English | Telugu
డైరెక్టర్ టి.రాజేందర్ మోసానికి బలైన నిర్మాతలు.. విడుదలకు నోచుకోని సినిమా!
Updated : Aug 6, 2024
ప్రస్తుతం టాప్ హీరోలుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న నట వారసులంతా కేవలం సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వల్లే ఆ స్థాయికి రాలేదు. టాలెంట్, క్రమశిక్షణ, కృషి, హీరోగా నిలబడాలన్న పట్టుదల వల్లే హీరోలుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అయితే కొందరు హీరోల తనయులు ఆ విషయాలను అంత సీరియస్‌గా తీసుకోకుండా, కెరీర్ పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మరుగున పడిపోయారు. అలాంటి వారిలో సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు ఒకరు. 1974లో ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రమేష్‌బాబు 1981 వరకు ఆరు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆ తర్వాత 1987లో ‘సామ్రాట్ ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. హిందీలో సూపర్‌హిట్ అయిన ‘బేతాబ్’ చిత్రం రీమేక్‌గా ‘సామ్రాట్’ రూపొందింది.
1983లో టి.రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన అనువాద చిత్రం ‘ప్రేమసాగరం’ తెలుగులో పెద్ద సంచలనం సృష్టించింది. రాజేందర్ దర్శకత్వంలో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, సంగీతం.. ఇలా పలు శాఖలు నిర్వహించేవారు. యూత్‌పుల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత రాజేందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘ప్రేమ సామ్రాజ్యం’, ‘మైథిలీ నా ప్రేయసి’ చిత్రాలు కూడా ఘనవిజయం సాధించాయి. ఆ సమయంలో రమేష్‌బాబు హీరోగా రాజేందర్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తే అతని కెరీర్‌కి బాగా ప్లస్ అవుతుందని భావించారు సూపర్‌స్టార్ కృష్ణ. అలా 1988లో రమేష్‌బాబు, టి.రాజేందర్ కాంబినేషన్‌లో ‘ప్రేమచరిత్ర’ చిత్రం ప్రారంభమైంది. రమేష్‌బాబు సరసన శ్రీభారతిని హీరోయిన్ ఎంపిక చేశారు. మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాకి కృష్ణ సోదరుడు హనుమంతరావు బావమరుదులు శాఖమూరి రాంబాబు, శాఖమూరి సూరిబాబు నిర్మాతలు.
ఫస్ట్ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. రెండో షెడ్యూల్ జరుగుతున్న సమయంలో ఒకరోజు సెట్‌లో హీరోయిన్ శ్రీభారతితో దర్శకుడు రాజేందర్‌కు గొడవ జరిగింది. తను చెప్పినట్టు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో ఆమెపై చేయి చేసుకున్నారు కూడా. దాంతో భయపడిపోయిన శ్రీభారతి తను ఈ సినిమా చెయ్యనని సెట్ నుంచి వెళ్లిపోయింది. అప్పుడు బాలీవుడ్ హీరోయిన్ చాందినిని ఎంపిక చేశారు. ఆ తర్వాత మూడో షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్నిరోజులు షూటింగ్ చేశారు. కానీ, అనుకోని అవాంతరాల వల్ల షూటింగ్ సరిగా జరగలేదు. అలా కొన్ని నెలలపాటు షూటింగ్ ఆగిపోయింది.
1989 డిసెంబర్ 15న ‘ప్రేమచరిత్ర’ షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది. అయితే ఆలస్యమైన కారణంగా కథలో చాలా మార్పులు చేశారు. అంతేకాదు, అంతకుముందు అనుకున్న కొందరు ఆర్టిస్టులను కూడా పక్కన పెట్టి వేరే ఆర్టిస్టులను తీసుకున్నారు. అప్పటివరకు తీసిన సినిమాను పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేశారు. ఈసారి ఎక్కడా బ్రేక్ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా సినిమా కంప్లీట్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన ఆడియోను మార్కెట్‌లోకి విడుదల చేశారు. అప్పటికి టి.రాజేందర్ పాటలకు జనంలో మంచి క్రేజ్ ఉంది. ‘ప్రేమచరిత్ర’ పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. 1990లో మే 31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.
సినిమా ప్రారంభించే ముందు రాజేందర్ తయారు చేయించిన అగ్రిమెంట్‌లో ఏముందో చూసుకోకుండా నిర్మాతలు సంతకాలు పెట్టేశారు. తనకు అనుకూలంగా ఆ అగ్రిమెంట్‌ని తయారు చేయించుకున్నారు రాజేందర్. దాంతో ‘ప్రేమచరిత్ర’ చిత్రం పూర్తి హక్కులు ఆయన సొంతమయ్యాయి. ఈ విషయంలో దర్శకుడికీ, నిర్మాతలకు మధ్య పెద్ద గొడవే జరిగింది. అలా ‘ప్రేమచరిత్ర’ సినిమా విడుదల ఆగిపోయింది. ఇదే చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి ‘శాంతియాంతు శాంతి’ పేరుతో తమిళ్‌లో విడుదల చేశారు రాజేందర్. తమిళ్ వెర్షన్‌లో రాజేందర్ ఓ ముఖ్య పాత్ర పోషించగా, అతనికి భార్యగా హీరోయిన్ రాధ నటించారు. అప్పటికే రాధ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉండడంతో టైటిల్ కూడా సినిమాలోని ఆమె పాత్ర పేరుతోనే పెట్టారు. ఆ సినిమా అక్కడ ఘనవిజయం సాధించి రాజేందర్‌కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అలా రమేష్‌బాబు నటించిన సినిమా తమిళ్‌లో కూడా విడుదలైంది. తమిళ దర్శకుడు టి.రాజేందర్ మోసానికి తెలుగు నిర్మాతలు రాంబాబు, సూరిబాబు బలయ్యారు. అప్పటికే ‘ప్రేమచరిత్ర’ పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. అదే ఊపులో సినిమా కూడా రిలీజ్ అయి ఉంటే కృష్ణ అనుకున్నట్టుగా రమేష్‌బాబుకి చాలా ప్లస్ అయి ఉండేది. ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాకపోవడం అతని దురదృష్టమే అనుకోవాలి. రమేష్‌బాబు కెరీర్‌లో ప్రారంభమై ఆగిపోయిన సినిమాలు, మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఓ అరడజను ఉంటాయి.