందుకే జాక్సన్‌కి రెహమాన్ రిప్లై ఇవ్వలేదు.
ఆస్కార్ అకాడమీ ఆహ్వానం మేరకు అవార్డుల వేడుకకు హాజరయ్యారు రెహమాన్. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ‘జయహో..’ పాటకు రెహమాన్‌ను ఆస్కార్ అవార్డు వరించింది. ఆ ఫంక్షన్ జరిగిన మరుసటి రోజు సాయంత్రం మైఖేల్ జాక్సన్‌ను కలిసేందుకు వెళ్లారు రెహమాన్. తనను ఓ గదిలో కూర్చోమని చెప్పారు. అప్పుడు చేతులకు గ్లోవ్స్ ధరించిన ఒక వ్యక్తి రెహమాన్ ఉన్న గదిలోకి వచ్చారు. అతనే మైఖేల్ జాక్సన్. అప్పుడు రెహమాన్ ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే తన చేతిలో గెలుచుకున్న ఆస్కార్ అవార్డులు ఉన్నాయి. రెహమాన్‌తో జాక్సన్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అతన్ని కలుసుకున్న ఆ మధుర క్షణాలను తను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని రెహమాన్ చెబుతారు. ఇది జరిగిన తర్వాత చెన్నయ్ తిరిగి వచ్చేశారు రెహమాన్.
‘రోబో’ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను మొదలు పెట్టారు. ఆ సమయంలోనే తను మైఖేల్ జాక్సన్‌ని కలిసిన విషయం డైరెక్టర్ శంకర్‌కి చెప్పారు రెహమాన్. అప్పుడు ‘మనం మైఖేల్ జాక్సన్‌తో పాట పాడిస్తే ఎలా ఉంటుంది?’ అని శంకర్‌ని అడిగారు రెహమాన్. ‘మరి తమిళ్ పాట పాడతారా’ అనే సందేహాన్ని వెలిబుచ్చారు శంకర్. ఇదే విషయం గురించి మైఖేల్ జాక్సన్‌తో మాట్లాడారు రెహమాన్. దానికి జాక్సన్ ‘తప్పకుండా పాడతాను’ అని అన్నారట. అయితే అది సాధ్యపడలేదు. ఇది జరిగిన కొన్నిరోజులకే మైఖేల్ జాక్సన్ అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత 50 సంవత్సరాల వయసులోనే ఆయన మరణించడం అందరికీ తెలిసిందే. అలా జాక్సన్‌తో పాట పాడించాలనుకున్న రెహమాన్ కోరిక నెరవేరలేదు.